రోజుకు సగటున 60పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-08-08T09:53:17+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున 60 మంది కరోనా బారిన పడుతున్నట్టు

రోజుకు సగటున 60పాజిటివ్‌లు

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి 

అన్ని శాఖల్లోనూ కొవిడ్‌ బాధితులు 

బిక్కుబిక్కుమంటులున్న అధికారులు, ప్రజలు 

నాయకులు, వారి కుటుంబాల్లోనూ భయంభయం


కొత్తగూడెం, ఆగస్టు 7 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున 60 మంది కరోనా బారిన పడుతున్నట్టు నిర్ధారణవుతుండటం, ఇదే క్రమంలో కరోనాతో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 50మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో పాటు కరోనాతో భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి, మణుగూరు కరోనా ఐసోలేషన్‌ వార్డు ఇన్‌చార్జ్‌ అయిన డాక్టర్‌ జి.నరేష్‌ కుమార్‌ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా అటు వైద్యశాఖతో పాటు ఇటు ప్రజల్లోనూ దడ మొదలైంది. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, పలువురికి పాజిటివ్‌ వస్తుండటంతో ఆ శాఖ ఉక్కిరిబిక్కిరవుతోంది. సింగరేణి సంస్థలోనూ కరోనా కలకలం రేపుతుండగా కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో రిక్రూట్‌మెంట్‌ సెల్‌లో పనిచేస్తున్న పర్సనల్‌ మేనేజర్‌ ఒకరు కరోనాతో గురువారం మృతిచెందారు. అంతేకాదు కొత్తగూడెం ఏరియా, సింగరేణి ప్రధాన కార్యాలయంలో కూడా పలువురు అధికారులకు పాజిటివ్‌ రావడం భయాందోళనకు గురిచేస్తోంది.


ఇప్పటికే ఆరుగురు సింగరేణి కార్మికులు కరోనాతో మృతిచెందినట్లు సమాచారం. ఇటీవల జడ్పీ సీఈవో ఇన్‌చార్జ్‌ డీఆర్‌డీఏ పీడీ కూడా కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వీరే కాదు రాజకీయ నాయకులు, వారి కుటుంబసభ్యులు కూడా పలువురు కరోనా బారిన పడ్డారు. మొత్తం మీద జిల్లాలోని పలుశాఖల్లో కరోనా విజృంభణ కొనసాగుతుండగా ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబాలు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి.  ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. శుక్రవారం జూలూరుపాడు, అశ్వారావుపేట, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వాపురం, చుంచుపల్లి, చర్ల, దుమ్ముగూడెం, కొత్తగూడెం, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మిగిలిన మండలాల్లో ర్యాపిడ్‌ కిట్లు లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు.

Updated Date - 2020-08-08T09:53:17+05:30 IST