పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారు

ABN , First Publish Date - 2022-07-01T06:35:10+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్‌ (అనంతబాబు) కేసు విచారణలో పోలీసు అధికారులు పరోక్షంగా నిందితుడికి సహకరిస్తున్నారని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.

పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారు

అనంతబాబు కేసుపై హెచ్‌ఆర్సీకి ముప్పాళ్ల ఫిర్యాదు
రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 30 : వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్‌ (అనంతబాబు) కేసు విచారణలో  పోలీసు అధికారులు పరోక్షంగా నిందితుడికి సహకరిస్తున్నారని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి, సభ్యుడు జి.శ్రీనివాసరావులతో కూడిన కమిషన్‌కు వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ, సోదరుడు నవీన్‌లతో కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆధారాలతో 58 పేజీల డాక్యుమెంట్‌, నిందితుడికి అనుకూలంగా కాకినాడ ఎస్పీ మాట్లాడిన సీడీని, ఏడు పేజీల ఫిర్యాదు పత్రాన్ని మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చినట్లు ముప్పాళ్ల చెప్పారు.  ఇటువంటి కేసుల్లో రిమాండ్‌ ఇచ్చిన వెంటనే నిందితులను పోలీస్‌ కస్టడీకి అడుగుతారని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా రిమాండ్‌ 15వ రోజు సాయంత్రం 4.50 గంటలకు పోలీస్‌ కస్టడీకి ఇవ్వండి, మేం  విచారించి మిగిలిన వారిని పట్టుకోవాలని కోరారన్నారు.  సెల్‌ టవర్‌ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ఇంతకాలం అవసరంలేదని, కానీ పోలీసులు ఆ పనిచేయలేదన్నారు. కాల్‌ డేటా పరిశీలించడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. నిందితుడి ఇల్లు శంకర్‌ టవర్స్‌కు అర్ధరాత్రి పూట నిందితుడితో వచ్చిన మహిళ ఎవరో విచారించలేదన్నారు. అనంతబాబుకు సెక్యూరిటీ ఉన్న పోలీసులను విచారించి వాస్తవాలు తెలుసుకుని, నేరస్థలాన్ని గుర్తించి మిగిలిన నిందితులను అరెస్టు చేయడంలో విఫలమయ్యారన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో 31 గాయాలు, మూడు ఇంటర్నల్‌ గాయాలు ఉన్నాయని పేర్కొన్నారని, ఒక్కరికే ఎలా సాధ్యమవుతుందని తెలిపామన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి రావాల్సిన భూమి, పింఛను, నిత్యావసరాలు అందజేయడంతో పాటు ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.  
  మాకు న్యాయం చేయాలి : సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు
‘ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మా అబ్బాయిని అనంతబాబు కొట్టి చంపేశాడు. అనంతబాబుతోపాటు ఆయన వెనక ఎవరున్నారో బయటకు లాగాలి. మా బిడ్డను మరిచిపోలేకపోతున్నాం. చాలా బాఽధగా ఉంది. పూర్తిగా విచారించకుండా కేసును వదిలేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు’ అని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-01T06:35:10+05:30 IST