తిరుపతి వేంకటకవుల ‘బౌద్ధ’గానం

ABN , First Publish Date - 2021-07-25T07:56:33+05:30 IST

అశ్వఘోషుడు సంస్కృతంలో బుద్ధచరిత్ర రాసిన దాదాపు 1700 ఏళ్ల తర్వాత, 1902లో తెలుగులో తిరుపతి వేంకటకవులు బుద్ధచరిత్రము అనే కావ్యాన్ని రాశారని..

తిరుపతి వేంకటకవుల ‘బౌద్ధ’గానం

వారిని ప్రేరేపించిన ఎడ్వర్డ్‌ అర్నాల్డ్‌ కృతి

తెలుగుచేసి బౌద్ధానికి వేంకటకవుల గొప్ప సేవ

జైరాం రమేశ్‌ పుస్తకంలో ఆసక్తికర అంశాలెన్నో


న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): అశ్వఘోషుడు సంస్కృతంలో బుద్ధచరిత్ర రాసిన దాదాపు 1700 ఏళ్ల తర్వాత, 1902లో తెలుగులో తిరుపతి వేంకటకవులు బుద్ధచరిత్రము అనే కావ్యాన్ని రాశారని.. ఎడ్వర్డ్‌ అర్నాల్డ్‌ రచించిన ‘ద లైట్‌ ఆఫ్‌ ఆసియా’ కావ్యం ఇందుకు వారిని ప్రేరేపించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాంరమేశ్‌ అన్నారు. తన తాజా పుస్తకం ‘ద లైట్‌ ఆఫ్‌ ఆసియా- ద పోయం దట్‌ డిఫైన్డ్‌ బుద్ధ’లో ఇలాంటి విశేషాలెన్నింటినో ఆయన ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో పంచుకొన్నారు. అవి.. ఆయన మాటల్లోనే.. ‘‘బుద్ధుడు పుట్టిన భారతదేశంలోనే ఆయనను మరిచిపోతున్నాం. అలాంటిది బుద్ధుడు జీవితంతో ప్రేరితుడై 18వ శతాబ్దిలో బ్రిటిష్‌ జర్నలిస్టు, కవి ఎడ్వర్డ్‌ అర్నాల్డ్‌ ‘ద లైట్‌ ఆఫ్‌ ఆసియా’ అనే కావ్యం ఇంగ్లి్‌షలో రాశారు. ప్రపంచంలో సంచలనం సృష్టించి అనేకమందిని బౌద్దం వైపు ఆకర్షితులు చేసిన పుస్తకం ఇది. ఆ పుస్తకాన్ని తిరుపతి వేంకటకవులు తెలుగులో రూపాంతరంచేసి, బౌద్ధాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు. అర్నాల్డ్‌ పుణెలో 1857నుంచి రెండేళ్లు దక్కన్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. అప్పుడే సంస్కృతం నేర్చుకొని, బౌద్ధంపై అధ్యయనం చేశారు. 


తర్వాత ఇంగ్లండ్‌ వెళ్లి 1879లో ఈ పుస్తకం రచించారు. ఈ పుస్తకం ఆంగ్ల సాహిత్యాభిమాని, పోలవరం జమిందారు సర్‌ రాజా కొచ్చర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు బహదూర్‌ను ఆకర్షించింది. దానిని తెలుగులో అనువదింపచేయాలని నిర్ణయించుకొన్నారు. తిరుపతి వెంకటకవులు (దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిళ్ల వెంకటశాస్త్రి)లకు అర్నాల్డ్‌ పుస్తకాన్ని పరిచయం చేసి, అనువదించాలని కోరగా, వారు బుద్ధ చరితము పేరిట కృతిని రచించారు. వీరి రచన ప్రేరణతోనే ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు ‘సిద్ధార్థ రాగోదయ’ పేరిట కళాఖండం చిత్రించారు. అర్నాల్డ్‌ రచన స్వామీ వివేకానంద, అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సీవీ రామన్‌ తదితరులను ఆకట్టుకుంది. అంబేద్కర్‌ పుస్తకాల అరలో దానికి ప్రత్యేక స్థానం ఉంది. రవీంద్రనాథ్‌ టాగూర్‌, రుడ్యార్డ్‌ కిప్లింగ్‌, డబ్ల్యూబీఈట్స్‌, టీఎస్‌ ఇలియట్‌, లియో టాల్‌స్టాయ్‌. డీహెచ్‌ లారెన్స్‌ సహా ప్రముఖ సాహితీవేత్తలను ప్రేరేపించింది. బ్రిటన్‌ మాజీ ప్రధాని చర్చిల్‌, నెహ్రూ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో అర్నాల్డ్‌ పుస్తకం తరచూ ప్రస్తావనకు వచ్చేది. అర్నాల్డ్‌ ‘దసాంగ్‌ సెలెస్టియల్‌’ పేరిట భగవద్గీతపై రచన చేశారు. ఈ పుస్తకం తెలుగులోకి రావడానికి కారకులైన కొచ్చర్ల కోట రాజా... ఆంధ్ర భాషోజ్జీవని సంస్థను ప్రారంభించి తెలుగు సాహిత్య ప్రభలను పునరుద్ధరించారు’’ అని జైరామ్‌ రమేశ్‌ వెల్లడించారు. 

Updated Date - 2021-07-25T07:56:33+05:30 IST