Anand Mahindra: బంగారం కావాలంటున్న ఆనంద్ మహీంద్రా.. ట్వీట్‌లో ఇంతుందా..?

ABN , First Publish Date - 2022-08-23T22:03:18+05:30 IST

శాస్త్ర సాంకేతిక రంగాల గురించి చర్చ జరిగితే చైనా ప్రస్తావన రాకుండా ఆ చర్చకు ముగింపు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాల్లోనే..

Anand Mahindra: బంగారం కావాలంటున్న ఆనంద్ మహీంద్రా.. ట్వీట్‌లో ఇంతుందా..?

శాస్త్ర సాంకేతిక రంగాల గురించి చర్చ జరిగితే చైనా ప్రస్తావన రాకుండా ఆ చర్చకు ముగింపు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాల్లోనే అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాను కూడా చైనా పలు రంగాల్లో దాటేసి ముందుకెళుతోంది. తాజాగా.. మరో విషయంలో కూడా అమెరికాపై డ్రాగన్ దేశం పైచేయి సాధించింది. జపాన్ దేశ విద్యా శాఖ అనుబంధ సంస్థ అయిన National Institute of Science and Technology Policy (NISTEP) తాజాగా ఒక జాబితా విడుదల చేసింది. ప్రపంచంలో ఉన్న పరిశోధనా పత్రాల్లోనే అత్యుత్తమమైన, ప్రామాణికంగా భావించే 10 శాతం మేటి పరిశోధనా పత్రాలకు సంబంధించిన ర్యాంకింగ్స్‌ లిస్ట్ అది. ఈ ర్యాంకింగ్స్ జాబితాతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధనలకు చైనా ఎంత ఖర్చు చేస్తోందో, ఇతర ప్రపంచ దేశాల కంటే ఎంత ముందుందో ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. జపాన్ విద్యా శాఖ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్ జాబితాలో 2018-20 మధ్య పరిశోధనా పత్రాలు అత్యధికంగా నివేదించిన దేశాల్లో చైనా అగ్ర స్థానంలో నిలవడం విశేషం. 2018-20 మధ్య చైనా మొత్తం 46,352 పరిశోధనా పత్రాలను విడుదల చేసిందని NISTEP ఆ గణాంకాలను వెల్లడించింది.



ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. 1998-2000 సంవత్సరాల మధ్య ఇదే చైనా ఈ ర్యాంకింగ్స్‌లో చివరి స్థానంలో (13వ స్థానంలో) నిలిచింది. కొసమెరుపు ఏంటంటే.. అలాంటి చైనా.. 2008-10 సమయంలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం నుంచి అనూహ్యంగా, ఏమాత్రం అంచనాలు లేని ఈ డ్రాగన్ దేశం రెండో స్థానంలో నిలిచే స్థాయికి దూసుకెళ్లింది. 1998-2000 మధ్య కాలంలో చైనా శాస్త్ర పరిశోధనలపై అంతగా ఆసక్తి చూపలేదని ఈ గణాంకాలతో తెలిసింది. 1998-2000 మధ్య చైనా కేవలం 1,217 పరిశోధన పత్రాలు మాత్రమే విడుదల చేసిందంటే.. డ్రాగన్ దేశం శాస్త్ర పరిశోధనలపై ఆ సమయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదని తేటతెల్లమైంది. కానీ.. అలాంటి చైనా.. 2008-10 సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 9,011 పరిశోధనా పత్రాలను విడుదల చేసి రెండో స్థానంలో నిలిచిందంటే.. చైనా ఎంతలా అలర్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.



ఇక.. 2018-20 సంవత్సరాల నాటికి చైనా దేశం పరిశోధనా రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. పలు రంగాల్లో విరివిరిగా పరిశోధనలు చేసింది. ఆ స్థాయిలో పరిశోధనలపై వెచ్చించింది. ప్రోత్సాహకాలు కల్పించింది. 2018-20 సంవత్సరాల మధ్య చైనా మొత్తం 46,352 పరిశోధనా పత్రాలను విడుదల చేసి నెంబర్.1 స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు చైనా విడుదల చేసినవి కావు. స్వయంగా జపాన్ విద్యా శాఖ విడుదల చేసినవి. అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా 2018-20 సంవత్సరాల మధ్య 36,680 పరిశోధనా పత్రాలను విడుదల చేసి రెండో స్థానానికి పరిమితమైంది. ఇదే అమెరికా 1998-2000 మధ్య 30,710, 2008-10 మధ్య 36,910 పరిశోధనా పత్రాలను విడుదల చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ.. డ్రాగన్ దేశం అగ్ర రాజ్యమైన అమెరికాను కూడా దాటేసి టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. ఇక్కడ.. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ర్యాంకింగ్స్ జాబితా విడుదల చేసిన జపాన్‌‌ను పరిశోధనలకు, సరికొత్త ఆవిష్కరణలకు ఆలవాలంగా చెబుతారు. కానీ.. అలాంటి జపాన్ 2018-20వ సంవత్సరాల మధ్యలో ఈ ర్యాంకింగ్ జాబితాలో అట్టడుగుకి పడిపోయింది. 1998-2000 మధ్య 4,369 పరిశోధనా పత్రాలతో నాలుగో స్థానంలో, 2008-10 మధ్య 4,369 పరిశోధనా పత్రాలతో ఆరో స్థానంలో నిలిచిన జపాన్.. 2018-20 మధ్య కాలంలో 3,780 పరిశోధనా పత్రాలతో 12వ స్థానానికి పడిపోయి ర్యాంకింగ్స్ జాబితాలో చిట్టచివర నిలిచింది.



ఇక.. మన భారత్ విషయానికొస్తే.. 2018-20 మధ్య ఇండియా 4,926 పరిశోధనా పత్రాలను విడుదల చేసి ఏడో స్థానంలో ఉంది. చైనాతో జనాభా విషయంలో పోటీ పడే మన దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనలకు వెచ్చించే విషయంలో మాత్రం డ్రాగన్ దేశంతో పోల్చుకుంటే ఆమడ దూరంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంటపడటంతో ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. పసిడి కోసం మన దేశం పరుగులు తీసినట్టుగా ‘ఒలింపిక్స్’ తరహాలో మరో ఛాలెంజ్‌లో స్వర్ణం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. సైన్స్‌పరంగా సమర్థంగా, పోటీతత్వంతో ఎదిగే దిశగా భారత్ ముందుకెళుతోందని.. పరిశోధనలకు ప్రైవేట్ సెక్టార్ కార్పొరేషన్స్ కూడా తప్పనిసరిగా సహకారం అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా తాను కూడా అడుగులేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-08-23T22:03:18+05:30 IST