అందని పాడి ప్రోత్సాహకం

ABN , First Publish Date - 2022-06-25T05:52:45+05:30 IST

తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను మరింత ప్రోత్సహిం

అందని పాడి ప్రోత్సాహకం

విజయ డెయిరీ రైతులకు రెండేళ్లుగా రూ.కోటికిపైగా బకాయి

ఖమ్మంటౌన, జూన 24: తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటరుకు రూ.4 వంతున ప్రోత్సాహకంగా ఇచ్చింది. అయితే రెండేళ్లుగా ప్రోత్సాహక సొమ్ములు రాకపోవటంతో విజయ డెయిరీకి పాలుపోసే రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రైతులకు రావలసిన ప్రోత్సాహక బకాయిలు రూ.కోటికి పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందో అని పాడి రైతులు ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 5240 మంది పాడిరైతులు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 5,240 మంది పాడిరైతులు విజయ డెయిరీకి పాలు పోస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏడు కేంద్రాల ద్వారా, కొత్తగూడెం జిల్లాలో రెండు కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నారు. ప్రైవేట్‌ డెయిరీల పోటీని తట్టుకొని పాలసేకరణను పెంచేందుకు విజయ డెయిరీ అధికారులు కృషి చేస్తున్నా, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందకపోవటంతో పాడి రైతులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.

అరకొరగానే పాలసేకరణ

అధికారులు ఎంత కృషి చేస్తున్నా, విజయ డెయిరీకే పాలు పోయాలని అవగాహన కల్పిస్తున్నా, పాల సేకరణ అరకొరగానే సాగుతోంది. ఖమ్మం డెయిరీ ద్వారా రోజుకు కేవలం 2,600 లీటర్ల పాలను మాత్రమే సేకరించగలుగుతున్నారు. కామేపల్లిలో రోజుకు 350 లీటర్లు, కల్లూరులో 1,100 లీటర్లు, ముదిగొండలో 600 లీటర్లు, సత్తుపల్లిలో 350 లీటర్లు, మధిరలో 70 లీటర్లు, ఎర్రుపాలెంలో రోజుకు 1,000 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. మొత్తంగా ఖమ్మం జిల్లాలో రోజుకు కేవలం 6వేల లీటర్ల పాలను మాత్రమే సేకరించగలుగుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో రోజుకు 800 నుంచి 1000, ఇల్లెందులో 400 నుండి 500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. అంటే విజయ డెయిరీ అనుబంధ యూనిట్ల ద్వారా రోజుకు కేవలం 1500 లీటర్ల వరకు మాత్రమే పాలను సేకరించగలుగుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు రాకపోవటంతో పాల సేకరణ మరింత పడిపోయే అవకాశం ఉంది.

ప్రోత్సాహకాల కోసం లేఖ రాశాం 

డాక్టర్‌ సత్యనారాయణ, విజయ డెయిరీ డీడీ 

విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ఇచ్చే ప్రోత్సాహకాలు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహక నిఽధులు ఆగిపోయాయి. త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేయగానే నేరుగా పాడిరైతుల ఖాతాలో జమవుతాయి. ప్రభుత్వం ఎన్నో సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో రైతులు విజయ డెయిరీకే పాలు పోయాలి.

Updated Date - 2022-06-25T05:52:45+05:30 IST