చావులోనూ వీడని స్నేహ బంధం

ABN , First Publish Date - 2022-05-16T06:50:39+05:30 IST

ఆ ఇద్దరు యువకులు ఎంతో స్నేహంగా మెలిగేవారు. సెలవు రోజుల్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదో ఒక పని చేసి.. కుటుంబానికి తమవంతు సాయంగా ఉండేవారు. ఈ ఇద్దరు మిత్రులు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకేసారి దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

చావులోనూ వీడని స్నేహ బంధం
చిరంజీవి, చందు (ఫైల్‌ ఫొటోలు)

సెలవు కావడంతో పనికోసం వెళ్లిన ఇద్దరు మిత్రుల దుర్మరణం

విషాదంలో రెండు కుటుంబాలు


శ్రీకాళహస్తి, మే 15: ఆ ఇద్దరు యువకులు ఎంతో స్నేహంగా మెలిగేవారు. సెలవు రోజుల్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదో ఒక పని చేసి.. కుటుంబానికి తమవంతు సాయంగా ఉండేవారు. ఈ ఇద్దరు మిత్రులు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకేసారి దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. వెంకటగిరి పట్టణం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని మందలిల్లు వీధికి చెందిన ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్‌ పెద్దపెంచులయ్య ఒక్కగానొక్క కుమారుడు చిరంజీవి (20) ఐటీఐ పూర్తి చేశాడు. ఇదే వీధికి చెందిన కూలీ పనులు చేసేకునే ఆమలూరు రమణయ్య చిన్న కుమారుడు చందు (21) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఒకేవీధికి చెందినవారు కావడంతో ఈ యువకులిద్దరూ స్నేహితులయ్యారు. కొంతకాలంగా సెలవు రోజుల్లో ఏదో ఒక పనికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పేడు మండలం పల్లంపేట వద్ద ఓ ఇంట్లో శుభకార్యం కోసం  లైటింగ్‌ డెకరేషన్‌ చేయడానికి ఇద్దరు మిత్రులు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. సాయంత్రం తిరిగి అదే వాహనం ఇంటికి బయల్దేరగా.. మార్గమధ్యంలో జోరువాన మొదలైంది. శ్రీకాళహస్తి మండలం ఈండ్రపల్లె వద్ద ఏర్పేడు - వెంకటగిరి జాతీయ రహదారిపైకొచ్చేసరికి వెంకటగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిరంజీవి, చందు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి రూరల్‌ ఎస్‌ఐ వెంకటేష్‌ ఘటనా స్థలానికి  చేరుకుని మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేశారు. 

Updated Date - 2022-05-16T06:50:39+05:30 IST