30 ఏళ్లుగా Vanama Raghava అరాచకాలు..!?

ABN , First Publish Date - 2022-01-07T08:01:02+05:30 IST

వనమా రాఘవేందర్‌రావు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం

30 ఏళ్లుగా Vanama Raghava అరాచకాలు..!?

  • 1991 నుంచే రాఘవ కీచకపర్వం..
  • భూ దందాలు, సెటిల్‌మెంట్లు, అత్యాచారాలు
  • షాడో ఎమ్మెల్యేగా చలామణి
  • గత ఏడాది ఓ ఫైనాన్సియర్‌ ఆత్మహత్యకూ కారణం!
  • ఇంటి నుంచి పరారు.. ముందస్తు బెయిలుతో రాక
  • తాజాగా రామకృష్ణ కేసులోనూ పరారైన రాఘవ


కొత్తగూడెం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వనమా రాఘవేందర్‌రావు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు. రాఘవ దౌర్జన్యాలు, కీచక పర్వాలు ఈనాటివి కాదని.. దాదాపు 30 ఏళ్ల కిందటే అతని అరాచకాలు మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. 1991లో అప్పటి స్పాంజ్‌ ఐరన్‌, నేటి ఎన్‌ఎండీసీ కర్మాగారంలో యూనియన్‌ ఎన్నికల సందర్భంలో చర్ల చిట్టయ్య అనే కార్మికుడిని అపహరించి, హత్య చేసి గోదావరి నదిలో పడేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు.


ఆనాటి నుంచి అతని అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. తర్వాత 1993లో ఎన్‌ఎండీసీ సమీపంలో ఓ వ్యక్తికి శిరోముండనం చేయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అదే ఏడాది ఓ అత్యాచార యత్నం కేసులోనూ ఇరుక్కున్నాడు. వాటన్నింటినీ తన రాజకీయ బలంతో వెలుగులోకి రాకుండా చేశాడని చెప్పుకొంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కడ జరిగినా అతను అడిగిన భూమి ఇచ్చేయాలని.. ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టినా తన, పర భేదం లేకుండా ముడుపులు చెల్లించాల్సిందేనని అంటున్నారు. అధికారులు, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపిస్తున్నారు. 1996లో పాల్వంచలో పనిచేసిన ఓ పోలీసు భార్యపై అత్యాచారం చేయగా.. అతను ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.


2013లో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ అప్పటి ఏఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ రాఘవను అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. 2019లో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో పేరుకు వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అయినా పెత్తనం మొత్తం రాఘవేంద్రరావుదేనని, షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. భూదందాలు, సెటిల్‌మెంట్లు, ప్రైవేట్‌ పంచాయతీలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం నవభారత్‌ ఏరియాలో భూ ఆక్రమణ క్రమంలో ఓ గిరిజన మహిళపై దాడికి పాల్పడిన సంఘటనలో రాఘవపై కేసు నమోదైంది. ఆ విషయంలో మంత్రి గిరిజన మహిళకు అండగా నిలిచినా.. రాఘవ తన పలుకుబడితో కేసును బుట్టదాఖలు చేయించాడని చెబుతున్నారు. 2021 జూలై 30న ఫైనాన్సియర్‌ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడానికి రాఘవ బెదిరింపులే కారణమన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో రాఘవపై కేసు నమోదవగా.. అప్పుడు కూడా ఇంటి నుంచి పరారై ముందస్తు బెయిల్‌తో వచ్చాడు. తాజాగా నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇవి కేవలం వెలుగు చూసిన సంఘటనలు మాత్రమేనని, వెలుగు చూడనివి కోకొల్లలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-07T08:01:02+05:30 IST