శింగరకొండలో ఆగని అంతర్యుద్ధం

ABN , First Publish Date - 2022-07-05T06:31:23+05:30 IST

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో 15 నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంతకాలం పైకి అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించినా మరలా విభేదాలు బహిర్గతమయ్యాయి.

శింగరకొండలో ఆగని అంతర్యుద్ధం
ఈవో రఘునాథరెడ్డికి, పాలకమండలి సభ్యురాలు భర్త రాఘవరెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం

 ఆధిపత్య పోరుకు బలవుతున్న ఉద్యోగులు, పూజారులు

అద్దంకి, జూలై 4: శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి  దేవాలయంలో  15 నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంతకాలం పైకి అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించినా మరలా విభేదాలు బహిర్గతమయ్యాయి. 12 సంవత్సరాలు ఖాళీగా ఉన్న పాలకమండలి 2021 మార్చి 24లో బాధ్యతలు స్వీకరించింది. అప్పటి నుంచి పాలకమండలి, అధికారుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. సరైన గౌరవం  ఇవ్వడం లేదని పాలకమండలి గుర్రుగా ఉండగా, పరిధికి మించి పాలక మండలి వ్యవహరిస్తోందని అధికారులు భావించడంతో భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఈవో శ్రీనివాసరెడ్డి, చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌ మధ్య అంతర్యుద్ధం  తారస్థాయికి చేరింది.  ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విజయవాడ దుర్గామల్లేశ్వరి స్వామి దేవస్థానం జాయింట్‌ కమిషనర్‌ అప్పట్లో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈవో శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయగా, కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న హరిబాబును సస్పెండ్‌ చేశారు. మాలకొండ నుంచి డిప్యుటేషన్‌పై  పనిచేస్తున్న మరో ఉద్యోగి డిప్యుటేషన్‌ రద్దు అయ్యింది. అనంతరం రఘునాథరెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. కొత్తగా ఈవో బాధ్యతలు తీసుకున్న తరువాత అంతా సవ్యంగా జరుగుతాయని, సర్దుకు పోతారని భావించారు. కానీ కొద్ది కాలానికే వారి మధ్య  భేదాభిప్రాయాలు  వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న మరో ఉద్యోగి బదిలీపై వెళ్లారు. వార్షిక తిరుణాళ్ల సమయంలోనే వీరి మధ్య విభేధాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. కాకపోతే పైకి అంతా బాగానే నడుస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం ఎవరి దారి వారే అన్నట్లు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే విషయం టీటీడీ చైర్మన్‌ వైవీ  సుబ్బారెడ్డి దృష్టికి పోవడంతో ఆయన మందలించినట్లు తెలిసింది.  దేవస్థానంలో సిబ్బంది కూడా రెండు వర్గాలుగా విడిపోయి పాలకవర్గం, అధికారుల మధ్య అగాధం పెరిగే విధంగా  వ్యవహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేవస్థానానికి సరఫరా చేసే సరుకులు నాణ్యత లేవని, టెండర్లు రద్దు చేయాలని చైర్మన్‌ పట్టుబట్టినట్లు  తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆదివారం  రాత్రి పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నాణ్యత లేని సరుకులు సరఫరాను టెండరుదారుల నుంచి రద్దు  చేసి దేవస్థానం తరఫున సొంతగా ఈవో ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈవో రఘునాథరెడ్డికి, పాలకమండలి సభ్యురాలు భర్త రాఘవరెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పాలకమండలి సభ్యులు కానివ్యక్తులు, షాడోల పెత్తనంపై ఈవో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే చైర్మన్‌ మాత్రం షాడోల  ఆధ్వర్యంలోనే అంతా వ్యవహారం నడుపుతున్నట్లు, వారికి వత్తాసుగా నిలిచినట్లు సమాచారం. అదే సమయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న పెద్దినేని శ్రీనివాసరావును సోమవారం సస్పెండ్‌ చేస్తూ ఈవో రఘునాథరెడ్డి ఉత్తర్వులు ఇవ్వడంతో విషయం మరింత వేడెక్కింది.

జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌... ఆత్యహత్యాయత్నం

జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న పెద్దినేని శ్రీనివాసరావు విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో పాటు తన పట్ల దిక్కారణ ధోరణితో వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఆయ న్ను  ఈవో  రఘునాథరెడ్డి సోమ వారం  సస్పెండ్‌ చేశారు.  సస్పెండ్‌  నోటీసును సోమవారం శ్రీనివాసరావుకు ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఆత్మహత్యాయత్నంకు  ప్రయత్నించినట్లు ఈవో రఘునాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఇలా అటు పాలకమండలి,  ఇటు అధికారుల మధ్య సిబ్బంది, పూజారులు నలిగి పోతున్నారు. అధికారి వైపు  లేకుంటే ఎక్కడ సస్పెన్షన్‌ వేటు పడుతుందోనని, పాలకమండలి మాట వినకపోతే ఎక్కడా కోపాగ్నికి గురికావల్సి వస్తుందో నన్న ఆందోళన సిబ్బంది, పూజారులలో నెలకొంది. శింగరకొండ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా పాలక మండలి, అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం అభివృద్ధి మాట అటుంచితే  వీరి అంతర్యుద్ధంతో మరింత  చులకన భావన ఏర్పడ టంతో పాటు, అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని చక్కదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నాడు

అద్దంకి : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్ధానం ప్రసాదం, అన్నదానంకు వినియోగించే సరుకులు నాణ్యత లేదని ఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సరుకులు సరఫరా చేసే కాంం ట్రాక్టర్‌లకు ఈవో వత్తాసు పలుకుతున్నాడు. పాలకమండలి  అడిగిన సమాచారాన్ని విధుల్లో భాగంగా ఇచ్చిన జూనియర్‌ అసిస్టెంట్‌ పెద్దినేని శ్రీనివాసరావు ఉద్దేశ్యంతో సస్పెండ్‌ చేశారు. ఈ విషయాలపై త్వరలో పాలకమండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటాం.

కోట శ్రీనివాసకుమార్‌, చైర్మన్‌

తాటాకులు తీసుకుపోయారు

శింగరకొండ వార్షిక తిరుణాళ్లకు వినియోగించిన తాటాకులు చైర్మన్‌ సొంత అవసరాలకు తీసుకు పోయాడు.  జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న పెద్దినేని శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పాలకమండలి, అధికారుల మధ్య విభేధాలు వచ్చే విధంగా వ్యవహరిస్తుండడంతో సస్పెండ్‌ చేశాం. దేవస్థానం వద్ద పాలకమండలి సభ్యురాళ్ల భర్తలు(షాడో)ల హడావుడి ఎక్కువగా ఉంది. దీన్ని  ప్రశ్నిస్తున్నందుకే నాపై ఆరోపణలు.

 రఘునాథరెడ్డి, ఈవో, శింగరకొండ


Updated Date - 2022-07-05T06:31:23+05:30 IST