ఇక అన్ని సెట్లలో ఈడబ్ల్యూఎస్‌!

ABN , First Publish Date - 2021-03-01T09:07:45+05:30 IST

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు కోసం ఏటా విపరీతమైన పోటీ ఉంటుంది. కానీ, ఇందులో బీఏ, బీఎస్సీలో ప్రతి తరగతిలో గరిష్ఠ సీట్లు 30 ఉండగా.

ఇక అన్ని సెట్లలో ఈడబ్ల్యూఎస్‌!

  • వృత్తివిద్యా కాలేజీల్లో 25ు సీట్లు పెంపు.. 
  • రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 48 వేల సీట్లు
  • విధివిధానాల ఖరారుకు త్వరలో కమిటీ
  • ఉన్నత విద్యామండలి కసరత్తు 
  • త్వరలో ప్రభుత్వానికి నివేదిక: పాపిరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు కోసం ఏటా విపరీతమైన పోటీ ఉంటుంది. కానీ, ఇందులో బీఏ, బీఎస్సీలో ప్రతి తరగతిలో గరిష్ఠ సీట్లు 30 ఉండగా.. బీకాంలో 45 ఉన్నాయి. 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన, నాణ్యమైన విద్యలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ కాలేజీలో దశాబ్దాలుగా ఒక్క సీటు కూడా పెరగలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ కళాశాలలో అదనంగా మరో 25 శాతం సీట్లు పెరగనున్నాయి. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌.. ఇలా అన్ని వృత్తి విద్యా కాలేజీల్లోనూ పాతిక శాతం సీట్లు పెరగనున్నాయి. ఎంసెట్‌తో పాటు ఇకపై ప్రకటించబోయే అన్ని సెట్లలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు కానుంది. దరఖాస్తులోనే అభ్యర్థులు ఈ కోటా విషయాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. 


24 రాష్ట్రాల్లో అమలు..

అగ్రవర్ణాల పేదలకు అదనంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకోగా.. దీన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేసీఆర్‌ సర్కారు గత నెలలో నిర్ణయించింది. ఉన్నత విద్యా రంగంలో దీన్ని అమలు చేయడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాను 24 రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా ప్రభుత్వాలు కేవలం ఉన్నత విద్యలోనే అమలు చేస్తుండగా.. 21 రాష్ట్రాల్లో ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఇది 22 రాష్ట్రాల్లో అమల్లో ఉండగా అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీనికోసం త్వరలో నిపుణుల కమిటీని ప్రకటించనుంది.  నిర్దిష్ట కాలపరిమితిలోపు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. 


10 కాదు.. 25శాతం.. 

ప్రస్తుత రిజర్వేషన్‌ విధానానికి ఆటంకం కలగకుండా, అదనంగా 10శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్రం పేర్కొంటోంది. అయితే దీన్ని అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 50 నుంచి 60 శాతానికి పెరగనున్నాయి. ఈ క్రమంలో అదనంగా 25 శాతం సీట్లను పెంచుకోవచ్చని ఏఐసీటీఈ ఇప్పటికే స్పష్టం చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ యూజీ, పీజీ కోర్సుల్లో 25శాతం చొప్పున సీట్లు పెరుగుతాయని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, ఫామ్‌-డి, ఆర్కిటెక్చర్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎం-ఆర్క్‌, ఫామ్‌-డి(పీబీ) కోర్సుల్లో మొత్తం 1,92,580 సీట్లు ఉండగా ఇందులో 25 శాతం అంటే.. 48 వేలకు పైగా సీట్లు పెరగనున్నాయి. బీఏ, బీఎస్సీ, బీకాం, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం లాంటి కోర్సుల్లోనూ ఇదే విధానంలో సీట్ల సంఖ్య పెంచాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో మొత్తం 4.05 లక్షల సీట్లు ఉండగా.. ఏటా 40-50శాతం మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూజీసీని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. 


వసతులూ పెంచాల్సిందే.. 

ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్య గరిష్ఠంగా 25శాతం వరకు పెరగనుంది. అయితే వీటికి తగ్గట్టుగా కాలేజీల్లో వసతులను కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు సరిపడా గదుల్లేవు. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తే గదుల సమస్య మరింత ఇబ్బందికరంగా మారనుంది. దీనికోసం ప్రభుత్వంపై పడనున్న ఆర్థికభారంపైనా ఉన్నత విద్యామండలి అధ్యయనం చేయనుంది. ఇలా మొత్తం ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం చేయాల్సిన ఖర్చుపైనా నివేదిక సిద్ధం చేయనున్నారు. 


గరిష్ఠ పరిమితిపైనా అధ్యయనం.. 

ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే  నిర్ణయించింది. ఉన్నత విద్యలో అమలుకు మార్గదర్శకాలు తయారు చేస్తున్నాం. వైద్య కాలేజీల్లో వసతుల ఆధారంగా సీట్లను పెంచాలన్న ఎంసీఐ నిబంధనలకు లోబడి గరిష్ఠ పరిమితి సీట్లను నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలవుతున్నా.. ఉస్మానియా మెడికల్‌ కాలేజీతోపాటు నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఒక్క సీటు కూడా పెరగలేదు. ఇలాంటి విధానాన్ని ఉన్నత విద్యలో అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాం. త్వరలో ఏర్పాటు చేయనున్న కమిటీ అన్ని అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. 

- ఆచార్య పాపిరెడ్డి, అధ్యక్షుడు, ఉన్నతవిద్యామండలి

Updated Date - 2021-03-01T09:07:45+05:30 IST