మరింత కుంగిన అందవెల్లి పెద్దవాగు వంతెన

ABN , First Publish Date - 2022-08-15T03:53:58+05:30 IST

మండలంలోని అందవెల్లివద్ద ఉన్న పెద్దవాగు వంతెన ఆదివారం మరింత కుంగింది. భారీ వర్షాలతో వంతెన ఒక పిల్లర్‌ ప్రమాదకరంగా వంగిపోయింది.

మరింత కుంగిన అందవెల్లి పెద్దవాగు వంతెన
కుంగి పోయిన అందవెల్లి బ్రిడ్జి పిల్లర్‌

-బ్రిడ్జిపై గోడ కట్టిన అధికారులు

-ఉప్పొంగిన వాగులు, వంకలు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 14: మండలంలోని అందవెల్లివద్ద ఉన్న పెద్దవాగు వంతెన ఆదివారం మరింత కుంగింది. భారీ వర్షాలతో వంతెన ఒక పిల్లర్‌ ప్రమాదకరంగా వంగిపోయింది. ఉదయం వంతెన కుంగిపోవటం గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు సంఘటన స్థలానికి చేరు కుని రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జిపై పిట్టగోడ కట్టారు. దహెగాం, బీబ్రా, భీమిని గ్రామస్థులకు రాకపోకలు నిలిచి పోయాయి. కాగజ్‌నగర్‌కు వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారంతా బెల్లంపల్లి మీదుగా వస్తున్నారు. వంతెన మొదటిసారి కుంగినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ స్థితి వచ్చేది కాదని ఈ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌అండ్‌బీ అధికారుల సర్వే

కాగజ్‌నగర్‌ అందవెల్లి బ్రిడ్జి కుంగిపోవడంతో ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రాజేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో డీఈఈ లక్ష్మి నారాయణ సర్వే చేపట్టారు. పిల్లర్‌ కుంగిన స్థలాన్ని పరిశీ లించారు. వంగిన పిల్లర్‌స్థానంలో కొత్తది నిర్మించాల్సి ఉంటుందని అంచనావేశారు. ఇందుకు రూ.2నుంచి రూ.3 కోట్ల మేర ఖర్చు అయ్యేఅవకాశాలు ఉంటాయని అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు.

ఉప్పొంగిన వాగులు..

బెజ్జూరు: బెజ్జూరు మండలంలో శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పోవడంతో సలుగు పల్లి, సులుగుపల్లి గ్రామాలమధ్య తీగల ఒర్రె, కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య లోలెవల్‌వంతెనపై వరదనీరు పారి రాకపోక లకు ఇబ్బందికరంగా మారింది. పెంచికలపేట మీదుగా వచ్చే బస్సులు సాయంత్రం వరకు నిలిచిపోయాయి. ఆదివారం వార సంత కావడంతో పలు గ్రామాల నుంచి వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడ్డారు. 

చింతలమానేపల్లి: మండలంలో బాలాజీఅనుకోడ గ్రామం లో వర్షానికి ఆదివారం డోకె నానయ్య ఇల్లు నేలమట్టం కాగా బోర్కుట్‌ జగ్గయ్య ఇంటి గోడలు కూలి పోయాయి. దిందావాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2022-08-15T03:53:58+05:30 IST