అందనాలపాడు శోకసంద్రం

ABN , First Publish Date - 2022-06-22T05:12:36+05:30 IST

అందనాలపాడు శోకసంద్రం

అందనాలపాడు శోకసంద్రం
మిరియాల మస్తాన్‌రావు మృతదేహం, గొర్రె వెంకయ్య మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబసభ్యులు, విద్యుత్‌ వైర్లకు తగిలి ప్రమాదానికి కారణమైన మైకు

ముగ్గురు రైతుల దుర్మరణంతో విషాదం

పెద్దదిక్కును కోల్పోయిన మూడు కుటుంబాలు

ఆలయంలో మైకును ఎత్తుగా లేపుతుండగా కరెంటు షాక్‌

ఆదుకుంటామన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్‌


ఆధ్యాత్మికతపై ఉన్న మక్కువ వారి ప్రాణం మీదకు తెచ్చింది. గ్రామంలోని ఆలయంలో కొన్ని రోజులుగా మైకు మూగబోవడంతో దాన్ని సరిచేయాలనుకున్నారు. ఊరంతటికీ పాటలు బాగా వినిపించేలా చేయాలనుకుని ఎత్తుగా అమర్చేయత్నం చేశారు. అదే వారి పాలిట శాపమైంది. పైనున్న విద్యుత్‌ తీగలు తగిలి ప్రాణాలొదిలారు. ఒకే గ్రామంలోని ముగ్గురు రైతులు మృత్యువాతపడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం అందనాలపాడు గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


డోర్నకల్‌, జూన్‌ 21 : అందనాలపాడు గ్రామంలో గ్రామస్థులందరూ కలిసి కొంతకాలంక్రిరతం ఆంభయాంజనేయస్వామి దేవాలయాన్ని ఊరి నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నారు. వేద మంత్రాలు, భక్తి పాటలు అందరికీ వినిపించేలా ఆలయంపైన ఒక మైకును ఏర్పాటు చేశారు. అయితే ఆ మైకు కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులు దుంపల సుబ్బారావు (55), మిరియాల మస్తాన్‌రావు(51), గొర్రె వెంకయ్య (50)లు కలిసి ఆలయంపై ఇనుప పైపునకు అమర్చి ఉన్న మైకుకు మరమ్మతులు చేసేందుకు పూనుకున్నారు. మధ్నాహ్నం 12.40గంటలకు మైకును సరిచేసిన తర్వాత గ్రామంలో అందరికీ పాటలు బాగా వినిపించాలనే తలంపుతో మైకును ఇంకా ఎత్తులో ఏర్పాటు చేయబోయారు. ముగ్గురు కలిసి మైకు అమర్చి ఉన్న ఇనుప పైపును పైకి ఎత్తే క్రమంలో ఆలయం పైనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైరుకు ఇనుప పైపు చివర్లో అమర్చి వున్న అల్యూమినియం మైకుబుంగ తగలింది. దీంతో ఇనుప పైపునకు  విద్యుత్‌ సరఫరా జరిగి ముగ్గురూ విద్యుదాఘాతానికి లోనయ్యారు. 


అక్కడికక్కడే మృతి

కరెంటు షాక్‌తో దుంపల సుబ్బారావుకు కుడి కాలు నుంచి భుజం వరకు శరీరం కాలిపోయింది. మిరియాల మస్తాన్‌రావుకు ఎడమ కాలు మోకాలి నుంచి నుంచి శరీర భాగం వరకు, గొర్రె వెంకయ్యకు కుడి కాలు తొడ నుంచి భుజం వరకు పూర్తిగా కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పరుగులు పెట్టి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అప్పటికే ముగ్గురు మృతి చెంది విగతజీవులుగా పడి ఉన్నారు. 


ముగ్గురి మృతివార్త తెలుసుకున్న డోర్నకల్‌ మండల తహసీల్దార్‌ వివేక్‌, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై భద్రునాయక్‌, ఎంపీడీవో అపర్ణ, విద్యుత్‌శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విద్యుదాఘాతానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌ వివేక్‌ సమక్షంలో మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులందరూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వారేకాకుండా వారి మధ్య బంధుత్వం ఉంది. దుంపల సుబ్బారావుకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉండగా, మిరియాల మస్తాన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గొర్రె వెంకయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటన  విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న తమ వారిని చూసి బోరున విలపించారు. మృతి చెందిన వారు ముగ్గురు రైతులే కావడంతో సమీప గ్రామాలు మన్నెగూడెం, రావిగూడెం, ముల్కలపల్లి, సీరోలు నుంచి ప్రజలు,  రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. రైతుల మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు.  


పెద్ద దిక్కును కోల్పోయారు..

విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన వారు ముగ్గురు కూడా సన్నకారు రైతులే.. వీరిలో మిరియాల మస్తాన్‌రావుకు నాలుగు ఎకరాల భూమి ఉండగా, అందులో మూడెకరాలు సీతారామ ప్రాజెక్టు భూసేకరణలో పోయింది. మిగిలిన ఎకరంలో పత్తి సాగుకు సిద్ధమయ్యాడు. మరో రైతు దుంపల సుబ్బారావుకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఇందులో వరి, పత్తి సాగు చేసేందుకు దుక్కులు దున్ని సన్నద్ధమైనట్లు బంధువులు తెలిపారు. పంట దిగుబడి ద్వారా వచ్చే ఆదాయమే అతడి కుటుంబానికి జీవనాధారం. గొర్రె వెంకయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో పత్తి, మిర్చి వేయడానికి దుక్కిని సిద్ధం చేసినట్లు కుటుంబసభ్యులు రోదిస్తూ తెలిపారు.  పెద్దదిక్కును కోల్పోవడంతో తామెలా బతికేదంటూ ఆయా మృతుల కుటుంబాల సభ్యులు రోదించారు.


మంత్రులు, ప్రజాప్రతినిధుల సంతాపం

ముగ్గురు రైతులు విద్యుదాఘతంతో మృతి చెందడంపై  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు. ఘటన జరిగిన తీరుపై జిల్లా కలెక్టర్‌ శశాంకను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు తెలిపారు. 


డోర్నకల్‌ శాసనసభ్యుడు డీఎస్‌ రెడ్యానాయక్‌ ఫోన్‌ చేసి మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడి  భరోసా కల్పించారు. అలాగే సర్పంచ్‌ ఆంగోతు మోహన్‌, ఎంపీటీసీ ఆంగోతు నీలా, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పులుగు అప్పారావు, కనిశెట్టి మోహన్‌రావు, మన్నెగూడెం ఎంపీటీసీ కొండపల్లి విజయపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కొండపల్లి రఘురాంరెడ్డి, డీఎ్‌స.జగదీ్‌షలు అందనాలపాడులో ఘటనా స్థలానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


నేడు అంత్యక్రియలు

డోర్నకల్‌ మండలం అందనాలపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను తహసీల్దార్‌ వివేక్‌ సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్ప త్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆపై కుటుంబసభ్యులు మృతదేహాలను అందనాలపాడుకు తరలించారు. వారి అంత్యక్రియలను బుధవారం ఉదయం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, పోస్టుమార్టం కోసం తీసుకువచ్చిన మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలో మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, నాయకులు డాక్టర్‌ మురళీనాయక్‌, బండి శ్రీనివా్‌సలు సందర్శించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. 

Updated Date - 2022-06-22T05:12:36+05:30 IST