కుప్పంలోనూ అరాచక వ్యూహం

ABN , First Publish Date - 2021-11-06T08:00:15+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన అరాచక వ్యూహాన్నే కుప్పంలోనూ అధికార వైసీపీ మొదలు పెట్టిందని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.

కుప్పంలోనూ అరాచక వ్యూహం

  విజయానికి వైసీపీ మూడు అస్త్రాలు

ఎలాగైనా గెలిచి చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీయాలని పట్టుదల


చిత్తూరు, నవంబరు 5 (ఆంద్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన అరాచక వ్యూహాన్నే కుప్పంలోనూ అధికార వైసీపీ మొదలు పెట్టిందని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్ల్లే వేయకుండా దాడులు చేయడం.. అధికారులను బెదిరించి ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను విత్‌డ్రా చేయించడం.. తద్వారా ఏకగ్రీవాలుగా ప్రకటించుకోవడం.. వంటి చర్యలు అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  పుంగనూరు, తిరుపతి ప్రాంతాల్లో ప్రత్యర్థి అభ్యర్థుల మీద దాడులకే తెగబడ్డారు. చిత్తూరు మున్సిపాలిటీలో ఏకంగా 20కుపైగా డివిజన్లలో ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను విత్‌డ్రా చేసుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇదే అస్త్రాన్ని కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రయోగించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నదని ప్రత్యర్ధి పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబును సొంత గడ్డ మీద ఓడించి తీరాలని మంద్రి పెద్దిరెడ్డి బలంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇందుకు అనుగుణంగానే వ్యూహరచన జరిగిందని శుక్రవారం టీడీపీ అభ్యర్థి మీద జరిగిన దాడి ఇందులో భాగమేనని ప్రత్యర్ధులు అంచనా వేస్తున్నారు.  నామినేషన్లను అడ్డుకునే ప్రక్రియలో విఫలమైతే ఆ తర్వాత ప్రలోభాలతో అభ్యర్ధులను లొంగదీసుకోవడం, లొంగకపోతే బెదిరించడం వంటి చర్యలకు వైసీపీ వారు దిగుతారని ఊహిస్తున్నారు. అప్పటికీ విత్‌డ్రా చేసుకోకపోతే వారి ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టే చర్యలకు దిగడం వంటివి చేస్తారని అంటున్నారు. వారి బంధుమిత్రులను పార్టీ మారేలా చేసే ఎత్తుగడలకు కూడా దిగుతున్నారని ప్రచారం అవుతోంది.  ఛైర్మెన్‌  పీఠం కోసం ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేలు పంపిణీ చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.


అనుకూలమైన అధికారులు

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ వర్మ కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ప్రత్యేకాధికారిగా నియామకమయ్యారు. ఈయన మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలమైన వ్యక్తి అని తెలిసిందే. కుప్పం వచ్చిన వెంటనే ఈయన ఎన్నికలతో సంబంధం లేని సంఘమిత్రలతో సమావేశమయ్యారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది.  ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే పోలీసులను కూడా అనుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బయటి ప్రాంతం నుంచి ఓ సీఐను ఇటీవల కుప్పానికి  తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


గత ఎన్నికల్లో వందశాతం టీడీపీకే

కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా.. 52 వేల జనాభా, 39,261 మంది ఓటర్లున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. కుప్పం మున్సిపాలిటీ కాకముందు, కుప్పం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 20 వార్డులుండేవి. 2013లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో 16 టీడీపీ, 4 వార్డులు వైసీపీకు దక్కాయి. కుప్పం సర్పంచిగా కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందారు అలాగే కుప్పం మున్సిపాలిటీ అయ్యాక.. కుప్పంతో పాటు మండలంలోని 7 గ్రామ పంచాయతీలు, కమతమూరు, తంబిగానిపల్లె, అనిమిగానిపల్లె, దలవాయికొత్తపల్లె, సామగుట్టపల్లె, లక్ష్మీపురం, చీలేపల్లెలు విలీనమయ్యాయి. 2013 ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులే సర్పంచులయ్యారు. దశాబ్దాలుగా చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తుండడంతో ఈ ప్రాంతం టీడీపీకి కంచుకోటగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 18 స్థానాలకుపైగా టీడీపీ గెలుస్తుందని ఇంటిలిజెన్సు సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో అన్ని అస్త్రాలూ సంధించేందుకు అధికార పక్షం సన్నద్ధమవుతోందని అంటున్నారు.

Updated Date - 2021-11-06T08:00:15+05:30 IST