వైరాలో బాధ్యతారాహిత్యం..పట్టించుకోని అధికార యంత్రాంగం

ABN , First Publish Date - 2020-08-08T09:50:48+05:30 IST

వైరాలో రోజురోజుకు కరోనా విలయతాండవం చేస్తోంది. ఈక్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన వారు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు

వైరాలో బాధ్యతారాహిత్యం..పట్టించుకోని అధికార యంత్రాంగం

వైరా, ఆగస్టు 7: వైరాలో రోజురోజుకు కరోనా విలయతాండవం చేస్తోంది. ఈక్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన వారు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినవారు హోంక్వారంటైన్‌కే పరిమితం అవుతుండగా వారి కుటుంబసభ్యులు మాత్రం బహిరంగంగా తిరుగుతున్నారు. దీంతో ఇతర వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైరాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత నెలలో వ్యాపార, రాజకీయపక్షాల నాయకులు సమావేశమై గతనెల 30నుంచి ఈనెల 9వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు నిర్ణయం చేశారు. మొదట్లో మూణ్నాలుగురోజులపాటు లాక్‌డౌన్‌కు అందరూ సహకరించారు.


స్వచ్ఛంద బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. తర్వాత షరామూములైంది. పదిరోజుల్లో వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 167మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 44మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఖమ్మం, ఏన్కూరు, కొణిజర్ల, మధిర తదితర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకున్న వారిలో దాదాపు మరో 20మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో వైరా మునిసిపల్‌ ముఖ్యప్రజాప్రతినిధి, కౌన్సిలర్లు ఉన్నారు. వారు దాదాపు 15రోజులపాటు హోంక్వారంటైన్‌ చేసి నెగిటివ్‌ రావడంతో ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నారు. అయినప్పటికీ వైరాలోని కొన్నిచోట్ల ఒకే వర్గానికి చెందిన ఏడెనిమిదిమందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-08-08T09:50:48+05:30 IST