తొక్కేస్తున్నారనే కోపంతోనే టీడీపీలోకి వెళ్లాం

ABN , First Publish Date - 2020-02-07T15:42:43+05:30 IST

సాధారణంగా అన్నదమ్ములు రాజకీయాల్లో ఉంటే అన్నదే అగ్రస్థానం అవుతుంది. కానీ మీరిలా..?

తొక్కేస్తున్నారనే కోపంతోనే టీడీపీలోకి వెళ్లాం

నాన్నగారికి కాంగ్రెస్‌ టికెట్‌ వచ్చి... పోయింది

రాజకీయ ప్రవేశానికి అన్నే కారణం: రామనారాయణ

కుటుంబ ఆర్థిక విషయాలు రామనారాయణవే

ఏకైక బలహీనత సిగరెట్‌ తాగడమే: వివేకా

28-3-11న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో ఆనం బ్రదర్స్‌


సాధారణంగా అన్నదమ్ములు రాజకీయాల్లో ఉంటే అన్నదే అగ్రస్థానం అవుతుంది. కానీ మీరిలా..? 

రామనారాయణ: 83 ఎన్నికల్లో మా నాన్నగారికి కాంగ్రెస్‌ టికెట్‌ వచ్చి, చివర్లో పోయింది. మమ్మల్ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆగ్రహంతో నేను, వివేకన్న కూడా నామినేషన్లు వేశాం. ఎన్టీఆర్‌ గారు అడగడంతో.. టీడీపీ టికెట్‌పై నేను, నాన్న గెలిచాం. అన్నకే అవకాశం వచ్చినా.. ఆయన నాపేరు చెప్పారు. నేను అసెంబ్లీకి.. తను స్థానిక సంస్థలకు ఉండిపోయాం. నాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది. 83లో తను ఎమ్మెల్యే అయితే నేను రాజకీయాల్లోనే ఉండేవాణ్ని కాను. నా రాజకీయ ప్రవేశానికి అన్నే కారణం.

వివేకా: నాకు ఈ అడ్డుగోడలు ఉండటం ఇష్టం లేదు. స్వేచ్ఛగా బతకాలి. బల్బుకారులో వెళ్లి బంకులో టీ తాగితే బాగోదు. మా కుటుంబంలో 80-85 ఏళ్ల క్రితం ఏసీ సుబ్బారెడ్డిగారు రాజకీయమంటే ప్రజాసేవేనని చెప్పి బీజం వేశారు. ప్రొజెక్షన్‌ ఒకళ్లకే ఉండాలని మేం అనుకున్నాం. అప్పుడే చెట్టు బాగుంటుంది.


నారాయణగారు పెద్దమనిషిలా, మీరు దసరాబుల్లోడిలా ఎలా ఉండగలుగుతున్నారు?

వివేకా: ప్రజలు, నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనుకునేవాణ్ణి నేను. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కూడా నారాయణే చూస్తాడు.

రామనారాయణ: కొందరు కొన్నింటికి పెట్టి పుడతారు. ఆయన సరదాలకు, నేను బాధ్యతలకు పెట్టిపుట్టాం. నేను ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర ఉండి చదివా. అన్న బయట చదివేవాడు.


సరదాగా వెళ్లి బుగ్గలు గిల్లినా.. ఎవరూ ఏమనరా?

వివేకా: పెద్ద వయసు వాళ్లు మనవడిలా, చిన్నవాళ్లు అన్న/తమ్ముడిలా ప్రేమ, ఆప్యాయత మాత్రమే చూస్తారు. నేను, మా నాన్న, పెదనాయన కలిసి 55 ఏళ్లు నెల్లూరు మున్సిపల్‌ చైర్మన్లుగా ఉన్నాం. దాంతో నెల్లూరు అంతా మా కుటుంబమేననే భావన ఉంటుంది. అందుకే ఎవరూ అపార్థం చేసుకోరు.


స్కూల్లో కూడా సిగరెట్‌ తాగితే ఎలా?

వివేకా: నాకున్న ఏకైక బలహీనత సిగరెట్‌ తాగడమే. మద్రాస్‌ సంస్కృతి ప్రభావం కొంత ఉంది. సినిమాల్లో చూసి..మొదలుపెట్టా. నారాయణ 89లో మానేశాడు.


పూలరంగడిలా అన్నీ వేస్తారు కదా?

వివేకా: నా కోరికలు చిన్నవి. అవన్నీ తీర్చేసుకుంటా. అందరూ నన్ను ఆమోదిస్తారు. రోజుకో టోపీ పెట్టుకుంటా.


సుబ్బారెడ్డి వారసులను మీరు తొక్కేస్తున్నారనే ఆరోపణలున్నాయి?

వివేకా: సుబ్బారెడ్డి పిల్లల కుటుంబమంతా మాతోనే ఉంది. మా అన్న (భక్తవత్సలరెడ్డి) రిటైరవుతానని చెప్పాకే.. మేం వచ్చాం. తర్వాత ఎవరో ఆయన మనసులో విషం నాటారు.


పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి స్థిరత్వం ఉంటుందా?

రామనారాయణ: ప్రభుత్వం అనేది వ్యవస్థలో భాగంగా జరిగిపోతుంది తప్ప వ్యక్తులతో సంబంధం లేదు. కానీ, 2009కి ముందున్న స్థిరత్వం ఇప్పుడు ఉందా అంటే కష్టం. సీఎంకు బాగా పట్టు ఉండేది.

రోశయ్య అనుభవజ్ఞుడైనా.. నాయకత్వం వహించలేక ఇబ్బంది పడేవారు. కిరణ్‌కు ప్రభుత్వాన్ని నడపడంలో ప్రత్యక్ష అనుభవం లేదు. కానీ ఆయన స్టడీ చేసి, పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మూడు పార్టీల మధ్యే పోటీ ఉంది. రెండింటికి ఇప్పటికే కేడర్‌ ఉంది. కొత్త పార్టీ మాత్రం.. ఇప్పటికిప్పుడే తాము మాత్రమే ఈ రాష్ట్రంలో పనికొస్తామని, మిగిలిన రెండూ పనికిరావని అనుకుంటోంది. 


తెలంగాణతో సంబంధాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారేంటి?

రామనారాయణ: అది భగవదేచ్ఛ తప్ప మరోటి ఏమీ కాదు. మాకు ఆ భేదభావం లేదు. మా అన్న కూతుర్ని రాయలసీమలో ఇచ్చాం. ఒక కోడలిని తెలంగాణ నుంచి చేసుకున్నాం.


మీ ఇద్దరిలో ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వచ్చాయా?

రామనారాయణ: అవి వస్తే ఇంత దూరం వచ్చేవాళ్లం కాము. అందుకు కారణం కూడా మా పెద్దలే. పెదనాన్న మరణించేవరకు నాన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ముందునుంచి ఇద్దరం కలిసే పెరిగాం.


మీకు బాగా బాధ కలిగించిన సంఘటన ఏది?

రామనారాయణ: రెండుసార్లు కలిగింది. ఒకసారి.. 84 సంక్షోభం. నాన్నగారు రామారావు గారిని వ్యతిరేకించారు. మేం తండ్రితో రాజకీయం చేయాల్సి వచ్చింది. ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదు. రెండోది.. వైఎస్‌ మరణం. ఇవి ఇద్దరికీ బాధ కలిగించాయి.


మీ మీద ఆరోపణలు ఎందుకు వచ్చాయి?

రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక పత్రికల వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని విమర్శించడమే. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మిత్రులతో పాటు శత్రువులు ఉండటం సహజం. మా మీద ఎలాంటి విమర్శలూ చేయలేక.. కొందరు దిక్కుతోచని నాయకులు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తారు. మాకు కాలేజి, ఆలయం మీద సెంటిమెంటు ఎక్కువ. వాటిమీద మచ్చ పడనివ్వం.


మీరిద్దరూ కూడా ఎన్టీఆర్‌ అభిమానులే కదా? కిర్రుచెప్పులు ఎన్టీఆర్‌కు మీరే నేర్పారా?

రామనారాయణ: నేను అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్‌ని, అన్న ఎన్టీఆర్‌ అభిమాని. గొడవలకు వెళ్లేవాళ్లం కాదు. మద్రాస్‌ వెళ్లి ఆయన సినిమాలు చూసేవారు.

వివేకా: ఎన్టీఆర్‌ కిర్రుచెప్పులు శ్రీకృష్ణ పాండవీయంలో వాడారు. తర్వాత నాకు అలవాటైపోయింది. శబ్దం రాకుంటే కష్టం.


మీ ఇద్దరి లక్ష్యం ఏంటి?

రామనారాయణ: రాజకీయాల్లో నాకు ఇప్పటివరకు వచ్చినవాటిలో ఇదే పెద్దస్థానం. ఆనం కుటుంబమే నన్నీ స్థానంలో నిలిపింది. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలన్నదే మా కోరిక.

వివేకా: నాకు ఈ విధంగా ఆహ్లాదంగా, సంతోషంగా, సిగరెట్‌ మానకుండా ఉండటమే ఇష్టం. మాకు ఆశ, అత్యాశ రెండూ లేవు. ఆనం కుటుంబం.. వారు అందించిన ఈ ప్రజా కుటుంబంతోనే గడపాలన్నదే కోరిక. పెద్దోళ్లు ఇచ్చిన పొలం ఎకరా పదివేలుండేది. ఇప్పుడది కోటి రూపాయలుంది. పొలం, డబ్బు ఉన్నాయి.. మంచి స్నేహితులున్నారు. ఆ అదృష్టం, ఆస్తులతో మేం హ్యాపీ. రామనారాయణకు, నాకు, మా తమ్ముళ్లకు తలో 30 ఎకరాలున్నాయి. ఇంతకన్నా వేరే ఆశలు ఏమీ లేవు.


ఇద్దరి మనస్తత్వాలు విభిన్నంగా ఉండేందుకు కారణమేంటి?

రామనారాయణ: చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. ఒకరిని ఒకరు ఓవర్‌టేక్‌ చేయాలనేది మాత్రం లేదు.

వివేకా: రాం నారాయణకు బాధ్యతల వల్ల ఆ తరహా వ్యవహార శైలి వచ్చింది. నేనెప్పుడూ జనంతో ఉంటా. వాళ్ల భాషే నా భాష. కొందరు నావి వేషాలనడం కూడా విన్నాను. సమాజంలో విభిన్న వర్గాల పాత్రలవి. క్షవరం చేయడానికీ నేను రెడీ. కానీ చేయించుకునే వాడికే ధైర్యం ఉండాలి. జనంతో కలవడం నాకు స్వతహాగా అబ్బింది.

Updated Date - 2020-02-07T15:42:43+05:30 IST