Elon Musk-Twitter వ్యవహారంపై Anand Mahindra స్పందన ఇదీ...

ABN , First Publish Date - 2022-07-10T01:14:00+05:30 IST

ఎన్నో సందేహాల మధ్య సాగిన Elon Musk-Twitter డీల్ ప్రయాణం దాదాపు మురిగిపోయినట్టే. ఒప్పందాన్ని రద్దు చేయాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించినట్టు తేలడంతో డ్రామాను తలపించేలా సాగిన డీల్ మరుగునపడింది.

Elon Musk-Twitter వ్యవహారంపై Anand Mahindra స్పందన ఇదీ...

న్యూఢిల్లీ : ఎన్నో సందేహాల మధ్య సాగిన Elon Musk-Twitter డీల్ దాదాపు మురిగిపోయినట్టే. ఒప్పందాన్ని రద్దు చేయాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) నిర్ణయించినట్టు తేలడంతో డ్రామాను తలపించేలా సాగిన డీల్ మరుగునపడినట్టయ్యింది. ఒప్పందాన్ని ఆచరణలో పెట్టేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీటర్(Twitter) బోర్డ్ చెబుతున్నా.. ఆ ప్రయత్నాలు ఏమేర సఫలీకృతమవుతాయో చూడాలి. ఏకంగా 44 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం భవితవ్యం న్యాయస్థానాల్లో తేలబోతోంది. కాగా మస్క్ నిర్ణయం నేపథ్యంలో ‘ట్వీటర్-ఎలాన్ డీల్’ 3 నెలలప్రయాణంపై సోషల్ మీడియాలో సరదా చర్చ జరుగుతోంది. నెటిజన్లు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. పలువురు జోకులు పండించే ప్రయత్నం చేశారు. 


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త, ఆనంద్ మహింద్రా అధినేత ఆనంద్ మహింద్రా కూడా ‘ట్వీటర్-మస్క్ డీల్’పై స్పందించారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ‘ట్విటర్‌ని ఆటపట్టించడం’గా ఆయన అభివర్ణించారు. ‘‘ ఎలాన్ మస్క్ గానీ భారతీయ రైల్లో ప్రయాణిస్తే అతడిని TT (టికెట్‌లేని ప్రయాణికుడి-Ticketless Traveler)గా ముద్రవేస్తారు. ప్రస్తుతం ఏ హెడ్‌లైన్‌‌లోనైనా పేలిపోయే పదంగా TT మారగలిగాడు ’’ అని మహింద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మస్క్‌కి బదులు మీరే కొనొచ్చు కదా ట్వీటర్‌ని అని ఆనంద్ మహింద్రాని ప్రశ్నించాడు. ‘ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మనోడే’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. పరాగ్ అగర్వాల్ భారతీయుడే కాబట్టి సరసమైన రేటుకే ఆఫర్ ఇస్తాడని పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేస్తాడనుకున్నా.. కానీ అలా జరగలేదు. కాబట్టి ట్విటర్‌కి తన సానుభూతిని తెలియజేస్తున్నానన్నాడు.

Updated Date - 2022-07-10T01:14:00+05:30 IST