Bikini Clad Professor: బికినీ ధరించిన ప్రొఫెసర్... రెప్ప వేయకుండా చూసిన విద్యార్థి...

ABN , First Publish Date - 2022-08-09T20:34:56+05:30 IST

నగరంలోని సెయింట్ జేవియర్స్ విశ్వవిద్యాలయంలో గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా

Bikini Clad Professor: బికినీ ధరించిన ప్రొఫెసర్... రెప్ప వేయకుండా చూసిన విద్యార్థి...

కోల్‌కతా : నగరంలోని సెయింట్ జేవియర్స్ విశ్వవిద్యాలయంలో గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసిన ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. తాను బికినీ ధరించి తీయించుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశానని, ఆ ఫొటోలను తన వద్ద చదువుతున్న ఓ విద్యార్థి తదేకంగా చూడటాన్ని ఆ విద్యార్థి తండ్రి గమనించారని చెప్పారు. ఆ తండ్రి విశ్వవిద్యాలయం అధికారులకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా తనను ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టారని ఆరోపించారు. 


ఆ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంఘటన గత ఏడాది జరిగింది. ఆ విద్యార్థి వయసు దాదాపు 18 సంవత్సరాలు ఉంటుంది. అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఆయన తండ్రి ఆమెపై విశ్వవిద్యాలయం అధికారులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లోదుస్తులు ధరించి, అశ్లీలంగా, అసహ్యంగా, అభ్యంతరకరంగా కనిపిస్తున్న ఫొటోలను తన కుమారుడు చూస్తూండగా, తాను పట్టుకున్నానని చెప్పారు. ఓ తండ్రిగా తన కుమారునికి చదువు చెప్పే ప్రొఫెసర్ ఈ విధంగా కనిపించడంతో సిగ్గుపడ్డానని పేర్కొన్నారు.  ఆ ఫొటోల్లో ఆమె లైంగికంగా రెచ్చగొట్టేవిధంగా కనిపించారని తెలిపారు. ఈ ఫిర్యాదు నకలును సోషల్ మీడియా యూజర్ బీకే ముఖర్జీ బయటపెట్టారు. 


ఈ ఫిర్యాదును తనకు 2021 అక్టోబరు 7న విశ్వవిద్యాలయం అధికారులు చూపించారని ఆమె చెప్పారు. ఈ ఫిర్యాదుతోపాటు తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని కొన్ని ఫొటోలను కూడా జత చేశారన్నారు. వాటిలో ఏ ఫొటోలు అభ్యంతరకరంగా ఉన్నాయో తనకు చెప్పలేదన్నారు. విశ్వవిద్యాలయం పరువు పోగొడుతున్నందుకు రాజీనామా చేయాలని తనపై అధికారులు ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే విశ్వవిద్యాలయం అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. ఆమె స్వయంగా తనంతట తానే రాజీనామా చేశారని చెప్పారు. 


తనపై ఒత్తిడి తెచ్చి, రాజీనామా చేసే విధంగా ప్రేరేపించిన విశ్వవిద్యాలయం వీసీ‌తోపాటు ఇతర అధికారులపై ఆమె 2021 అక్టోబరు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఈ ఫొటోలను ఉద్యోగంలో చేరడానికి ముందు పోస్ట్ చేశానని చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, తన ఫొటోలను లీక్ చేసి, సర్క్యులేట్ చేసి ఉంటారని ఆరోపించారు. విశ్వవిద్యాలయం అధికారుల చర్య లైంగిక వేధింపుల క్రిందకు వస్తుందని, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేయడమవుతుందని చెప్పారు. 


ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చాలా మంది విశ్వవిద్యాలయం చర్యను ఖండిస్తున్నారు. ఇది తిరోగమన చర్య అని మండిపడుతున్నారు. 


Updated Date - 2022-08-09T20:34:56+05:30 IST