బీజేపీ నేత కారులో ఈవీఎం... నలుగురు అధికారులపై ఈసీ వేటు...

Published: Fri, 02 Apr 2021 13:31:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీ నేత కారులో ఈవీఎం... నలుగురు అధికారులపై ఈసీ వేటు...

న్యూఢిల్లీ : అస్సాంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను ప్రైవేటు కారులో తరలించిన సంఘటనపై ఎన్నికల కమిషన్ శుక్రవారం స్పందించింది. బీజేపీ అభ్యర్థికి చెందిన కారులో ఈవీఎంను తరలించినట్లు ఆరోపణలు రావడంతో నలుగురు పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఈవీఎం భద్రంగానే ఉందని, దీనికి వేసిన సీలు చెక్కు చెదరలేదని వివరించింది. 


అస్సాం శాసన సభ రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. రటబరి నియోజకవర్గం, ఇందిరా ఎంవీ స్కూల్‌ పోలింగ్ అధికారులు  పోలింగ్ పూర్తయిన తర్వాత ఓ ఈవీఎంను పత్తర్‌కండి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్ కారులో తీసుకెళ్తున్నట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతోపాటు లాఠీఛార్జ్ చేసి, నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఈవీఎం భద్రంగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఈవీఎంను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించేందుకు ఎన్నికల అధికారులు అంతకుముందు ఉపయోగించిన కారు చెడిపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న ఓ కారును ఆపారని, ఆ కారు బీజేపీ నేతకు చెందినదని ఆ తర్వాత తెలిసిందని మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆరోపణలు రావడంతో ఈవీఎంను పరిశీలించామని, బీయూ, సీయూ, వీవీపాట్‌లతో కూడిన ఈవీఎం సురక్షితంగా, భద్రంగా ఉందని తెలిపింది. దీని సీలు కూడా కట్టుదిట్టంగా ఉందని, చెక్కు చెదరలేదని వివరించింది. దీనిని స్ట్రాంగ్‌రూమ్‌కు అప్పగించినట్లు తెలిపింది. ఈ సంఘటనపై నివేదికను సమర్పించాలని స్పెషల్ అబ్జర్వర్‌ను కోరినట్లు తెలిపింది. నలుగురు పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు వివరించింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.