బానిసత్వపు ఆలోచనలకు చరమగీతం

ABN , First Publish Date - 2022-09-16T06:36:43+05:30 IST

బ్రిటిష్ వలసవాదం నుంచి మనకు విముక్తి లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము...

బానిసత్వపు ఆలోచనలకు చరమగీతం

బ్రిటిష్ వలసవాదం నుంచి మనకు విముక్తి లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆగస్టు 15న, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటనుంచి యావద్దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ‘పంచ ప్రణ్’ (ఐదు ప్రతిజ్ఞలు) గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి భారతీయుడు ఈ ఐదింటిని పాటిస్తే వచ్చే 25 ఏళ్లలో (దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లూ పూర్తయ్యే అమృత కాలం నాటికి) భారతదేశం ‘విశ్వగురు’గా అభివృద్ధి సాధించడాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఈ ఐదు ప్రతిజ్ఞల్లో ఒకటి మనలోని బానిసత్వపు ఆలోచనలను నిర్మూలించుకుని మన దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించారు. ‘వందల ఏళ్లనాటి బానిసత్వం మన ఆలోచనల్లో వికృతిని పెంచి పోషించింది. మన మనసులో, మన అలవాట్లలో, ఏ మూలనైనా ఆ ఆనవాళ్లుంటే దాన్ని వెంటనే తుడిచేయాలి. ఇతరుల్లా ఉండేందుకు మనం ప్రయత్నించాల్సిన పనిలేదు. ప్రపంచం నుంచి మనకు ధ్రువీకరణ అవసరం లేదు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


భారతదేశానికి ఉన్న శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చని, కానీ ఈ బానిసత్వపు ఆలోచనలే మన సామర్థ్యానికి అడ్డుగా నిలుస్తున్నాయన్నది ప్రధానమంత్రి ఆలోచన. అన్నింటినీ స్వీకరించాలని చెబుతున్న మన నాగరిక విలువల కారణంగా అవసరమైన, అసలైన చర్చను బహిరంగంగా, నిజాయితీగా జరిపేందుకు మనం తటపటాయిస్తున్నాం. కాలక్రమేణా ఇది మనల్ని గత చరిత్రను విస్మరిస్తూ వాస్తవాలను కూడా గుర్తించలేని భ్రమల్లోకి తీసుకెళ్లింది.


ఈ దృక్కోణంలోనే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా చూడవచ్చు. భారతదేశం ఆంగ్లేయుల పాలన నుంచి ఆగస్టు 15, 1947న స్వతంత్రమైనప్పటికీ నాటి హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు దాదాపు 13 నెలలు పట్టింది. ఉక్కు మనిషి, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకమైన చొరవతీసుకుని హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ఉపక్రమించారు. సంస్థాన ప్రజలూ సర్వస్వాన్నీ త్యాగం చేస్తూ పోరాడారు. ఈ కారణాల ఫలితంగా నిజాం అరాచక పాలననుంచి ప్రజలకు విమోచన లభించింది. తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేందుకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 ఏళ్లు పట్టింది. ఇది అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించడం, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ముఖ్య అతిథిగా, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను విశిష్ట అతిథులుగా ఆహ్వానించడం జరిగింది.


మన తెలంగాణ కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన కొమురం భీం, రాంజీ గోండు, తుర్రేబాజ్ ఖాన్, షోయబుల్లాఖాన్, వందేమాతరం రామచంద్రరావు, నారాయణ రావ్ పవార్, దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణ రావు, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావులను స్మరించుకునేందుకు ఇదొక సరైన సమయం. ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించి ఇలాంటి ఎందరో పోరాట యోధులను గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పెరుగుతున్న సాంకేతికత ద్వారా పెద్దల త్యాగాలను తర్వాతి తరాలకు అందజేసేలా అనేక ప్రణాళికలకు రూపకల్పన జరుగుచున్నది.


తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేకపోవడానికి కారణం పూర్తిగా రాజకీయ పరమైన దివాళాకోరుతనమే. ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (మజ్లిస్) పార్టీని సంతుష్టిపరిచేందుకు అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు పనిచేస్తున్నాయి. తద్వారా మన ఘనమైన చరిత్రకు గండికొట్టేందుకు కూడా ఈ పార్టీలు వెనుకాడటం లేదు. హైదరాబాద్ సంస్థానంలో అరాచకాన్ని సృష్టించిన ఖాసీం రజ్వీ, లక్షా 50వేల మంది మజ్లిస్ వాలంటీర్లతో రజాకార్ సైన్యాన్ని ఏర్పాటుచేయడం, ఈ రజాకార్లు గ్రామాల్లో విధ్వంసం, అరాచకం, దోపిడీ, హత్యాకాండ చేయడం, మహిళలపై అత్యాచారాలు, పురుషులను చంపడం ఇవన్నీ తర్వాతి తరానికి తెలియజేయకుండా ఉండేందుకు పాలకపార్టీలు తమవంతుగా పనిచేశాయి. చరిత్రను విస్మరించిన జాతి ముందడుగేయడం కష్టమన్న సామాన్యమైన అంశాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టాయి.


బైరాన్‌పల్లి ఘటనకు ఇప్పటికీ అక్కడి బురుజులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వందలమందిని నిలబెట్టి రజాకార్లు పిట్టలను కాల్చినట్లు కాల్చారు. ఆ గ్రామాన్ని లూటీ చేసి తమ వికృతరూపాన్ని ప్రదర్శించారు. వరంగల్ జిల్లాలోని పరకాల ప్రజలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే నిజాం, రజాకార్లు జీర్ణించుకోలేక హత్యాకాండకు పాల్పడిన చరిత్ర నేటి యువతకు తెలవాల్సిన అవసరం ఉంది.


రంగాపురం గ్రామంలో ప్రజలను చెట్టుకు కట్టేసి కాల్చడం, లక్ష్మీపురంలో మహిళలపై అత్యాచారాలు చేసి బంగారాన్ని, ధనం, ధాన్యాన్ని లూటీ చేయడం వంటి ఘటనలు, రజాకార్ల ఆకృత్యాల గురించి నేటి తరానికి తెలియాలి. ఈ ఘటనలను దక్షిణ భారత జలియన్ వాలాబాగ్ ఘటనగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ణించారు. నిర్మల్‌లో ఆ ప్రాంతంలో నిజాం రాక్షస పాలనకు అడుగడుగునా అడ్డుపడుతున్న రాంజీ గోండు, ఆయన అనుచరులు వెయ్యిమందిని మర్రి చెట్టుకు ఉరితీసిన నిజాం దుర్మార్గాల గురించి కూడా తెలంగాణ భవిష్యత్తయిన విద్యార్థులకు తెలవాల్సిన అవసరం ఉంది.


అందుకే నాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికీ నిజాం పాలనలోని వాస్తవాలను తెలియజేస్తూ, వారి అరాచక పాలన నుంచి విమోచనం కోసం మన పెద్దలు చేసిన పోరాటాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విషయాలన్నీ తెలిస్తే, తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరమేంటనేది ప్రజలకు అర్థమయితే, తమ రాజకీయ కుట్రల గురించి అందరికీ తెలిసిపోతుందని అనేక సంవత్సరాలుగా పాలకపార్టీలు భావిస్తున్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి ఎనిమిది సంవత్సరాలు గడిచినా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇతర రాజకీయ పార్టీలు కూడా విమోచన దినాన్ని జరుపుకునే విషయంలో అర్థంలేని ప్రకటనలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకోవడం నిజాంను అవమానించడం అవుతుందని, ఇది ముస్లిం సమాజానికి ఆగ్రహం కలిగిస్తుందని కొందరు మాయమాటలు చెబుతున్నారు.


ఈ సంతుష్టీకరణ ఆలోచనలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. కానీ వీళ్లతో పాటు ప్రజలంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజాంకు వ్యతిరేకంగా చాలా మంది ముస్లింలు పోరాడారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ‘ఆమ్రోజ్’ పత్రికను స్థాపించి, నిజాం కంటిమీద కునుకులేకుండా చేసిన షోయబుల్లాఖాన్‌ను రజాకార్లే క్రూరాతిక్రూరంగా చంపించిన సంగతిని మనం గుర్తుచేసుకోవాలి. విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కుల, మతాలకు అతీతంగా నిజాం, రజాకార్లపై పోరాటం చేసిన వీరులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీరందరి కృషి కారణంగానే తెలంగాణ, భారతదేశంలో విలీనమైంది. మన గడ్డమీద త్రివర్ణపతాకం ఎగిరింది. మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి.


అందుకే మన స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2022, సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడగునా ఘనంగా మన వీరులను సంస్మరించుకునే కార్యక్రమాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బానిసత్వపు ఆలోచనలను విడనాడి మన వాస్తవ చరిత్రను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో కేంద్రం విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ స్వాతంత్ర్యం కోసం, అరాచక పాలననుంచి విముక్తి కోసం పోరాడిన వారి త్యాగాలను యావద్దేశానికి పరిచయం చేయడమే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల’ లక్ష్యం.


1948లో నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ హైదరాబాద్ వేదికగా జాతీయ పతాకాన్ని ఎగరేసిన 74 ఏళ్ల తర్వాత మళ్లీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన ఉత్సవాలను చేపట్టడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమం మన గతాన్ని స్మరించుకుంటూ పోరాటయోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని మనకు గుర్తుచేస్తుంది. అందుకే ఈ సెప్టెంబర్ 17న మనమంతా ఆత్మగౌరవంతో త్రివర్ణ పతాకాలను ఎగరేద్దాం. మనలోని బానిసత్వపు ఆలోచనలకు, ఓటుబ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడదాం.


జి. కిషన్ రెడ్డి

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు

Updated Date - 2022-09-16T06:36:43+05:30 IST