Andamanకు నైరుతి రుతుపవనాలు ఆగమనం

ABN , First Publish Date - 2022-05-17T01:58:26+05:30 IST

హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి బలమైన నైరుతిగాలులు వీస్తుండడం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో

Andamanకు నైరుతి రుతుపవనాలు ఆగమనం

విశాఖపట్నం: హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి బలమైన నైరుతిగాలులు వీస్తుండడం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండంతో రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం అండమాన్‌ నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో అనేక ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రం పరిసరాలకు గత ఏడాది మే 21న వచ్చాయి.


కాగా వచ్చే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది. ఇదిలావుండగా ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఒకటి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో సోమవారం రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల పిడుగులు, బలమైన గాలులతో వర్షాలు కురిశాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణులు, అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావంతో ఈనెల 20వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Updated Date - 2022-05-17T01:58:26+05:30 IST