Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత ఆనంద్ శర్మ

ABN , First Publish Date - 2022-08-21T21:04:50+05:30 IST

వందేళ్లకుపైబడిన చరిత్రగల కాంగ్రెస్‌ (Congress)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది

Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత ఆనంద్ శర్మ

న్యూఢిల్లీ : వందేళ్లకుపైబడిన చరిత్రగల కాంగ్రెస్‌ (Congress)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న వేళ సీనియర్ నేతలు ఝలక్ ఇస్తున్నారు. అంతర్గత తిరుగుబాటును సూచించే రీతిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ పార్టీలోని తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 


హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగుతాయి. అదేవిధంగా జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అటువంటి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తనను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయనను ఈ పదవిలో ఏప్రిల్ 26న నియమించారు. ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఆయన ఒకరు. 


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో, తనను పార్టీ సమావేశాలకు ఆహ్వానించడం లేదని, అందువల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పినట్లు తెలుస్తోంది. 


ఆనంద్ శర్మ 1982 శాసన సభ ఎన్నికల్ల్లో తొలిసారి పోటీ చేశారు. 1984లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కోసం టిక్కెట్ ఇచ్చారు. ఆయన పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 


జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి గులాం నబీ ఆజాద్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శిస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో ఆజాద్, శర్మ కూడా ఉన్నారు. గుజరాత్, జమ్మూ-కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఇవి చేదు పరిణామాలు.



Updated Date - 2022-08-21T21:04:50+05:30 IST