తిరుపతి కార్పొరేషన్‌కు ఐకానిక్‌ భవనం

ABN , First Publish Date - 2022-08-17T07:04:57+05:30 IST

తిరుపతి నగరపాలక సంస్థ ఐకానిక్‌ భవనం అనేక అవాంతరాలు, వివాదాల నడుమ ఈనెల 21వ తేదీ భూమిపూజ జరగనుంది.

తిరుపతి కార్పొరేషన్‌కు ఐకానిక్‌ భవనం
మీడియాతో మాట్లాడుతున్న కరుణాకరరెడ్డి

21న భూమి పూజకురండి

ఎమ్మెల్యే భూమన పిలుపు


తిరుపతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న తిరుపతి నగరపాలక సంస్థ ఐకానిక్‌ భవనం అనేక అవాంతరాలు, వివాదాల నడుమ ఈనెల 21వ తేదీ భూమిపూజ జరగనుంది. ప్రస్తుతం ఉన్న భవనంలో ఇప్పటికే కొన్ని కార్యాలయాల పైకప్పు పెచ్చులూడుతోంది. దీని లైఫ్‌స్పాన్‌ అయిపోయిందని ఇంజనీరింగ్‌ నిపుణులు ఆరేళ్ల కిందటే స్ట్రక్చరల్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టీడీపీ హయాంలోనే ఐకానిక్‌ బిల్డింగ్‌ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటి కమిషనర్‌ విజయరామరాజు గతంలో టెండరుకు కూడా వెళ్లారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పెద్ద బడ్జెట్‌ పనులకు బ్రేకులు పడటం జరిగింది. ఇక పాత భవనంలో పనిచేయడం సాధ్యం కాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి చొరవతో కొత్త భవన నిర్మాణానికి అడుగులు పడింది. 

తలమానికంగా నిర్మిస్తాం: ఎమ్మెల్యే

రాష్ట్రానికే తలమానికంగా కొత్త మున్సిపల్‌ భవనాన్ని నిర్మించనున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే స్మార్ట్‌ సిటీ నిధులతో నిర్మించదలిచామన్నారు. పాత కార్యాలయం 2,289చ.మీ విస్తీర్ణమైతే.. కొత్తగా నిర్మించబోయేది 14,607 చ.మీ విస్తీర్ణంతో ఉంటుందన్నారు. భవన నిర్మాణానికి రూ.81 కోట్ల బడ్జెట్‌ కాగా రూ.71కోట్లతో ఓ సంస్థ టెండరు దక్కించుకుందన్నారు. ఏడాది వ్యవధిలో భవనాన్ని కాంట్రాక్టర్‌ నిర్మించాల్సి ఉందన్నారు. తిరుపతి ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయబోతున్నామన్నారు. 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు భూమి పూజ చేయబోతున్నామని అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. మేయరు శిరీష, కమిషనర్‌ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఏడీసీ సునీత, ఎస్‌ఈ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T07:04:57+05:30 IST