తేనెటీగ సైన్యం!

ABN , First Publish Date - 2022-07-31T06:12:39+05:30 IST

అనగనగా ఓ కారడవి. వసంత వేళ వచ్చాక అడవి అంతా పూలు పూచాయి. పైనుంచి పక్షులు చూస్తోంటే..

తేనెటీగ సైన్యం!

నగనగా ఓ కారడవి. వసంత వేళ వచ్చాక అడవి అంతా పూలు పూచాయి. పైనుంచి పక్షులు చూస్తోంటే.. అడవి ‘పూల నవ్వు’ నవ్వినట్లుంది. అసలే పున్నమి వసంతకాలం. రాత్రిళ్లూ పూలతో అడవి మెరుస్తోంది. పూల సువాసనలు అడవంతా గుప్పుమంటున్నాయి. ఈ పూలను చూసి.. తేనీగలు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా తేనుటీగల గుంపు. ఎటు చూసినా తేనెతుట్టెలు పెడుతున్నాయి. తేనెటీగల ఆనందం చూసి ఓ డేగల గుంపు అసూయపడింది.


తేనెటీగలను చంపేయాలని డేగలు పథకం పన్నాయి. డేగలన్నీ కలసి సమావేశమయ్యాయి. ‘తేనె టీగలను చంపేద్దాం. ఆ పూలన్నీ వాటి వల్లే పూసినట్లు మిడిసిపడుతున్నాయి’ అన్నది డేగరాజు. అందరూ ఆ డేగరాజుకు వంత పాడారు. ఓ వృద్ధ డేగ ముందుకు వచ్చింది. ‘ఇది సృష్టి ధర్మం. తేనెటీగలు లేకపోతే అంతా ధ్వంసమే. అయినా తేనెటీగలతో మనకు పోటీ ఏంటీ? వాటిని సంహరించటం అంత సులువు కాదు. మనలాగే అక్కడ రాణి తేనెటీగలు ఉంటాయి. అవి తెలివైనవి’ అంటూ బోధ చేసింది.‘పెద్దవారి మాట వినటానికి బావుంటుంద’ని డేగరాజు మాట్లాడింది. వెంటనే డేగరాజు దగ్గర ఉండే మంత్రి ముందుకు వచ్చి- ‘మహారాజా.. మనం కాకుల సాయమూ తీసుకుందాం’ అన్నది. కాకులరాజును రమ్మన్నారు. ‘తేనెటీగలకు మాకు శతృత్వం లేదు. వాటితో పోరాడటం కష్టం’ అన్నాడు కాకుల రాజు. అయినా డేగరాజు మనసు మార్చుకోలేదు. ఆ రోజు రాత్రి మళ్లీ సమావేశమై.. డేగ సైనికులంతా తేనెటీగలను ఎలా అంతమొందించాలో రాజు,మంత్రి,సైనికాధిపతి కలసి పథకం రచించారు.


ఉదయాన్నే తేనెతుట్టెల మీదకు అనూహ్యంగా డేగలు దాడి చేశాయి. తేనెటీగలకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని డేగలు మరో వైపు పూలను నాశనం చేస్తున్నాయి. తేనెటీగలన్నీ శబ్దాలతో మాట్లాడుకున్నాయి. అడవిలోని మిగతా తేనెటీగలకు యుద్ధం వచ్చిందని అర్థమైంది. ప్రతి తేనె తుట్టెలోని రాణి తేనెటీగల సమక్షంలో యుద్ధానికి దిగాయి తేనెటీగలు. వందల తేనెటీగలను డేగలు చంపుతున్నాయి. అయితే తేనెటీగలు భయపడలేదు. రెట్టించిన ఉత్సాహంతో డేగలను చుట్టుకున్నాయి. గుంపుగా ఒక్కో డేగపై దాడికి దిగాయి. ఇష్టమొచ్చినట్లు డేగలను కుడుతున్నాయి. పోరాటం చేయలేక అలసిపోయి డేగలన్నీ పారిపోవడానికి సిద్ధమయ్యాయి. కొన్ని డేగలు చనిపోతున్నాయి. వందల డేగలను కొన్ని లక్షల తేనెటీగలు చుట్టుముట్టడంతో అవన్నీ పారిపోయాయి. దగ్గరలోని కొలనులో దాక్కోండి అంటూ డేగరాజు సెలవు ఇచ్చాడు. డేగలన్నీ లోతైన కొలనుపై వాలాయి. తలలు ముంచాయి. తల పైకి ఎత్తుతూనే తేనెటీగలు దాడి చేయడంతో.. ఆ కొలనులోనే డేగలన్నీ చచ్చిపోయాయి.

Updated Date - 2022-07-31T06:12:39+05:30 IST