ప్రమాదంలో ప్రాచీన తెలుగు కేంద్రం

ABN , First Publish Date - 2021-01-06T06:05:36+05:30 IST

మూడువేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషకి 2008లో ప్రాచీన హోదా వచ్చింది. ఫలితంగా తెలుగు ప్రాచీనత గురించి, విశిష్టత గురించి...

ప్రమాదంలో ప్రాచీన తెలుగు కేంద్రం

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లక్ష్యాలను విశ్వవిద్యాలయం ద్వారా సాధించడం కష్టతరం. కాబట్టి ఈ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు కానున్న భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపకుండా స్వయంప్రతిపత్తితో విడిగానే కొనసాగించాలని తెలుగు భాషా‍‍భిమానులు, సాహిత్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం నిర్ణయంపై కన్నడిగులు పోరాటానికి సిద్ధమయ్యారు. తెలుగువారు కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి పూనుకోవాలి.


మూడువేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషకి 2008లో ప్రాచీన హోదా వచ్చింది. ఫలితంగా తెలుగు ప్రాచీనత గురించి, విశిష్టత గురించి లోతుగా పరిశోధనలు జరిపే అవకాశం లభించింది. చాలాకాలంపాటు మన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ అధీనంలోనే ఉన్నది. చివరికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో ఈ కేంద్రం మైసూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరుకు తరలించారు. అయితే దానికి స్వతంత్ర ప్రతిపత్తి మాత్రం లేదు. 


తెలుగు కేంద్రానికి సంచాలకుల నియామకం జరిగిన తర్వాత పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయి. రెండు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఆరేడు పుస్తకాలు, పరిశోధకుల యోజనా నివేదికలు అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. ‘తెలుగు సిరి’ అనే పరిశోధన పత్రిక ప్రారంభ సంచిక వెలుగు చూసింది. హైదరాబాదులో, తిరుపతిలో, మైసూరులో, నెల్లూరులో జరిపిన సదస్సులలో వందలమంది అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు పాల్గొని తర్ఫీదు పొందారు.  


ఇవన్నీ ఇలా ఉండగా మైసూరులోని భారతీయ భాషా సంస్థను (సి.ఐ.ఐ.ఎల్) భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను రూపొందించడానికి పదకొండుమంది సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉభయ రాష్ట్రాల్లోని ఒక్క తెలుగు వారు కూడా లేకపోవడం విచారించాల్సిన విషయం. 


ప్రాచీన భాషల కేంద్రాలను ఈ భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో భాగంగా కలిపే విషయమై తగిన సూచనలను ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం ఈ కమిటీని కోరింది. వెంటనే తమిళ సోదరులు తమిళ కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేయడమే కాకుండా పత్రికల ద్వారా కూడా ప్రకటించారు. నిజానికి తమిళ కేంద్రాన్ని వదలి తెలుగులాంటి ఇతర భాషలని మాత్రమే చేర్చే ప్రసక్తి ఉన్నప్పటికీ తమిళులు పోరాటానికి సిద్ధమయ్యారు. అయినా తెలుగువారు స్పందించకపోవటం ఎంతో తలవంపులు తెచ్చే విషయం.


నెల్లూరులోని ప్రాచీన తెలుగు కేంద్రాన్ని విశ్వవిద్యాలయంలో కలపడం వల్ల ఆ కేంద్రం స్వయం ప్రతిపత్తి కోల్పోవడమే కాకుండా, దాని అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికి కేటాయించవలసిన ఆదాయవ్యయాలు కూడా విశ్వవిద్యాలయ పరిధిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగుశాఖలు చాలా పని చేస్తున్నాయి. వీటన్నింటిలోను బోధన ప్రధానంగాను, పరిశోధన పరిమితంగాను ఉంది. అవి కూడా ఎం.ఫిల్., పిహెచ్.డి. డిగ్రీల కోసం ఆయా విద్యార్థులు చేసే పరిశోధనలు మాత్రమే. వాటి ప్రచురణ అంతంత మాత్రం. 


ఈ నేపథ్యంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడంవల్ల తీవ్రమైన నష్టం కలుగుతుంది. రెండేళ్ళ క్రితమే ఏర్పడిన ఈ కేంద్రంలో ఏడు బాహ్య ప్రాజెక్టులు పూర్తి అయినాయి. అందులో ఒకటి ముద్రితమైంది. మిగిలిన ఆరు ముద్రణ చేపట్టవలసి ఉంది. అంతర్గత ప్రాజెక్టులు ఏడు పూర్తి అయినాయి. వాటిని కూడా త్వరలో ముద్రిస్తారు. మరో నాలుగు బాహ్య ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. 


ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం తన లక్ష్యాలకు అనుగుణంగా శాసనాలు చదవడం, తాళపత్రాలు పరిష్కరించడం, తెలుగు సాహిత్య అధ్యయనం గురించి కార్యశాలలను, శిక్షణ తరగతులను నిర్వహించడం చేస్తోంది. పురావస్తు సంగ్రహాలయాన్ని ఏర్పాటు చెయ్యడానికి వస్తు సామగ్రిని సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో చేపట్టనటువంటి పలు కార్యక్రమాలు- ఉదాహరణకి- కనుమరుగైపోతున్న కళాకారులను, సాహిత్యకారులను, జానపద గిరిజన కళాకారులను, ఆ కళారూపాలను, చరిత్ర సంస్కృతులను డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ చేయించి రాబోయే తరాల వారికి అందించడం; గ్రామీణ చేతివృత్తుల భాష, వస్తు సామగ్రిని సేకరించి భద్రపరచడం.. ఇలాంటివాటికి ప్రాచీన తెలుగు కేంద్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లక్ష్యాలను విశ్వవిద్యాలయం ద్వారా సాధించడం కష్టతరం. కాబట్టి ఈ కేంద్రాన్ని విశ్వవిద్యాలయంలో కలపకుండా స్వయంప్రతిపత్తితో విడిగానే కొనసాగించాలని తెలుగు భాషాభిమానులు, సాహిత్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కన్నడిగులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. తెలుగువారు కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి పూనుకోవాలి.

ఆచార్య ఆర్వీయస్ సుందరం

Updated Date - 2021-01-06T06:05:36+05:30 IST