విస్తరిస్తున్న నేర సంస్కృతి

ABN , First Publish Date - 2022-06-24T06:54:37+05:30 IST

నగరంలో నేర సంస్కృతి రోజు రోజుకూ విస్తరిస్తోంది. నిత్యం నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో నగర ప్రజలు ఉలి క్కిపడుతున్నారు. చిన్న కారణాలకే కత్తులు, కరవాలలతో యువకులు గ్రూప్‌లుగా ఏర్పడి నడిరోడ్లపై ఘర్షణలకు దిగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

విస్తరిస్తున్న నేర సంస్కృతి

నగరంలో రెచ్చిపోతున్న అల్లరిమూకలు

తల్వార్లు, పిస్టళ్లతో స్వైరవిహారం

అర్ధరాత్రి బైకులపై కత్తులతో సంచారం

తాజాగా ఇద్దరిపై కత్తులతో దాడి

ప్రాణాపాయ స్థితిలో యువకులు

ఖిల్లా, జూన్‌ 23: నగరంలో నేర సంస్కృతి రోజు రోజుకూ విస్తరిస్తోంది. నిత్యం నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో నగర ప్రజలు ఉలి క్కిపడుతున్నారు. చిన్న కారణాలకే కత్తులు, కరవాలలతో యువకులు గ్రూప్‌లుగా ఏర్పడి నడిరోడ్లపై ఘర్షణలకు దిగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మొదలుకొని వందల సంఖ్యలో సాయుధ బలగాలు మోహరించి ఉండే జిల్లా కేంద్రంలోనే శాంతిభద్రతలు అదుపుతప్పి నేరప్రవృత్తి విస్తరిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామంగా మా రింది. ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమలులో ఉండడం వల్ల ప్రజల్లో పోలీసులంటే భయం లేకుండా పోయింది. బర్త్‌డే కేక్‌ కోయడానికి సైతం తల్వార్‌లను వినియోగిస్తున్నా వారిపై పోలీసులు కేసులు పెట్టక పోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. నగర శివారులోని ధర్మపురి హిల్స్‌లో ఓ రౌడీషీటర్‌ తన ఉనికి చాటుకోవడానికి జైలు నుంచి వచ్చిన తర్వాత తల్వార్‌తో కాలనీలో పర్యటించి అమాయకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా అదే తల్వార్‌ ప్రమాదవశాత్తు తన కడుపులోకి దిగి ప్రాణాలు సైతం వదిలాడు. అదేవిధంగా ఆటోనగర్‌లో ఓ అల్లరి మూక తన మిత్రుడి పుట్టిన రోజున కారుపై కత్తితో షికారు చేసిన ఘటన జరిగింది. ఈ ఊరేగింపులో కొందరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు ఆ వీడియో మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే రెండు నెలల క్రితం ఆటోనగర్‌లోని ఓ హోటల్‌లో టీ తాగే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి కత్తులతో దాడులు చేసుకునే వరకు వచ్చింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఫ తాజాగా ఐదో టౌన్‌లో..

నగరంలోని ఐదవ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి సైడ్‌ ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో విశ్వనాథ్‌, సా యికృష్ణ అనే యువకులు ప్రాణాపాయ స్థితిలో ఉం డగా వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఐదవ టౌన్‌ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ వివరించారు.. వడ్డేర కాలనీకి చెందిన భాను, ప్రభాకర్‌, విశ్వనాథ్‌, ప్రమోద్‌, సాయికృష్ణలు కలిసి ఆటోలో టీ తాగడానికి రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా అదే సమయానికి 300 క్వార్టర్స్‌కు చెందిన అజ్జు, ఖాజ, జుబేర్‌, సాదత్‌, సలాం, ఫోరోజ్‌లు బైక్‌లపై అదే రోడ్డు ద్వారా వారు కూడా టీ తాగడానికి  వెళ్తున్నారు. వారిని దాటడానికి ఆటోలో ఉన్న వారు సైడ్‌ ఇవ్వాలని హారన్‌ కొట్టారు. దానిని అలుసుగా తీసుకున్న అజ్జు, ఖాజలు వారికి సైడ్‌ ఇవ్వక పోగా ఆటోను ఆపి ఘర్షణకు దిగారు. మాట మాట పెరగడంతో అజ్జు, ఖాజ తన ద్విచక్రవాహనంలో ఉన్న పొడవాటి కత్తిని తీసి సాయికృష్ణ, విశ్వనాథ్‌లపై వెనుక నుంచి పొడిచారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండ డంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఫ అర్ధరాత్రి వరకు ఫంక్షన్లు..

నగర శివారు ప్రాంతాల్లో శుభకార్యాలయాలు చేసుకోవడానికి భారీ ఎత్తున ఫంక్షన్‌హాళ్లు నిర్మించారు. ఆయా ఫంక్షన్‌హాళ్లలో ఫంక్షన్లు తెల్లవార్లు జరుగుతుండడం వల్ల ప్రజలు రాత్రి వేళ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. పోలీసులు వాటిపై దృష్టి పెట్టి సమయ నిబంధనలు పెట్టకపోవడంతో రాత్రి 8గంటలకు మొదలు కావాల్సినవి రాత్రి 10గంటలకు ప్రారంభమై తెల్లవారు 1గంట వరకు జరుగుతున్నాయి. దీంతో ఆ ఫంక్షన్లకు వచ్చే యువకులు రాత్రి వేళలో అడ్డూ అదుపు లేకుండా టీ తాగడానికి అని మరేఇతర పనులకని వాహనాలపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పూర్తిస్థాయిలో లేకపోవడంతో అల్లరి మూకలు మరింత రెచ్చిపోతున్నారు.

నేరాల అదుపునకు 

ప్రత్యేక నిఘా: ఏసీపీ 

నేరాల అదుపునకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో కొన్ని సంఘటనలు ప్రమాదవశాత్తుగాను అనుకోని విధంగాను జరుగుతున్నాయి. అయినప్పటికీ చట్ట పరిధిలో నేరస్థులుగా ఉన్న వారిని కఠినంగా శిక్షించడానికి ఉన్నతాధికారుల సమన్వయంతో వ్యవహరిస్తున్నాం. ప్రజలు సైతం పోలీసుశాఖకు సహకరించాలని అనుమానాస్పదంగా కనబడితే డయల్‌ 100కు లేదా సంబంధిత పోలీసు స్టేషన్‌లకు సహకారం అందించాలి.

Updated Date - 2022-06-24T06:54:37+05:30 IST