నీవానదిలో చిక్కుకున్న వృద్ధుడు

ABN , First Publish Date - 2020-11-29T06:33:17+05:30 IST

నీవానదీ ప్రవాహంలో చిక్కుకున్న ఓ వృద్ధుడిని పోలీసులు, రెస్క్యూ టీం రక్షించి ఒడ్డుకు చేర్చారు.

నీవానదిలో చిక్కుకున్న వృద్ధుడు
కలిజవేడు వద్ద నీవా నదిలో చిక్కుకున్న దొరస్వామి

-రక్షించిన రెస్క్యూ టీం

గంగాధరనెల్లూరు, నవంబరు 28: నీవానదీ ప్రవాహంలో చిక్కుకున్న ఓ వృద్ధుడిని పోలీసులు, రెస్క్యూ టీం రక్షించి ఒడ్డుకు చేర్చారు. గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు గ్రామానికి చెందిన దొరస్వామి నాయకర్‌ అలియాస్‌ అబ్బులయ్య(60), అతడి కుమారుడు రాము నాయకర్‌ కొట్రకోన పంచాయతీ ముకుందరాయనిపేటలో భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు.  కొంత భాగంలో వరి పంట వేసి కోతకు రావడంతో కోసి పొలంలోనే ఆరబెట్టారు. దానిని ఒబ్బిడి చేయడంతో పాటు పొలంలోని మరో భాగంలో వరి నాట్లు వేయడానికి రాము నాయకర్‌ కొందరు కూలీలతో గంగాధరనెల్లూరు మీదుగా శనివారం ఉదయం పొలం వద్దకు బయలుదేరాడు. అయితే దొరస్వామి మాత్రం కలిజవేడు నుంచి అడ్డదారిలో పొలానికి వెళ్లేందుకు నీవానదీ ప్రవాహంలో దిగాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత నదిలో ఉన్నట్టుండి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఎటూ వెళ్లలేక మధ్యలో చిక్కుకుపోయాడు. అక్కడ ఓ బండరాయిపై కూర్చొని  కేకలు పెట్టడంతో సమీపంలో చేపలు పడుతున్నవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి, సీఐ బాలయ్య, తహసీల్దార్‌ ఇన్బనాఽథన్‌, ఎంపీడీవో శ్రీదేవి, ఎస్‌ఐ సుమన్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్టీఆర్‌ జలాశయం గేట్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేసి రెస్క్యూ టీంను రప్పించారు. పోలీసులు రెస్క్యూ టీంతో కలసి రోప్‌ సాయంతో వృద్ధుడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో  ఆర్‌ఐ చంద్రశేఖర్‌, ఈవోపీఆర్డీ శివయ్య పాల్గొన్నారు.




Updated Date - 2020-11-29T06:33:17+05:30 IST