సినిమా రివ్యూ: దర్జా (Darja)

Published: Fri, 22 Jul 2022 14:45:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ: దర్జా (Darja)

సినిమా రివ్యూ: దర్జా

విడుదల తేది: 22–07–2022

నటీనటులు : సునీల్‌, అనసూయ, ఆమని, షఫీ, పృధ్వీ, చత్రపతి శేఖర్‌, అక్సాఖాన్‌, షకలక శంకర్‌, మిర్చి హేమంత్‌, వీరబాబు తదితరులు. 

కెమెరా: దర్శన్‌

సంగీతం : రాప్‌ రాక్‌ షకీల్‌

ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌. వర్మ

నిర్మాత: శివశంకర్‌ పైడిపాటి 

దర్శకత్వం: సలీమ్‌ మాలిక్‌


బుల్లితెర యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు అనసూయ భరద్వాజ్‌. ‘పుష్ప’ సినిమాలో దాక్షయణిగా నెగటివ్‌ పాత్రతో అలరించిన ఆమె మరోసారి వెండితెరపై విలనీ పాత్రలో కనిపించారు. సునీల్‌ కీలక పాత్ర పోషించిన ‘దర్జా’ చిత్రంలో కనకమహాలక్ష్మీగా నటించారు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 


కథ: 

కనకం అలియాస్‌ కనక మహాలక్ష్మీ(అనసూయ) బందరు పరిసర ప్రాంతాలను శాసిస్తూ సారా వ్యాపారం నడుపుతుంటుంది. బందర్‌ పోర్ట్‌ ప్రాజెక్ట్‌ మీద కన్నెసిన ఆమె.. తన పనికి ఎదురొచ్చిన వారిని అంతం చేయడం పనిగా పెట్టుకుంటుంది. ఆమె చేస్తున్న అక్రమాలకు అడ్డు కట్ట వేయడానకి వచ్చిన పోలీసులు, ఎమ్మెల్యేలను సైతం హతమార్చుతుంది. ఇది ఒక కథ! 

కోరుకొల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్‌(అరుణ్‌ వర్మ)  ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతానికి శివ శంకర్‌ పైడిపాటి (సునీల్‌) ఏసీపీగా వస్తాడు. రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్‌ చేస్తాడు. గణేష్‌ కేసు బయటకు తీసి.. అది ఆత్మహత్య కాదని, కనకం చేయించిన హత్య అని తెలుసుకుంటాడు. కనకంపై శివ శంకర్‌ ప్రతీకారం తీర్చుకోవడానికి కారణమేంటి అన్నది మిగతా కథ. 


సినిమా రివ్యూ: దర్జా (Darja)

విశ్లేషణ: 

ఓ చిన్న కుటుంబం.. అందులో తల్లి, బిడ్డలు, మేనమామ, అక్కా చెల్లెళ్లు, తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించే నియంతలాంటి ఓ మహిళ ఇతివృత్తంగా సాగే రివేంజ్‌, యాక్షన్‌ డ్రామా ఇది. కథగా చూస్తే కొత్తదనం ఏమీ లేదు. చాలా సినిమాల్లో చూపించేసిన సన్నివేశాల్ని పార్టు పార్టులుగా చూపించారు. కథ కొత్తగా లేనప్పుడు ట్రీట్‌మెంట్‌, స్ర్కీన్‌ప్లే విషయంలోనైనా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. దర్శకుడు అటువైపు దృష్టి సారించలేదు. ఈ కథను బందరుకు కొత్తగా వచ్చిన ఎస్‌.ఐ(షఫీ,  కానిస్టేబుల్‌(షేకింగ్‌ శేషు) మధ్యన చర్చగా నడిపించిన తీరు బాగుంది. బందరు కనకంగా అనసూయ ఎంట్రీతో కథ వేగంగా ముందుకు సాగుతుంది. అనసూయది కీలకమైన పాత్రే అయినా అరగంట కోసారి కనిపించే పాత్రలాగా అనిపించింది.  మూగవాడైన గణేష్‌, పుష్పల ప్రేమ కథను చూపించిన తీరు బావుంది. మధ్య మధ్యలో షకలక శంకర్‌, రంగ, గీత(అక్సాఖాన్‌) పాత్రలు వినోదాన్ని పంచినప్పటికీ ఆ సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. విరామానికి ముందు సునీల్‌ ఎంట్రీతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఫస్టాఫ్‌ కాస్త బోరింగ్‌గా సాగినా సెకండాఫ్‌లో సునీల్‌, అనసూయల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పోలీసు స్టేషన్ లో సునీల్‌కు అనసూయ ఇచ్చే వార్నింగ్‌, క్లైమాక్స్‌లో సునీల్‌ ఫైట్స్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఎక్కువశాతం కొత్త ముఖాలు కనిపించడం మైనస్‌ అనుకోవచ్చు. గతంలో రంగమ్మత్తగా, దాక్షాయణిగా ఆకట్టుకున్న అనసూయ ఈ చిత్రంలో కనకమహాలక్ష్మీగా అంతే పవర్‌ఫుల్‌గా కనిపించారు. డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా శంకర్‌ పాత్రకు సునీల్‌ వంద శాతం న్యాయం చేశారు. గణేశ్‌ తల్లిగా ఆమని ఆకట్టుకున్నారు. ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. సెంటిమెంట్‌ సన్నివేశాలు సినిమాకు ఎసెట్‌ అవుతాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. అయితే అక్కడక్కడా డి.ఐ వర్క్‌ ఆకట్టుకోలేదు. ర్యాప్‌రాక్‌ షకీల్‌ పాటల వరకూ సంగీతం బాగానే అందించారు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం రణగొణ ధ్వనులతో నింపేశారు. దర్శన్‌ కెమెరా పనితనం బాగుంది. ఎడిటర్‌ ఎమ్‌.ఆర్‌. వర్మ ఫస్టాఫ్‌ను కాస్త ట్రిమ్‌ చేసుంటే బావుండేది. కథ, కథనం, కొత్తదనం గురించి ఆలోచించకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే.. అనసూయ, సునీల్‌ పాత్రలను ఎంజాయ్‌ చేయవచ్చు. 


ట్యాగ్‌లైన్‌: సునీల్-అనసూయ కోసమే!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International