కాళీ మాతపై టీఎంసీ నేత మహువా మొయిత్రా వ్యాఖ్యలు... కేసు నమోదు...

ABN , First Publish Date - 2022-07-06T21:23:11+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువ మొయిత్రా (Mahua Moitra)పై బీజేపీ

కాళీ మాతపై టీఎంసీ నేత మహువా మొయిత్రా వ్యాఖ్యలు... కేసు నమోదు...

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువ మొయిత్రా (Mahua Moitra)పై బీజేపీ నేత ఫిర్యాదు మేరకు ఓ కేసు నమోదైంది. ఆమె కాళీ మాతను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ నేత జితేన్ ఛటర్జీ చేసిన ఫిర్యాదుపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది. అయితే మొయిత్రా స్పందిస్తూ, ‘బీజేపీ! రండి చూసుకుందాం’ అని వ్యాఖ్యానించారు. 


ఓ మీడియా సంస్థ కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మహువా మొయిత్రా మాట్లాడుతూ, దేవుడిని తనకు నచ్చిన పద్ధతిలో ప్రార్థన చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. కాళీ మాతను తాను మాంస భక్షకిగా, మద్యపానాన్ని సేవించే వ్యక్తిగా ఊహించుకునే హక్కు తనకు ఉందన్నారు. ‘‘మీ దేవుడు శాకాహారి, తెల్ల దుస్తులు ధరిస్తాడని ఊహించుకోవడానికి మీకు హక్కు ఉన్నట్లుగానే, నాకు కూడా నా దేవుడు మాంసం తింటాడని ఊహించుకునే స్వేచ్ఛ ఉంది’’ అన్నారు. 


బీజేపీ నేత జితేన్ ఛటర్జీ ఫిర్యాదు మేరకు మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. మరో బీజేపీ నేత రథింద్ర బోస్ మీడియాతో మాట్లాడుతూ, టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో కూడా టీఎంసీ నేతలు ఇదే విధంగా చేశారన్నారు. ఓట్ల కోసం హిందువుల మనోభావాలను గాయపరచడం టీఎంసీ అధికారిక వైఖరి అని తాము భావిస్తున్నామన్నారు. 


ఇదిలావుండగా, మహువా మొయిత్రా వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. ఆమె తన వ్యక్తిగత హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని పేర్కొంది. 


బీజేపీ ఫిర్యాదుపై మహువా ట్విటర్ వేదికగా స్పందిస్తూ, రండి చూసుకుందాం బీజేపీ! అన్నారు. ‘‘నేను కాళీ మాత ఆరాధకురాలిని. నేను దేనికీ భయపడను. మీ మూర్ఖులకు, మీ గూండాలకు, మీ పోలీసులకు, కచ్చితంగా మీ ట్రోల్స్‌కు నేను భయపడను. సత్యానికి మద్దతిచ్చే శక్తుల అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-06T21:23:11+05:30 IST