పొంచి ఉన్న ప్రమాదం!

ABN , First Publish Date - 2022-06-28T06:46:28+05:30 IST

రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన కుంటాల జలపాతం వద్ద కనీస భద్రత చర్యలు కరువవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో ముప్పువాటిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలోనే జలపాతం వద్ద జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సైతం రూపొందించారు. అయిన ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం మాత్రం కావడం లేదు.

పొంచి ఉన్న ప్రమాదం!
కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి

జిల్లాలో అభివృద్ధికి నోచుకోని జలపాతాలు

కుంటాల వద్ద కనిపించని కనీస భద్రతా చర్యలు

పాలకుల నిండు నిర్లక్ష్యం.. పర్యాటకుల పాలిట శాపం

కాస్త ఆలస్యమైనా.. ఒక మోస్తారుగా కురుస్తున్న వర్షాలు

మొదలైన పర్యాటకుల తాకిడి

నిధులు మంజూరు కాకనే ఆధునికీకరణ పనుల్లో ఆలస్యం

జిల్లావ్యాప్తంగా ప్రధానంగా కుంటాల, పొచ్చెరతో పాటు పలు జలపాతాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన కుంటాల జలపాతం వద్ద కనీస భద్రత చర్యలు కరువవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో ముప్పువాటిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలోనే జలపాతం వద్ద జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సైతం రూపొందించారు. అయిన ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం మాత్రం కావడం లేదు. ఎత్తైన ప్రదేశం నుంచి జాలువారే నీటి పరవళ్లను అతి దగ్గర నుంచి చూసేందుకు ఆరాటపడే క్రమంలో పర్యాటకులు ప్రమాదాల భారీన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యేటా ప్రమాదాల భారీన పడి పలువురు పర్యాటకుల ప్రాణాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి. అయినా అటవీ శాఖ, పర్యాటక శాఖ, పాలకుల్లో ఉలుకు, పలుకు కనిపించడం లేదు. గతంలోనే రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పని చేసిన జోగు రామన్నతో పాటు రాష్ట్ర పర్యాటక, అటవీ శాఖ ఉన్నతాధికారులు జలపాతాన్ని సందర్శించి రూ.10 కోట్ల నిధులతో ఆధునికీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో కుంటాల జలపాతం అభివృద్ధికి ఆమడ దూరంగానే కనిపిస్తోంది. అప్పట్లో ఆధునికీకరణ పనులను చేపట్టవద్దంటూ కొందరు ఆందోళనకారులు అడ్డుకున్నారు. కుంటాల బచావో పేరిట సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను కాపాడే ప్రయత్నాలు చేశారు. మళ్లీ వానాకాలం సీజన్‌ మొదలు కావ డంతో కుంటాల జలపాతా నికి పర్యాటకుల తాకిడి మొదలయ్యిం ది. ప్రమాద మని తెలిసినా ప్రకృతి అందా లను చూసేందుకు పర్యాటకులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం, పాలకులకు పట్టింపే లేకపోవడంతో జలపాతం వద్ద రక్షణ చర్యలు కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేయడం.. ఆ తర్వాత అంతా మరిచిపోవడం సర్వసాధారణమైంది.

అడుగు జారిందో అంతే సంగతి

జలపాతం వద్ద నునుపైన బండరాళ్లపై జాలువారే నీటి పరవళ్లను చూసేహడావుడిలో అడుగు జారిందంటే ఇకా అంతే సంగతి. ఈ క్రమంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుండాల వద్ద యేటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి. ఈ నీటి గుండాల్లో జారీ పడిన ఏ ఒక్కరూ ఇప్పటి వరకు బతికి బయట పడిన దాఖలాలు లేవు. లోతైనా ఈ నీటి గుండాల్లో పెద్దపెద్ద బొరియలు ఉండ డంతో ప్రమాదవశాత్తు పడిన వారి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రక్షించే ప్రయత్నం చేసినా ప్రాణాలు మిగలడం లేదు. గతంలో నీటి గుండాల చుట్టూ ఇనుపరాడ్లతో కంచెను ఏర్పాటు చేసినా.. వరద తాకిడికి  కొట్టుకుపోయాయి. క నీసం హెచ్చరిక బోర్డులు కూడా కనిపించడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు  ముప్పు ఉందని తెలియక ప్రమాదాల భారీన పడుతున్నారు. ఈ నీటి గుండాల్లో పెద్దపెద్ద బండరాళ్లను వేసి పూడ్చి వేసే ప్రయ త్నాలు జరిగినా గిరిజన సంప్రదాయానికి విరుద్దమని కొందరు ఆదివాసీ గిరిజ నులు అడ్డుకోవడంతో, ఆ ప్రక్రియ అర్ధాంతరంగానే నిలిచిపోయింది. ఇక్కడే రాతి గుహల్లో కొలువుధీరిన సోమేశ్వర స్వామి శివరాత్రి పర్వదినాన ఈ నీటి గుండాల్లోనే స్నానం ఆచరిస్తాడని గిరిజనులు నమ్ముతుంటారు. ఈ కారణంగానే నీటి గుండాలను పూడ్చి వేయవద్దంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా నీటి గుండాల చుట్టూ కంచెను ఏర్పాటు చేయకుంటే మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

అడుగడుగునా అదే నిర్లక్ష్యం

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కుంటాల జలపాతం వద్ద అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అభివృద్ధి పేరిట అటవీ శాఖ చెక్‌పోస్టును ఏర్పాటు చేసి కొంత ఫీజును వసూలు చేస్తున్నా.. జలపాతం అభివృద్ధికి మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆధునికీకరించి అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి  మరింతపెరిగే అవకాశం ఉంటుంది. కానీ పాలకులు, అధికారుల్లో అదే నిర్లక్ష్యం కనిపించడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే ప్రత్యేక రాష్ట్రంలోనూ జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోవడం లేదు. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాను తెలంగాణ కశ్మీర్‌గా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చినా.. ఆచరణ సాధ్యం కావడం లేదు. గతంలో అటవీ శాఖ మంత్రిగా పని చేసిన జోగు రామన్న హయాంలోనే కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరిగిన సాధ్యపడలేదు. అంతలోనే ఆయనకు మంత్రి పదవి దూరం కావడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యా డు. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే కుంటాల, పొచ్చెర జలపాతాలు బోథ్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ప్రమాదకరంగా మారిన జలపాతం వద్ద ఆధునికీకరణ పనులతో పాటు భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంది. కాని బోథ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద సోమన్న ప్రకృతి వనం పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై పర్యాటకులు మండిపడుతున్నారు.

గతంలోనే పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికలు

: రాజశేఖర్‌, డీఎఫ్‌వో, ఆదిలాబాద్‌

కుంటాల జలపాతం వద్ద ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి గతంలోనే నివేదికలు పంపించాం. నిధులు మంజూరు కాగానే అభివృద్ధి పనుల ను చేపడుతాం. ఐటీడీఏ ఆధ్వర్యంలో జలపాతం వద్ద ఆధునికీకర పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. అందరి ఏకాభిప్రాయంతోనే అభి వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. నిధులు మం జూరు కాకపోవడంతోనే ఆలస్యమవుతోంది. 

Updated Date - 2022-06-28T06:46:28+05:30 IST