ఆపత్కాలంలో అండగా..

Sep 19 2021 @ 02:19AM

కొవిడ్‌-19 ప్రజల్లో అద్భుతమైన మార్పు తెచ్చింది. ఎలాం టి అస్థిర పరిస్థితులు ఏర్పడినా కుటుంబాన్ని కాపాడగల మంచి ఆర్థిక ప్రణాళిక కోసం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనల్లో ముందు వరుసలో నిలుస్తున్నది టర్మ్‌ ఇన్సూరెన్స్‌. బీమా కంపెనీల వద్ద ఇటీవల కాలంలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల గురించిన వాకబులు పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం.


ఏదైనా విపత్తు ఏర్పడి కుటుంబంలో సంపాదనాపరుడైన వ్యక్తి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించిన దుస్థితిలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచంగా నిలుస్తుంది. కుటుంబానికి ఆలంబనగా నిలిచే వ్యక్తి లేకపోయినా ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా జీవన ప్రమాణాలు కొనసాగించేందుకు టర్మ్‌ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. టర్మ్‌ ప్లాన్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. కరోనా వంటి కష్టకాలంలో ప్రజలందరికీ ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో బీమా కంపెనీలన్నీ సరళ్‌ జీవన్‌ బీమా పాలసీలు తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఐఆర్‌డీఏఐ నిర్దేశించింది.


ఏమిటీ సరళ్‌ జీవన్‌ బీమా ?

ఇది తేలికపాటి ఫీచర్లతో అందరికీ అర్ధం అయ్యే తేలికపాటి పదజాలంతో అందుబాటులో ఉండే పాలసీ. పూర్తి అవగాహనతోనే సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది సహాయపడుతుంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి సరళ్‌ జీవన్‌ బీమా పాలసీ ఏక మొత్తంలో సొమ్ము అందిస్తుంది. 


ఇది పూర్తిగా రిస్క్‌ను మాత్రమే కవర్‌ చేసే (నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ. బీమా కంపెనీలన్నీ ఈ పాలసీకి ఒకే ధర నిర్ణయించి ఒకే రకమైన కవరేజీ కల్పించాల్సి ఉంటుంది. పాలసీదారులు క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ రేటు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. లింగభేదం, నివాసం, ప్రయాణం, వృత్తి, విద్యార్హతలతో సంబంధం లేకుం డా ఏ ఒక్కరైనా వ్యక్తిగతంగా ఈ పాలసీ తీసుకోవచ్చు.


18-65 సంవత్సరాల మధ్య వయస్కులందరూ ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులే. మెచ్యూరిటీకి గరిష్ఠ వయోపరిమితి 70 సంవత్సరాలు. పాలసీ కాలపరిమితి 5 నుంచి 40 సంవత్సరాలు. క్రమం తప్పకుండా ప్రీమియంల చెల్లింపు లేదా పరిమిత కాల ప్రీమియం చెల్లింపు (5-10 సంవత్సరాలు) లేదా ఏకకాల ప్రీమియం చెల్లింపు ఏదైనా ఎంచుకోవచ్చు.


45 రోజుల వెయిటింగ్‌ కాలపరిమితి ఉంటుంది. ఈ సమయంలో ప్రమాద మరణానికి మాత్రమే ఈ పాలసీ కవరేజీ ఇస్తుంది.


ప్రమాద, అంగవైకల్య రైడర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాలసీదారుడు జీవించి ఉన్న కాలం అంతా ప్రీమియం ఒకే మొత్తంలో స్థిరంగా ఉంటుంది. మార్కెట్లోని ఇతర టర్మ్‌ ప్లాన్లతో పోల్చితే ప్రామాణిక టర్మ్‌ ప్లాన్‌ కోసం చూసే వారికి ఇది అనుకూలం.


చట్టబద్ధంగా అందించాల్సిన రూ.25 లక్షల పరిమితికి మించి కవరేజీ ఇవ్వవచ్చా లేదా అనే నిర్ణయం బీమా కంపెనీకే ఉంటుంది. మెచ్యూరిటీ బోనస్‌, ప్రీమియం వాపసు వంటి ప్రయోజనాలేవీ అందుబాటులో ఉండవు.

- వరుణ్‌ గుప్తా, చీఫ్‌ యాక్చువరీ, భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.