Panchkula : రిటైర్డ్ ఐటీ కమిషనర్‌కు కత్తిపోట్లు... సీనియర్ సిటిజన్లలో ఆందోళన...

ABN , First Publish Date - 2022-05-28T21:31:50+05:30 IST

హర్యానాలోని పంచకుల సెక్టర్-7లో నివసిస్తున్న రిటైర్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్

Panchkula : రిటైర్డ్ ఐటీ కమిషనర్‌కు కత్తిపోట్లు... సీనియర్ సిటిజన్లలో ఆందోళన...

పంచకుల : హర్యానాలోని పంచకుల సెక్టర్-7లో నివసిస్తున్న రిటైర్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ అమర్ ప్రతాప్ కకరియా (Amar Partap Kakaria) (77) ఇంట్లోకి ఓ వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం చొరబడి, ఆయనను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఈ ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ల భద్రతపై ఆందోళనకు దారి తీసింది. 


పంచకుల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,  అమర్ ప్రతాప్ కకరియా ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి, ఆయన మెడపై మూడుసార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆయనపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు చిత్రీకరించాయి. నిందితుడు తన ముఖాన్ని రుమాలుతో కప్పుకుని ఉన్నట్లు కనిపించింది. నిందితుడు ఆ కత్తిని నేర స్థలంలోనే వదిలేశాడు. కుటుంబ సభ్యులు, సేవకుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. కత్తి ముక్కలను సేకరించారు. 


ఈ సంఘటన జరిగిన సమయంలో కకరియా కోడలు శిల్ప, మనుమడు సమర్థ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆయన కుమారుడు విక్రాంత్ ఈ సంఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు బయటకు వెళ్ళారు. విక్రాంత్ ఆదాయపు పన్ను న్యాయవాదిగా పని చేస్తున్నారు. 


విక్రాంత్ మాట్లాడుతూ, తాను మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళానని, దాదాపు 3 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు తమ ఇంట్లో ప్రవేశించాడని చెప్పారు. తన తండ్రి సహాయం కోసం కేకలు వేశారని, తన భార్యను, కుమారుడిని పిలిచారని చెప్పారు. అప్పటికే ఆ వ్యక్తి తన తండ్రిని పొడిచేశాడన్నారు. తన తండ్రి బలంగా అతనిని నిరోధించడంతో ఆ కత్తి మూడు ముక్కలైపోయిందన్నారు. తాను తిరిగి వచ్చి చూసేసరికి తన తండ్రి రక్తపు మడుగులో ఉన్నారన్నారు. తాను ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళానని, తదుపరి 48 గంటలు చాలా కీలకమైనవని చెప్పారని తెలిపారు. 


Updated Date - 2022-05-28T21:31:50+05:30 IST