గర్భిణిల కోసం...

ABN , First Publish Date - 2022-01-06T05:54:26+05:30 IST

ప్రెగ్నెన్సీ సమయం మహిళకు చాలా విలువైనది. ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవాలి. అందుకే గర్భిణిలకు సౌకర్యవంతంగా ఉండే దుస్తుల....

గర్భిణిల కోసం...

ప్రెగ్నెన్సీ సమయం మహిళకు చాలా విలువైనది. ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవాలి. అందుకే గర్భిణిలకు సౌకర్యవంతంగా ఉండే దుస్తుల తయారీని ప్రారంభించారు అంచల్‌, ఆష్నా. ‘షీక్‌ మామ్జ్‌’ పేరుతో స్టార్టప్‌ ప్రారంభించి దూసుకెళుతున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. 


ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమయంలో షాపింగ్‌ చేసి అవసరమైన దుస్తులు కొనే వెసులుబాటు చాలామందికి దొరకదు. ఒకవేళ కొందామన్నా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గ్యాప్‌ను పూరించడానికి అక్కాచెల్లెళ్లు స్టార్టప్‌ను ప్రారంభించారు. వీరిది ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన వ్యాపార కుటుంబం. ప్రస్తుతం అక్కాచెల్లెళ్లిద్దరూ ఢిల్లీలో స్థిరపడ్డారు. ‘‘ఒక మహిళ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆమె అవసరాలు తెలుసుకుని అన్నీ అందించగలగాలి. ఆ చిన్న ప్రయత్నం మేం చేస్తున్నాం. ‘షీక్‌ మామ్జ్‌’ మాకు బేబీలాంటిది. కొవిడ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం.


రిస్క్‌ ఉన్నా మా విజన్‌ స్పష్టంగా ఉంది. మేం అందించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, స్టయిల్‌గా ఉంటాయి. తక్కువ ధరలో లభిస్తాయి’’ అని అంటారు అంచల్‌. ఈ అక్కాచెల్లెళ్లు కేవలం రెండు లక్షల రూపాయలతో స్టార్టప్‌ ప్రారంభించారు. కొద్దికాలంలోనే బాగా పుంజుకుని మార్కెట్లో మంచి పేరు సంపాదించారు.  ‘‘మెటర్నిటీ క్లాత్స్‌ అనగానే ప్రత్యేకంగా ఉంటాయి. అందరికీ ఉపయోగపడవు అని అనుకుంటారు. కానీ ఎవరైనా వీటిని వేసుకోవచ్చు. ఫీడింగ్‌ ఫ్రెండ్లీ దుస్తులు, టాప్స్‌, లాంజ్‌ వేర్స్‌ వంటివి చాలా వెరైటీలను మేం అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని అంటారు అంచల్‌. 


స్ఫూర్తి ఎవరంటే...

వ్యాపారవేత్తలుగా మారడానికి స్ఫూర్తి మా అమ్మే అంటారు ఈ సిస్టర్స్‌. ‘‘మా అమ్మ మాకో సలహా ఇచ్చింది. మహిళ చాలా శక్తిమంతురాలు. ఎందుకంటే ఒక కొత్త జీవితాన్ని సృష్టించే సామర్థ్యం ఆమెకు మాత్రమే ఉంది. ఎప్పుడైనా నీ ప్రయాణంలో శక్తి కోల్పోయినట్టు అనిపిస్తే ఈ మాటను గుర్తుతెచ్చుకో! అని చెప్పింది’’ అని అంటారు అంచల్‌. వీళ్లు రూపొందించిన మెటర్నిటీ క్లాత్స్‌ను కరీనా కపూర్‌ ధరించడంతో ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. ‘‘కరీనా కపూర్‌ ప్రెగ్నెన్సీ సమయంలో మేం రూపొందించిన దుస్తులను ధరించడం మా జర్నీలో మైలురాయిగా భావిస్తాం. ఆ తరువాతే మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని అంటారు ఈ సిస్టర్స్‌. అంచల ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలోనే స్టార్టప్‌ ఆలోచన తట్టిందంటారు. ‘నా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో ఇంట్లో మావారి టీషర్ట్స్‌ ధరించాను. లూజ్‌ కుర్తాలు వేసుకున్నా. ఆఫీసుకు వెళ్లే సమయంలో వేసుకోవడానికి సరైన దుస్తులు ఉండేవి కావు.


ఒకవేళ ఉన్నా వాటి ధర అందుబాటులో లేదు. పైగా సౌకర్యవంతంగా ఉండేవి కావు. ఆ సమయంలోనే ప్రెగ్నెన్సీ దుస్తులు రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని ఆష్నాతో పంచుకుంటే తను కూడా ఓకే చెప్పింది. దాంతో చిన్న స్టార్టప్‌ ప్రారంభించాం’’ అని తన ప్రయాణాన్ని పంచుకున్నారు అంచల్‌. అయితే వ్యాపారం బాగా పుంజుకుంటున్న దశలో కరోనా బాగా దెబ్బకొట్టింది. ‘‘కరోనా మొదటి వేవ్‌ సమయంలో ఎలాగొలా మేనేజ్‌ చేయగలిగాం. కానీ సెకండ్‌ వేవ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా దగ్గర పనిచేసే మహిళలకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాం’’ అంటారు ఆష్నా. అంచల్‌ ముంబైలోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబిఎ పూర్తి చేశాక హెచ్‌ఎడ్‌ఎఫ్‌సీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి సంస్థల్లో పనిచేశారు. ఆష్నా కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. వీరు ప్రారంభించిన స్టార్టప్‌లో పనిచేస్తున్న వాళ్లందరూ మహిళలే.

Updated Date - 2022-01-06T05:54:26+05:30 IST