కొలిక్కిరాని కేసు!

ABN , First Publish Date - 2022-08-13T07:07:01+05:30 IST

బోధన్‌ చలాన్‌ల కుంభకోణం కేసు ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. బోధన్‌ వాణిజ్య పన్నుల షాప్‌లలో భారీ ఎత్తున ఈ కుంభకోణం జరగగా ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పజెప్పింది. ఆ శాఖ అధికారులు బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయలంలో అన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

కొలిక్కిరాని కేసు!
బోధన్‌ పట్టణంలోని వాణిజ్య పన్నుల కార్యాలయం ఇదే..

జిల్లాలో కొనసాగుతూ..నే ఉన్న బోధన్‌ చలాన్‌ల కేసు

చార్జిషీట్‌ వేయని సీఐడీ అధికారులు

గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి 

రికవరీలో నిమగ్నమైన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు

బోధన్‌ పరిధిలో 2012 నుంచి 2017 వరకు చలాన్‌ల కుంభకోణం 

వాణిజ్య పన్నుల శాఖకు పన్నులను ఎగ్గొట్టిన వ్యాపారులు

రూ.250 కోట్లకు పైగా పన్నుల ఎగవేత

సీనియర్‌ అధికారులు దృష్టి సారించడంతో వెలుగులోకి.. 

ప్రభుత్వానికి ఫిర్యాదు.. మొదలైన దర్యాప్తు

నిజామాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బోధన్‌ చలాన్‌ల కుంభకోణం కేసు ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. బోధన్‌ వాణిజ్య పన్నుల షాప్‌లలో భారీ ఎత్తున ఈ కుంభకోణం జరగగా ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పజెప్పింది. ఆ శాఖ అధికారులు బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయలంలో అన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌ ద్వారా ఏ మేరకు కుంభకోణం జరిగిందో ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే చార్జిషీట్‌ను ఈ కేసులో వేసేందుకు సిద్ధమవుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖ, ట్రెజరీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ చాలాన్‌ల కేసు ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది. కాగా, ప్రస్తుతం ఈ కేసును గుర్తించిన శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది.

పన్నులను ఎగ్గొట్టిన వ్యాపారులు

బోదన్‌ వాణిజ్య పన్నులశాఖ పరిదిలో చలాన్‌ల కుంభకోణం 2012 నుంచి 2017 వరకు జరిగింది. వాణిజ్యపన్నుల శాఖకు బోధన్‌ సీపీవో పరిధిలో చెల్లించాల్సిన పన్నులను కొంతమంది వ్యాపారులు ఎగ్టొట్టారు. ఒక ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ ఆధ్వర్యంలో చెల్లింపులు చేసిన వారు.. ఒకే చలాన్‌పై పలు సంస్థలకు చెందిన పన్నులను చెల్లించినట్లు చూపెట్టారు. ప్రభుత్వానికి ప్రతీ సంవత్సరం రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టారు. వాణిజ్య పన్నులశాఖ పరిధిలో బోధన్‌లో పన్నులు తగ్గడం గమనించిన ఆ శాఖ సీనియర్‌ అధికారులు దృష్టిపెట్టి ఆడిటింగ్‌ చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణం భారీగా ఉండడంతో అప్పటి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శాఖాపరంగా ఆడిటింగ్‌ చేయడంతో పాటు కేసులుపెట్టి  బాధ్యులైన వారిపైన చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బోధన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రాష్ట్రస్థాయిలో భారీ కుంభకోణంగా ఇది బయటపడగా.. ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని ఈ కేసును సీఐడీకి అప్పజెప్పింది. కాగా, సీఐడీ అధికారులు పోలీసుల వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుని బోధన్‌తో పాటు నిజామాబాద్‌లోని పన్నులకు సంబందించిన ఐదేళ్ల డాక్యూమెంట్స్‌ను, కంప్యూటర్‌కు సంబంధించిన బ్యాకప్‌ తీసుకు ని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసును 2017లో దర్యాప్తు మొదలుపెట్టిన అదికారులు ఇప్పటికీ కొలిక్కితెచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఐదేళ్ల సమయంలో సుమారు రూ.250 కోట్లకు పైగా బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల ఎగవేత జరిగినట్లు గుర్తించారు. దానికి సంబంధించిన డాటా ఆధారంగా కోర్టులో చార్జిషీట్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఒకే చలాన్‌పై పలువురి చెల్లింపులు

బోదన్‌ వాణిజ్యపన్నుల శాఖ పరిదిలో ఆ ఐదేళ్లలో పన్నులు చెల్లించాల్సినవారు ట్యాక్స్‌కన్సల్టెంట్‌ ద్వారా చెల్లింపులను చేశారు. ఈ చలాన్‌ల ద్వారా చెల్లింపు చేయడం వల్ల ఒకే చలాన్‌ను ఇద్దరు, ముగ్గురు వ్యాపారులకు చూపెట్టారు. ప్రతీనెల ఇదే రీతిలో చెల్లింపులను చేశారు. ఈ కుంభకోణంలో దాదాపు 200 మంది వరకు సంబంధించిన వ్యాపారుల చిట్టా ఉండడం, వారు ఈ ఎగవేతకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు ఫోరెన్సిక్‌ డాటా ద్వారా గుర్తించినట్లు తెలుస్తుంది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి చలాన్‌ల ద్వారా ట్రెజరీ కార్యాలయంలో చెల్లింపులు చేసేవారు. ప్రతీనెల వాణిజ్య పన్నుల శాఖ అదికారులతో పాటు ట్రెజరీకి సంబంధించిన శాఖల అధికారులు ఎంతమేరకు చెల్లింపులు జరిగాయో సరిచూసుకోవాలి. ప్రతీనెల ఆడిటింగ్‌ చేయాలి. ఒకవేళ ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గితే ఎంతమేరకు తగ్గాయో గుర్తించాలి. ఈ ఐదేళ్ల సమయంలో అధికారులు సహకరించడం, ఆడిటింగ్‌ చేయకపోవడం వల్ల ఈ దందా యథేచ్ఛగా జరిగి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. భారీగా చలాన్‌ల కుంభకోణం జరగడం వల్ల వ్యాపారులకు కూడా పన్నులు చెల్లించాల్సిన డబ్బులు మిగిలిపోయాయి. ఈ కేసు బయటకి రావడంతో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఆరుగురు వరకు అధికారులతో పాటు ట్యాక్స్‌కన్సల్టెంట్‌లు ఆయనకు సంబంధించిన వారిపైన పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. కేసులను నమోదు చేశారు. వారి నుంచి వివరాలు సేకరించారు. తర్వాత వారు బెయిల్‌పై బయటకి వచ్చిన సీఐడీ అధికారులు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీఐడీ అధికారులు చార్జిషీట్‌ వేసిన తర్వాత అసలు విషయాలు బయటకి రానున్నాయి. 

కమిషనర్‌ స్థాయి అధికారితో దర్యాప్తు

బోధన్‌ వాణిజ్యపన్నుల శాఖ పరిధిలో ఈ కుంభకోణం బయటపడడంతో ఆ శాఖ అధికారులు కూడా స్పందించారు. అదనపు కమిషనర్‌ స్థాయి అధికారితో దర్యాప్తు చేశారు. సంబంధిత శాఖ అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ కోసం నోటీసులు జారీ చేశారు. ఈ ఐదేళ్లలో ఇప్పటి వరకు సుమారు రూ.40 కోట్లకు పైగా వ్యాపారుల నుంచి వసూళ్లను చేశారు. డిమాండ్‌ నోటీసులను జారీ చేస్తూ చలాన్‌ల కేసులు ఉన్న వారి నుంచి పన్నులను రికవరీ చేస్తున్నారు. రైస్‌ మిల్లర్స్‌ చెల్లించని వారి వద్ద సివిల్‌ సప్లై శాఖ నుంచి వారికి సంబంధించి రావాల్సిన డబ్బులను రాబట్టుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ వన్‌ టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం ఇవ్వడంతో ఎక్కువ మంది ఈ పన్నులను చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో వ్యాపారు లు లాబియింగ్‌ చేయడం, కొంతమంది ప్రజాప్రతినిధులు సహకరించడం వల్ల ఈ కేసు ఆలస్యమైనట్లు తెలుస్తుంది. భారీ చలాన్‌ల కుంభకోణమైన పోలీసులు త్వరగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించినా.. కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం చేసినట్లు తెలుస్తుంది. కొన్ని శాఖల నుంచి సరైన సమయంలో ఫైళ్లు అందకపోవడం కూడా దర్యాప్తుకు ఆలస్యమైనట్లు అధికారుల సమాచారం బట్టి తెలుస్తుంది. వాణిజ్యపన్నుల శాఖకు రావాల్సిన ఈ బకాయిలను పూర్తిస్థాయిలో వసూళ్లు చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చార్జిషీట్‌ దాఖలైతే ఎంతమొత్తం కుంభకోణం జరిగిందో? తేలే అవకాశం ఉంది. ఆ తర్వాతనే దీనికి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

ముందుకు రాని అధికారులు

బోధన్‌ చలాన్‌ల కుంభకోణం అయిన తర్వాత ఈ కార్యాలయంలో పనిచేసేందుకు మాత్రం ఉన్నతాధికారులు ముందుకు రావడంలేదు. ఒకవేళ ఏ అధికారినైనా బలవంతంగా నియమించినా.. ఇతర కారణాలు చెప్పి బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. ఉన్నతాధికారులు కూడా జంకుతుండడంతో ఇన్‌చార్జి ల ఆధ్వర్యంలోనే కార్యాలయంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే వారికి చలాన్‌ల కేసుకు సంబంధించిన వసూలు చేయాల్సిన బాధ్యతలు అప్పజెప్తుండడం, వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఉండడంతో ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. విధిలేని పరిస్థితిలో ఇతర డివిజన్‌లకు సంబంధించిన అధికారులను ఈ కార్యాలయానికి ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తున్నారు.

Updated Date - 2022-08-13T07:07:01+05:30 IST