Advertisement

అసలు ఉద్దేశ్యం అదే!

Oct 17 2020 @ 00:22AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై న్యాయరంగంలో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులు అనేకులు, జగన్‌ లేఖ వెనుక దురుద్దేశాలను, ఆ ధోరణిని అనుమతిస్తే కలిగే ప్రమాదకర పర్యవసానాలను పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖను కోర్టు ధిక్కారంగా పరిగణించి, జగన్మోహన్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరుసలో ద్వితీయ స్థానంలో ఉన్న వ్యక్తిపై, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు దురుద్దేశపూర్వకమని ఆ సంఘాలు విమర్శించాయి. 


న్యాయ, పరిపాలనా రంగాల మధ్య ఉద్రిక్తతలు గతంలో రాకపోలేదు. న్యాయమూర్తులపై ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టుకు లేదా కేంద్రానికి ఫిర్యాదులు చేయడం కూడా కొత్తదేమీ కాదు. పాలకులు ఆరోపణలు గుప్పించినంత మాత్రాన, న్యాయమూర్తుల ప్రతిష్ఠకేమీ కొదవ రాదు. కానీ, ఫిర్యాదు చేసే వారికి కూడా ఒక స్థాయి ఉండాలి. ముఖ్యమంత్రి పదవి అనే రాజ్యాంగబద్ధ స్థాయి సరే, దానితో పాటు విశ్వసనీయతను అందించే వ్యక్తిత్వ స్థాయి కూడా అవసరం. ఫిర్యాదులో ఏమున్నది అని మాత్రమే కాదు, ఫిర్యాదు వెనుక ఏమున్నది కూడా ముఖ్యం. లేకపోతే, వేరువేరు రాజ్యాంగబద్ధ వ్యవస్థల నడుమ అనవసరపు ఘర్షణ ఏర్పడుతుంది. ముఖ్యంగా, ప్రభుత్వాలు, అవి చేసే పాలన, నిర్ణయాలు, చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించవలసిన న్యాయవ్యవస్థ నైతికంగా బలహీనపడుతుంది. 


జగన్మోహన్‌రెడ్డిపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. సిబిఐ ద్వారా, ఆర్థిక దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిగిన కేసులవి. ఈ కేసుల త్వరిత విచారణ జరిగి, నేరనిర్ధారణ జరిగితే, జగన్‌ జైలుకు వెళ్లే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులపై ఉన్న నేరాల కేసులను త్వరితగతిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు సంకల్పించి, అందుకు తగిన ఆదేశాలను సూచనలను ఇస్తోంది. రాజకీయ నేతల కేసుల విషయంలో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం ఆధారంగా చొరవ తీసుకుని శీఘ్ర విచారణను ఆదేశించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ. ఈ రెండు అంశాలను కలిపి చూసినప్పుడు, రాజకీయ నేతల నేరాల విచారణను నిలువరించడానికి న్యాయమూర్తులపై ఆరోపణలు సంధించారేమోనని అనుకోవడానికి అన్ని ఆస్కారాలూ ఉన్నాయి. 


విశేషం ఏమిటంటే, జగన్మోహన్‌రెడ్డి రాసిన లేఖలో, తనపై విచారణ జరుగుతున్న కేసులను కానీ, రాజకీయ నేరాల విచారణను శీఘ్రతరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను కానీ పేర్కొనలేదు. అందుకే, లేఖలో ఏమున్నదో అనేదాని కంటె, లేఖలో ఏమి లేదో కూడా ఒక్కోసారి పరిశీలించవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలయిన అనేక వ్యాజ్యాలలో వ్యతిరేక తీర్పులు రావడానికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేయడం కారణం అట. అందుకు ఎటువంటి విశ్వసనీయ ఆధారాలూ ఆ లేఖలో పేర్కొనలేదు. ఇక చంద్రబాబు నాయుడికీ, వారికీ వీరికీ ముడిపెడుతూ అనేక ఆరోపణలు చేశారు కానీ, తన గురి ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఉండడానికి, తనపై ఉన్న కేసుల శీఘ్ర విచారణకి ఉన్న సంబంధం ఏమిటో మాత్రం సౌకర్యవంతంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దాటవేశారు.


సాధారణంగా, న్యాయమూర్తి తాను ఫలానా కేసులో నిష్పాక్షికంగా వ్యవహరించలేనని భావిస్తే, స్వచ్ఛందంగా దాని నుంచి తప్పుకుంటారు. అట్లాగే, ఒక ముద్దాయి నుంచి సహేతుకమైన కారణాలతో అభ్యంతరం వచ్చినా బెంచి మార్పు జరుగుతుంది. అంతే తప్ప, నేరవిచారణ నుంచి మినహాయింపు దొరకదు. న్యాయవ్యవస్థతో తనకేదో వైరం ఉన్నదని, అందువల్ల తనపై విచారణే జరగరాదని ప్రజలను నమ్మించడం కోసం, ఒక ఘర్షణ స్థితిని కృత్రిమంగా కల్పించాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది అపచారమే. తన మీద కేసుల విచారణనే ప్రశ్నించడానికి, లేదా ఫలానా న్యాయమూర్తి చొరవను ప్రశ్నించడానికి ముఖం చెల్లక, ఏవో ఆరోపణలు గుప్పించడం తీవ్రమైన తప్పిదం. దేశంలో ఇప్పుడు కేసులున్న రాజకీయనాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు కొదవలేదు. వారందరూ ఇదే మార్గం అనుసరిస్తే, న్యాయవ్యవస్థను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తే? ఇక చట్టసభలలో మెజారిటీని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఖాతరు చేయని నేతలకు పగ్గం వేయగలిగేదెవరు? నియంతృత్వాలను అడ్డుకోగలిగేది ఎవరు? ఈ ధోరణి ఒక ఆనవాయితీ కాకుండా నిరోధించకపోతే, న్యాయరంగానికి, చట్టబద్ధ పాలనకి చేటు జరుగుతుంది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నియమాలను, సంప్రదాయాలను ఖాతరు చేయకుండా నిర్ణయాలు తీసుకుని కోర్టులో భంగపడడం ఒక అలవాటుగా మారింది. తిరిగి కొత్త ఉల్లంఘనకు పాల్పడడానికి ఎటువంటి సంకోచాలూ ఉండవు. సాంఘిక దౌర్జన్యాలైనా, పోలీసు దౌర్జన్యాలైనా అంతా బాహాటమే. ఎవరైనా అనుకుంటారన్న చింత అసలు లేదు. అట్లాగే, సుప్రీంకోర్టుకు రాసిన లేఖను కూడా బహిరంగ పరచడమే తమ స్థాయికి తగిన ప్రవర్తన అని ప్రభుత్వం భావించింది. అందుకే, దేశంలోని న్యాయనిపుణులు అనేకులు, లేఖ రాయడాన్నీ, బహిరంగ పరచడాన్నీ రెంటినీ కోర్టు ధిక్కారంగా పరిగణించాలని కోరుతున్నారు. రెండు రాజ్యాంగ స్థానాల మధ్య జరిగే కలహాన్ని బహిరంగపరచడం, మొత్తంగా వ్యవస్థ మీదనే అవిశ్వాసం పెంచుతుందని వారు గుర్తుచేస్తున్నారు. అంతటి బాధ్యతాయుత ప్రవర్తనను ఆశించగలమా, ఈ నేతల నుంచి!

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.