అసమర్ధ పాలనపై దండయాత్ర

ABN , First Publish Date - 2022-09-14T07:26:21+05:30 IST

తెలుగు నేలపై ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం వెయ్యి రోజుల చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లికి రెండవ విడత పాదయాత్ర ...

అసమర్ధ పాలనపై దండయాత్ర

తెలుగు నేలపై ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం వెయ్యి రోజుల చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లికి రెండవ విడత పాదయాత్ర చేపట్టారు. ఒకవైపు రైతుల సుదీర్ఘ ఉద్యమం, మరోవైపు అత్యున్నత న్యాయస్థానం తీర్పులు రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరును, మూడు రాజధానుల ‘తుగ్లక్‌’ విధానాన్ని తప్పుపడుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కనీసం ఒక కమిటీని వేసి రాజధాని ఉద్యమకారులతో, భూములు ఇచ్చిన రైతులతో చర్చించిన పాపాన పోలేదు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తున్నాం అంటూనే పవిత్రమైన అసెంబ్లీలో న్యాయమూర్తులను హేళన చేస్తారు, మూడు రాజధానులపై మళ్ళీ ప్రసంగాలు చేస్తారు. మూడు ముక్కల బిల్లును వెనక్కి తీసుకున్నాం, సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేస్తాం అంటూనే రాజధాని ఉద్యమంపై కడవల కొద్దీ విషం కక్కుతారు.


తాజాగా రైతులు చేపట్టిన అరసవల్లి పాదయాత్రపై కొందరు మంత్రులు, విశిష్ట స్థానంలో ఉన్న స్పీకర్‌ సైతం ‘అది పాదయాత్ర కాదు ఉత్తరాంధ్రపై దండయాత్ర’ అని న్యాయ తీర్పుపై దాడి చేశారు. రాజధాని రైతులు రాష్ట్రంలోని ప్రజలే కాదు అన్నట్టు, స్వార్థంతో తమ ప్రాంతంలో మాత్రమే రాజధాని ఉండాలని, మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. పాదయాత్రను పలుచన చేస్తే, లేదా ఉత్తరాంధ్రలో భావోద్వేగాలను రెచ్చగొడితే ఫలం, ఫలితం దక్కుతుందేమో అన్న ఆశతో పాదయాత్ర చేస్తున్న వారికి అపాయం తలపెట్టే స్థాయిలో ‘చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటి ‘దాడి’ చేసిన నాయకులు రాజధాని నిర్మాణ సమయంలో, భూములను సమీకరిస్తున్న సమయంలో అమరావతి గూర్చి ఒక్క మాట మాట్లాడి ఎరుగరు. నిరసన దీక్ష చేసి ఎరుగరు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సైతం అసెంబ్లీలో అమరావతి ఏకగ్రీవ తీర్మానానికి పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర మధ్యస్థ ప్రాంతంగా ఉన్న విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఉండాలని, 30 వేల ఎకరాలకు తగ్గకూడదని చెప్పారు. ఇల్లు కట్టుకున్నామని, కార్యాలయం పెట్టుకున్నామని చెప్పారు. చంద్రబాబు కంటే మిన్నగా రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ వంటి వారి మేనిఫెస్టోలోను రాజధాని అమరావతే అని పెట్టారు.


అమరావతిలో జరిగిందని చెప్పిన లక్ష కోట్ల అవినీతిలో లక్ష రూపాయలు పట్టుకోలేదు. ఆర్థిక మంత్రి చెప్పిన నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్‌ ట్రేడింగ్‌లో ఎకరం పొలం స్వాధీనం చేసుకోలేదు. ఇప్పటివరకు రాజధానిపై ప్రభుత్వం చేసిన ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేదు. ఒక సామాజిక వర్గం, ఎడారి, స్మశానం తాజాగా దయ్యాల రాజధాని వంటి మాటలకు అర్థం, పర్ధం లేదు, విలువలేదు. అతి చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని చాలు అన్న భావన బలంగా ఉండటాన్ని అందరూ గుర్తించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు పాదయాత్రకు భయపడ్డారో, లేదా రాజధాని ఉద్యమంపై కర్కశంగా దాడి చేస్తే, ముఖ్యమంత్రి కనికరించి క్యాబినెట్‌లో బెర్త్‌ ఇస్తారని భావించారో, ఉన్న సీటుకు భద్రత ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ, పాదయాత్రపై పిచ్చెక్కినట్లుగా వ్యాఖ్యలు చేశారు.


నిజానికి రైతులు, మహిళలు చేపట్టిన అరసవల్లి పాదయాత్ర దండయాత్రే అయితే వైసీపీ నాయకులు చెప్పిన అర్థంలో కాదు. అది ప్రభుత్వ అసమర్ధ పాలనపై దండయాత్ర. రాజధాని లేకుండా చేసిన పాలకులపై దండయాత్ర. అభివృద్ధి లేమిపై, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరిగిన, జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు, అత్యాచారాల వ్యతిరేక దండయాత్ర. రాజధానిని కాపాడుకోవడంతో పాటు మూడు ప్రాంతాలు ఒక రాష్ట్రంగా కలిసి ఉండాలని చేస్తున్న మరో సమైక్యాంధ్ర పాదయాత్ర. ఈ పాదయాత్రపై ప్రభుత్వ దాడికి అవకాశం లేదనే ఆరోపణలను కూడా కొట్టివేయలేం. ఏ అర్ధరాత్రో, అపరాత్రో పాండవుల అరణ్యవాసంలోని లక్క ఇంటిని కౌరవులు తగలబెట్టినట్లు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేయకపోదన్న గ్యారెంటీ లేదు. ఇందుకు డీజీపీదే బాధ్యత. పాదయాత్ర నిర్వాహకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. పాదయాత్రపై ఒక రాయి పడ్డా, ఏ ఒక్క మహిళకు గాయమైనా ఉద్యమ స్పూర్తికి విఘాతం కలుగవచ్చు. స్వీయ పర్యవేక్షణ, రక్షణ చేసుకోగలగాలి. చివరిగా మూడు అడుగుల నేల కోసం వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కితే, 34,323 ఎకరాలు ఇచ్చిన 29,881 మంది రైతులు 59,762 అడుగులతో 600 కిలోమీటర్ల దూరంలోని సూర్యభగవానుని సందర్శన మహా పాదయాత్రలో పాలకులను ఎంత లోతు తొక్కాలో ఏపీ ప్రజలు ‘తీర్పు’ చెప్పాలి.

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

Updated Date - 2022-09-14T07:26:21+05:30 IST