అయితే... ఇది అసాధ్యం!

Published: Mon, 27 Apr 2020 10:18:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అయితే... ఇది అసాధ్యం!

ఆంధ్రజ్యోతి(27-04-2020):

కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటూ, అందరిలో స్థయిర్యాన్ని నింపుతున్నవారిలో వైద్యసిబ్బంది ముందువరుసలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది... రిస్క్‌జోన్‌లో పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. డెట్రాయిట్‌లోని ప్రముఖ ఆసుపత్రి ‘సినాయ్‌ గ్రేస్‌’లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న మికాయెలా సకల్‌ అనుభవమిది... 


‘‘ఒక నర్సుగా ఇది నా మొదటి ఉద్యోగం. శిక్షణలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. చావుబతుకుల మధ్య ఉన్న 26 మంది కరోనా బాధితులను 12 గదుల్లో ఎలా ఉంచాలో నాకు అస్సలు అర్థం కాలేదు. వారిని బాత్రూమ్‌కు తీసుకెళ్లాలన్నా, వారికి ఏ అవసరం వచ్చినా, వారి కుటుంబసభ్యులకు ఏమైనా చెప్పాలన్నా ఏంటీ పరిస్థితి? సమయం సరిపోవడం లేదని వారికి ఎలా చెప్పాలి? ఆ ఫ్లోరులో ఉన్న ఒకే ఒక్క నర్సును నేను. పైగా వారిలో ఎనిమిది మంది లైఫ్‌ సపోర్టు మీద, మరికొందరు మరణం అంచున ఉన్నారు. 


శిక్షణ వేరు... సీన్‌ వేరు...

అప్పటిదాకా నర్సింగ్‌ కోర్సులో చదువుకున్నది మర్చిపోయా. ఆ సమయానికి ఏది చేయాలో అది చేయడమే నా విధి అనిపించింది. నేను నా కొలీగ్స్‌ ప్రతీరోజూ రాత్రి డ్యూటీకి వచ్చి, రూల్సును పక్కనపెట్టి పనిచేస్తూనే ఉన్నాం. గత వారం బ్రేకింగ్‌ పాయింట్‌ వచ్చింది. ప్రతీ వారం ఏదో ఒక బ్రేకింగ్‌ పాయింట్‌ వస్తూనే ఉంది. కానీ అదే చివరి బ్రేకింగ్‌ పాయింట్‌. యథావిధిగా ఆ రోజు కూడా మేము 7 గంటలకు డ్యూటీకి వచ్చాం. డ్యూటీ ఎక్కగానే ఆ రోజు ఒక్కొక్క నర్సు ఎంతమంది పేషంట్స్‌ను చూడాలో లిస్టు చూస్తాం. సాధారణంగా ఒక్కో నర్సు ఎమర్జెన్సీ రూమ్‌ (ఈఆర్‌)లో నలుగురు పేషంట్లను అటెండ్‌ చేయాలని మాకు శిక్షణలో చెబుతారు. కాబట్టి నలుగురు మించి ఉండరనే అంచనా ఉంటుంది. అయితే మా ఛార్జ్‌ నర్సు సాల్‌ (హడ్వన్‌) హడావిడిగా వచ్చాడు. అతడి ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. వచ్చీరావడంతోనే ‘‘పేషెంట్స్‌ ఊహించనంత సంఖ్యలో ఉన్నారు. ఈ పరిస్థితి ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను’’ అన్నాడు. 


ఎమర్జెన్సీ రూమ్‌లో ఏడెనిమిది మంది నర్సులమే ఉన్నాం. ఆ రాత్రి ఒక్కొక్కరం కనీసం 15 మందిని చూడాల్సి రావొచ్చనుకున్నాం. ‘అయితే మరోసారి ఇలా చేయొద్దు... పేషెంట్లకు కూడా అది మంచిది కాదు... మరింత మంది స్టాఫ్‌ వచ్చేదాకా మేము ఫ్లోరులో రిపోర్ట్‌ చేయ’మని మేనేజ్‌మెంట్‌కు మెసేజ్‌ పెట్టాం. మేమంతా బ్రేక్‌రూమ్‌లోకి వెళ్లి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం.


ఎవరికైనా సవాలే!

సాధారణంగా నర్సు కావాలనుకునే ఎవరైనా సినాయ్‌ గ్రేస్‌ (డెట్రాయిట్‌) ఆసుపత్రిలో పనిచేయాలంటే ఎగిరి గంతేస్తారు. ఆ కారణంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ‘‘ఇక్కడ మీరు గ్రేట్‌ నర్స్‌ అవుతారు’’ అని చెబుతుంటారు చాలామంది. డెట్రాయిట్‌లో ఏ ఆసుపత్రికీ లేనన్ని ఎక్కువ అంబులెన్సులు ఇక్కడ ఉన్నాయి. అలాంటిచోట పని నేర్చుకునేందుకు క్రిటికల్‌ ఏరియాలో ఉండాలనుకున్నా. ఒక్కోసారి స్టాఫ్‌ తక్కువగా ఉన్నా మేనేజ్‌ చేసేవాళ్లం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కానీ నెల రోజుల నుంచి పరిస్థితి అదుపు తప్పింది. కొంతమంది స్టాఫ్‌ క్వారంటైన్‌ అవుతున్నారు. కొందరు వైరస్‌ బారిన పడ్డారు. మరోవైపు కరోనా బాధితులు పెరగడం మొదలయ్యింది. ఎమర్జెన్సీలో ఒక్కోసారి 110 మంది బాధితులుంటే నర్సుల సంఖ్య అందుకు తగ్గట్టుండేది కాదు.


భయంగా ఉండేది. ఆ రోజు రాత్రి జోయ్‌ (ఫ్రీడ్‌మన్‌)కి, నాకు 26 మంది క్రిటికల్‌ పేషెంట్ల బాధ్యతను అప్పగించారు. అత్యుత్తమ నర్సులలో అతడు కూడా ఒకరు. ఐసీయూకు పంపేముందు 26 మంది బాధితులను ‘ట్రాన్సిషనల్‌ కేర్‌’ (టీసీయూ) రూమ్‌లో ఉంచుతారు. అక్కడ మాకు డ్యూటీ వేశారు. బాధితుల్లో 8 మంది వెంటిలేటర్లపై, మిగతావారు సప్లిమెంట్‌ ఆక్సిజెన్‌తో ఉన్నారు. గోడకు ఆనుకుని స్ట్రెచర్స్‌ వరుసగా ఉన్నాయి. మా మీద ఎంత ఒత్తిడి ఉన్నా, ఆ సమయంలో ప్రతీ పేషెంట్‌  మాకు ముఖ్యమే. తినడానికి, కనీసం బాత్రూమ్‌కు వెళ్లడానికి కూడా సమయం లేదు. పేషెంట్‌ను బతికించడానికి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకే ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లి వారి పరిస్థితిని సమీక్షించేవాళ్లం. వాళ్ల శ్వాస తప్ప ఆ గదిలో మరే శబ్దాలూ వినిపించేవి కావు. మానిటర్‌ అలార్మ్‌, ఆక్సిజెన్‌ అలార్మ్‌, హార్ట్‌ రేట్‌ అలార్మ్‌ శబ్దాలతో ప్రతీ క్షణం ఏం జరుగుతోందోననే టెన్షన్‌లో పనిచేయడం ఎవరికైనా సవాలే.


ముందుకు సాగాల్సిందే...

రూములో ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడటం ఒకెత్తయితే, వారి మానసిక స్థితిని అంచనా వేస్తూ వారిలో మనోస్థయిర్యాన్ని నింపడం మరో ఎత్తు. కుటుంబసభ్యులెవరూ వారికి అందుబాటులో ఉండరు కాబట్టి వారికి ఆత్మీయులుగా ఉంటూనే, వారి బాధను పంచుకోవాల్సి ఉంటుంది. సాంత్వన చేకూర్చే చేతి స్పర్శ వల్ల వారి ముఖాల్లో ధైర్యం కనిపించేది. ఉదయం ఐదు గంటల సమయంలో పక్క రూమ్‌లో ఒక పేషెంట్‌ పరిస్థితి విషమించిందని జోయ్‌ అక్కడికి వెళ్లాడు. అప్పుడు 25 మంది పేషెంట్లను నేనొక్కదానే చూడాల్సి వచ్చింది. ఆక్సిజెన్‌ మాస్క్‌లు సరిగా ఉన్నాయో లేదో చూసుకుంటూ, వాటిని సరిచేస్తూండేదాన్ని. అప్పుడే ఒక వృద్ధుడి పరిస్థితి విషమించింది. జోయ్‌తో పాటు డాక్టర్లు కూడా వచ్చేసరికి ఆయన చనిపోయాడు. మనసులో బాధ ఉన్నప్పటికీ ముందుకు సాగాల్సిందే కదా!


నాకు తెలిసి ప్రతీ ఆసుపత్రిలో ఇదే పరిస్థితి ఉంటుంది. కరోనా అనేది ఒక మహమ్మారి. ఆసుపత్రుల్లో చేరే పేషెంట్లు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అసహనంగా, మరికొందరు కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. నర్సులుగా మేము వారి బాధను అర్థం చేసుకుని, వారి ఆరోగ్యం బాగుపడేలా చూడాలనుకుంటాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మా ముందు రెండు ఆప్షన్లు కనిపించాయి. ఒకటి- అంతమంది పేషెంట్లను చూసేందుకు తగిన స్టాఫ్‌ ఉండాలి. రెండు- లేదంటే మేము పని చేయకుండా వెళ్లిపోవాలి. ‘అయితే మొదటిది సాధ్యం కాదు... ఇక రెండోది ఇంకా అసాధ్యం’!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.