ఆ ఒక్క పోస్ట్ కోసం.. అవినీతి పాట రూ.కోటిన్నర!

ABN , First Publish Date - 2021-10-26T06:26:17+05:30 IST

ఇది అవినీతి పాట. కాసులు కురిపించే పోస్టు కోసం నోట్లతో సాగిస్తున్న ఈ వేట రూ.లక్షలు దాటి కోట్లకు చేరింది.

ఆ ఒక్క పోస్ట్ కోసం.. అవినీతి పాట రూ.కోటిన్నర!

  • పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు కోసం ఓ అధికారి ఆఫర్‌
  • ఆ పోస్టుకు పోటీ పడుతున్న మరో అధికారి వెనకడుగు
  • నోట్లు వెదజల్లుతున్న నగర శివారు ప్రాంత సబ్‌ రిజిస్ర్టార్‌
  • సస్పెన్షన్‌ వ్యవహారం తేలకుండానే పోస్టింగ్‌ల బేరం! 


ఇది అవినీతి పాట. కాసులు కురిపించే పోస్టు కోసం నోట్లతో సాగిస్తున్న ఈ వేట రూ.లక్షలు దాటి కోట్లకు చేరింది. మొన్నటికి మొన్న పటమట సబ్‌రిజిస్ర్టార్‌ పోస్టు కోసం రూ.కోటికి చేరిన పాట.. నేడు రూ.కోటిన్నరకు పెరిగింది. ఒకనాడు ఈ పోస్టు కోసం ఏకంగా మంత్రికే రూ.కోటి ఆఫర్‌ చేయగా, నేడు అన్ని స్థాయిల్లోని అధికారులను సంతృప్తి పరిచేందుకు విజయవాడ నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ సబ్‌రిజిస్ట్రార్‌ రూ.కోటిన్నర వెదజల్లేందుకు ముందుకొచ్చాడు. ఈయన కంటే ముందు నుంచే ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ఓ అధికారి.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో పరపతి ఉన్నా.. ఈ పోటీలో వెనకడుగు వేయడం మరో విచిత్రం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ శివారు ప్రాంతానికి చెందిన సబ్‌ రిజిస్ర్టార్‌ ఒకరు పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు కోసం రూ.కోటిన్నర ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదంటే ఆలోచించాల్సిన విషయమే. ఆయన ఇప్పటికే ఏ స్థాయిలో వెనకేసుకున్నారో, ఇంకా సంపాదించేందుకు ఎంతగా ప్లాన్‌ చేసుకున్నారో దీనినిబట్టి అర్థమవుతోంది. కొందరు సబ్‌ రిజిస్ర్టార్ల అక్రమ సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు రూ.కోటిన్నర ఆఫరే నిదర్శనం. మరి ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారు? అవినీతి అనకొండలను చూస్తూ కూడా వదిలేస్తున్నారంటే అంత స్థాయిలో మామూళ్లు అందుతున్నాయా? అన్నది సామాన్యుల సందేహం. 


పరపతి ఉన్న అధికారి వెనకడుగు

పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు కోసం దశాబ్ద కాలంగా ఐజీ కార్యాలయంలో పని చేస్తున్న అధికారి ఒకరు ప్రయత్నిస్తున్నారు. ఐజీ కార్యాలయంలో పని చేయటం వల్ల ఆయనకు అక్కడ కాస్తో, కూస్తో ఉన్నతాధికారుల దగ్గర పరపతి ఉంది. అంత పరపతి ఉన్న ఆ పెద్ద మనిషే విజయవాడ శివారు ప్రాంత సబ్‌ రిజిస్ర్టార్‌తో పోటీ పడలేక వెనకడుగు వేశారు. పటమట పోస్టు కోసం రూ.కోటి వరకు ఖర్చు చేసేందుకు ముందుకొచ్చిన శివారు ప్రాంత సబ్‌ రిజిస్ర్టార్‌, ఆ స్థాయిలో తనకు పోటీ పడేవారు ఎవరూ లేకున్నా, వివిధ స్థాయిల్లో అందరినీ సంతృప్తి పరిచేందుకు రూ.కోటిన్నర వరకు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ అధికారి ఈ పోస్టు కోసం ఎందుకింత ఖర్చు చేస్తున్నాడో  తెలుసుకుంటే ముక్కున వేలేసుకోవలసిందే. 


ఫోకల్‌ పోస్టు కోసం ఎన్ని పాట్లో

ఏ సబ్‌ రిజిస్ట్రారయినా ఫోకల్‌తో పాటు నాన్‌ ఫోకల్‌లో కూడా పని చేయాల్సిందే. అలాగే నాన్‌ ఫోకల్‌లో పని చేసే వారు ఫోకల్‌ పాయింట్‌లో కూడా చేయాల్సి ఉంటుంది. ఐజీ కార్యాలయంలోని ఓ అధికారి చాలా కాలం క్రితం కానుమోలు సబ్‌ రిజిస్ర్టార్‌గా పని చేశారు. ఆ తర్వాత కంకిపాడులో కొద్దికాలం చేసి, నాన్‌ ఫోకల్‌ పాయింట్‌లోకి వెళ్లారు. దాదాపు పదేళ్లుగా నాన్‌ ఫోకల్లో పని చేస్తున్న ఆయన పదవీ విరమణ వయసు దగ్గర పడడంతో ఫోకల్‌ పాయింట్‌లో పోస్టింగ్‌ కల్పించాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. అందులో భాగంగా ముందుగా ఖాళీగా ఉన్న పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు కోసం ప్రయత్నాలు ఆరంభించారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ శివారు ప్రాంత సబ్‌ రిజిస్ర్టార్‌ కూడా ఆ పోస్టు కోసం పోటీపడ్డారు. ఈ పోస్టును దక్కించుకోవడం కోసం ఆయన అవసరమైన అందరితో బేరసారాలకు దిగాడు. ఇలా అందరికి ఇవ్వాల్సింది మొత్తం రూ.కోటిన్నరకు చేరింది. ఈయనకు ఇంకా చాలా సంవత్సరాలు సర్వీసున్నా, ఇంతగా ఎందుకు ఆరాటపడుతున్నారు? అంటూ తోటి సబ్‌ రిజిస్ర్టార్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. 


సంస్కరణలతో వచ్చిన సబ్‌ రిజిస్ర్టార్‌ పైనే వేటు! 

గతంలో పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు కోసం ఒకరు ఏకంగా మంత్రికే రూ.కోటి ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో నాటి రిజిస్ర్టేషన్స్‌ అండ్‌ స్టాంపుల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కొన్ని సంస్కరణలు తీసుకువచ్చారు. అందులో భాగంగా ఫోకల్‌ పాయింట్లలో గ్రూప్‌-1 అధికారులకు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఫ్రెష్‌ బ్యాచ్‌ వచ్చింది. పటమట సబ్‌ రిజిస్ర్టార్‌గా కూడా కొత్తవ్యక్తి వచ్చారు. ఇటీవల సస్పెండ్‌ చేసింది ఆ అధికారినే కావటం గమనార్హం. 


ఆ పోస్టును భర్తీ చేయొచ్చా? 

పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టులో ఉన్న అధికారిని తొలగించటమే అనుమానాస్పద వ్యవహారం. చలానా ఆర్థిక అవకతవకల వ్యవహారంలో సాఫ్ట్‌వేర్‌ లోపాలను అడ్డం పెట్టుకుని డాక్యుమెంట్‌ రైటర్లు చేసిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం అన్ని చోట్లా దాదాపు రికవరీ చేయించింది. సబ్‌ రిజిస్ర్టార్ల ప్రత్యక్ష ప్రమేయం ఉంటే వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. జిల్లాలో పటమట, మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్లను మాత్రమే సస్పెండ్‌ చేశారు. అది కూడా స్టాంపుల పర్యవేక్షణ లేదన్న సాకుతో సస్పెండ్‌ చేశారు. పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ ఒక్కరినే తప్పిస్తే.. అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌పైన కూడా వేటు చేశారు. వీరిపై శాఖాపరంగా విచారణ జరపాలి. వారు ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే అక్కడి తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆ తీర్పును గౌరవించి, ఆ దిశగా చర్యలు తీసుకునే వరకు ఆ పోస్టును భర్తీ చేయకూడదు. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుండటం గమనార్హం. 


అర్హత ఉందా?

నగర శివారు ప్రాంత సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో కూడా చలానా ఆర్థిక అవకవతవకల వ్యవహారాలు వెలుగు చూశాయి. రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ కూడా జరిగిన తప్పులకు బాధ్యత వహించాలి. కానీ ఆయనపై చర్యలు తీసుకోకపోగా, అదే ఆరోపణల మీద వేటుకు గురైన సబ్‌ రిజిస్ర్టార్‌ స్థానంలో ఎలా నియమిస్తారో ఆ శాఖ ఉన్నతాధికారులకే తెలియాలి.

Updated Date - 2021-10-26T06:26:17+05:30 IST