ఈ గొప్పల బడ్జెట్టుకు అప్పులే దిక్కు!

Published: Tue, 15 Mar 2022 03:59:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ గొప్పల బడ్జెట్టుకు అప్పులే దిక్కు!

బడ్జెట్ రూపకల్పనలో ఆదాయంతో సంబంధం లేకుండా నేల విడిచి సాము చేశారు ఆర్థికమంత్రి బుగ్గన. వాస్తవ వ్యయాలకు, బడ్జెట్ అంచనాలకు ఏ మాత్రం పొంతన లేదు. వారం వారం హస్తిన చుట్టూ, ఆర్థిక సంస్థల చుట్టూ తిరిగి చెయ్యి చాపే ఆర్థిక మంత్రి ఇంత భారీ బడ్జెట్టు ప్రవేశపెట్టడం ఎవర్ని మోసం చెయ్యడానికి? ఆయన బడ్జెట్టులో చూపినంత ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? ప్రభుత్వం ఏమన్నా డబ్బులు కాచే తోటలు పెంచుతున్నదా?


వంచనతో రాజ్యమేలుతున్నారు ప్రస్తుత పాలకులు. అబద్ధాలతో అధికారానికి బాటలు వేసుకుని, ఇప్పుడు అబద్ధాలతోనే పరిపాలిస్తున్నారు. 2022–23 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్టును ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను  రూ.2,56,256కోట్ల రెవెన్యూ వస్తుందని, వ్యయం రూ.2,08,261 కోట్లు ఉంటుందని, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724కోట్లు ఉంటుందని చెప్పారు. మూలధన వ్యయం రూ.47,996కోట్లు ఉంటుందని వివరించారు.


కానీ ఆర్థిక మంత్రి ప్రసంగం ఆసాంతం అసత్యమేవ జయతే అన్న రీతిగా సాగింది. అవాస్తవాలు, స్వోత్కర్షలతో జనాన్ని బుగ్గన బురిడీ కొట్టించారు. బడ్జెట్ రూపకల్పనలో ఆదాయంతో సంబంధం లేకుండా నేల విడిచి సాము చేశారు. వాస్తవ వ్యయాలకు, బడ్జెట్ అంచనాలకు ఏ మాత్రం పొంతన లేదు. వారం వారం హస్తిన చుట్టూ, ఆర్థిక సంస్థల చుట్టూ తిరిగి చెయ్యి చాపే ఆర్థిక మంత్రి ఇంత భారీ బడ్జెట్టు ప్రవేశపెట్టడం ఎవర్ని మోసం చెయ్యడానికి? ఆయన బడ్జెట్టులో చూపినంత ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది? ప్రభుత్వం ఏమన్నా డబ్బులు కాచే తోటలు పెంచుతుందా? గాలి బుడగ లాంటి బడ్జెట్టుతో ప్రజలను మోసం చేస్తారా?


అంచనాలు గొప్పగా చూపించి ఖర్చు చేసే సమమయానికి చిప్ప చూపడం మూడేళ్లుగా జరుగుతున్నదే. 2019–20లో రూ.2,27,974 కోట్లు బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం ఆ ఏడాది రూ.1,73,700కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. 2020–21 రూ.2,24,789 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.1,87,000 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. 2020–21లో రెవెన్యూ ఆదాయం రూ.1,61.958కోట్లు వస్తుందనుకొంటే రూ.1,17.136కోట్లు మాత్రమే వచ్చింది. 2021–22లో రూ.1,77.096 కోట్లు వస్తుందనుకొంటే జనవరి నాటికి వచ్చింది రూ.1,11,000 కోట్లు మాత్రమే. అయినా ఆదాయంతో సంబంధం లేకుండా, 2022–23 ఆర్థిక సంవత్సరానికి కనీవినీ ఎరుగని స్థాయిలో రూ.2,56,256.56 కోట్లతో బడాయి బడ్జెట్టును రూపొందించారు ఆర్థికమంత్రి. 2021–22 ప్రతిపాదనలతో పోల్చితే ఇది దాదాపు రూ.27వేల కోట్లు అధికం.


ఇంత భారీ బడ్జెట్టు నష్టాన్ని పూడ్చాలి అంటే మళ్ళీ గ్రాంట్లు, బాండ్ల అమ్మకం, పన్నులు పెంపు, అప్పులే దిక్కు. అంతేతప్ప ఆదాయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలేమీ లేవు. సవరించిన అంచనాల్లో 2021–22 బడ్జెట్టు 2.08 లక్షల కోట్లకు పడిపోయింది. అయినా సరే గొప్పల కోసం 2022–23 బడ్జెట్టును రూ.2.56 లక్షల కోట్లకు పెట్టారు. 2021–22 బడ్జెట్టు అంచనాల్లో నగదు బదిలీ పథకాలకు రూ.48,083కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం రూ.39,615.98 కోట్లుగా చూపించారు. దాదాపు రూ.8,217 కోట్లకు కోత పెట్టారు. 


ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.90 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించింది. బడ్జెట్ కేటాయింపులు చూపి కూడా ఖర్చు చెయ్యని మొత్తం రూ.30 వేల కోట్లు దాటాయని కాగ్ తెలిపింది. మోసం వైసీపీ నైజం. వాస్తవంగా వచ్చే ఆదాయాన్ని అంచనాల్లో చూపకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులను, ఇతరత్రా నిధులను, అప్పులను చూపెట్టి, భారీగా అంచనా వేసి ఇదంతా మన కోసమేగా అని ప్రజలు లొట్టలేసుకునేట్టు భారీ బడ్జెట్టును ఆవిష్కరించారు. జగనన్న పథకాలు తప్ప అన్ని ప్రధాన రంగాలను గాలికి వదిలేశారు. పథకాల కోసం ఖర్చు చెయ్యాల్సిన నిధులను ఎక్కడ నుంచి తెస్తారో చెప్పలేదు. ప్రధాన రంగాలు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ది, పట్టణాభివృద్ధి, రోడ్ల అభివృద్ధికి  అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అమరావతి నిర్మాణాన్ని బడ్జెట్టులో పట్టించుకోలేదు.


వ్యవసాయానికి రూ.43వేల కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పలు చెప్పారు. ఇక్కడే మాయ ఉంది. ఉపాధి హామీ అనుసంధానికి కేటాయించిన రూ.8,329కోట్లు, వైస్సార్ రైతు భరోసా, పియమ్ కిసాన్ పథకానికి కేటాయించిన రూ.7,020 కోట్లు, ఫసల్ బీమా యోజన, విద్యుత్ సబ్సిడీ వంటి వాటికి కేటాయించిన నిధులను వ్యవసాయ బడ్జెట్టులో చూపించారు. ప్రతి రైతుకు కిసాన్ యోజన కింద కేంద్రం ఇస్తున్న రూ.13,500ను కలుపుకొని గొప్పలు చెప్పారు.


85 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా ఇవాల్సి ఉండగా 40లక్షల మందికే ఇస్తున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా మొండి చేయి చూపారు. రైతు భరోసా కింద గత మూడేళ్లలో రూ.20వేల కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పారు. కానీ వాస్తవంగా ఈ పథకానికి జగన్ ప్రభుత్వం మూడేళ్లలో ఖర్చు చేసింది 11వేల కోట్లు మాత్రమే. కేంద్రం వాటానూ తన ఖాతాలో వేసుకుని చెప్పుకొంటున్నారు. కొత్త బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.3900 మాత్రమే కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి ఈ బడ్జెట్టులో రూ.11,482 కోట్లు కేటాయించారు. ఇందులో జీతాలకు, రెవెన్యూ వ్యయాలకు, పాత బిల్లులు చెల్లింపులకే 90శాతం ఖర్చవుతుంది. ప్రాజెక్టుల అవసరాలతో పోలిస్తే ఈ నిధులు ఏ మూలకూ చాలవు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుల నిర్మాణం ప్రశ్నార్థకమే.


ఇప్పటికే దాదాపు ఆరు లక్షల కోట్ల అప్పులు రాష్ట్రం నెత్తిన ఉరుముతున్నాయి. అవి ప్రత్యక్షంగా కనిపించేవి. పరోక్ష అప్పులకు, గ్యారంటీలపై తీసుకొన్న అప్పులకు లెక్కలేదు. ఇప్పుడు 2022–23 బడ్జెట్టుకు కూడా అప్పులే ఆధారం. 2018–19 మే 30న చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు రూ.2.57లక్షల కోట్లు. దీన్ని బడ్జెట్‌ పుస్తకాల సాక్షిగా ఆర్థిక మంత్రి అంగీకరించారు. అలాంటిది మూడేళ్లలో ఈ మొత్తాన్ని రూ.4.39 లక్షల కోట్లకు పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. మూడేళ్లలో రూ.1.82 లక్షల కోట్ల అప్పులు చేసింది. తప్పుడు మార్గాల్లో చట్టసభలకు తెలియకుండా తెచ్చిన కార్పొరేషన్‌ అప్పులు దీనికి అదనం. ప్రభుత్వం చేస్తున్న అప్పులు బయట పడితే మరిన్ని అప్పులు పుట్టవని ఉద్దేశపూర్వంగానే వాటి వివరాలను దాస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులను బడ్జెట్టులో చూపలేదు.


అట్లాగే చిన్న కాంట్రాక్టర్ల నుంచి సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు పెద్ద కాంట్రాక్టర్ల వరకు గత మూడేళ్లుగా పెండింగు బిల్లుల విలువ రూ.లక్షకోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ బిల్లులు చెల్లించేందుకు బడ్జెట్టులో కేటాయింపులు లేవు. ‘మా బిల్లులు చెల్లించండి’ అంటూ కాంట్రాక్టర్లు హైకోర్టులో కేసులు వేస్తున్నారు. సీఎస్‌ సహా ఇతర కార్యదర్శులు కోర్టు బోనెక్కి సారీలు చెప్పాల్సిన దుస్థితి.  2022–23 బడ్జెట్లో పెండింగు బిల్లులకు పైసా కూడా కేటాయించలేదు. వీటిని ఎలా చెల్లిస్తారో చెప్పలేదు. మద్య నిషేధం హామీని తుంగలో తొక్కారు. ఈ బడ్జెట్టులో మద్యం ద్వారా రూ.16,500కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే మందు బాబుల నుంచి మరింత పిండుకొనేందుకు సిద్ధపడినట్లు చెప్పకనే చెప్పారు.


తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018–19లో మూలధన వ్యయం రూ.19,976 కోట్లు కాగా, వైసీపి హయాంలో 2019–20లో రూ.12,242కోట్లకు పడిపోయింది. కానీ 2020–21లో దాన్ని రూ.18,529 కోట్లుగా చూపించడం విడ్డూరం. కాగ్ లెక్కల్లో పది నెలల్లో మూల ధన వ్యయం రూ.11 వేలకోట్లే అని వెల్లడయింది. మరి మిగిలిన రెండు నెలల్లో రూ.7,529కోట్లు ఖర్చు చెయ్యడం ఎలా సాధ్యం. 2022–23లో ఏకంగా రూ.47,996 కోట్లు క్యాపిటల్ వ్యయానికి కేటాయించామని  చెప్పడం ఎంత మోసమో ప్రజలే అర్థం చేసుకోవాలి.


బడ్జెట్టులో బుగ్గన కులాల ముసుగులో చాలా మాయ చేశారు. కాపు, కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ ఇలా సకల కులాలవారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు భారీగా బడ్జెట్టులో కేటాయింపులు చూపించారు. ఆ నిధులు ప్రత్యేకంగా కేటాయించినవి కావు. కులాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరికీ వర్తించే పథకాలనే కులాలవారీగా విభజించి వారికి ప్రత్యేకంగా ఇచ్చినట్లుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇది జగన్ వచ్చాక మొదలుపెట్టిన సరికొత్త జిమ్మిక్కు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు చేసుకునేవారికి అండగా నిలిచేందుకు ఎంపిక చేసిన కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి అర్హులకు ఋణాలు ఇచ్చేవారు. ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్లకు కలిపి రూ.10వేల కోట్ల బడ్జెట్టు ఉండేది. ఇది అమలయ్యే పథకాల వల్ల జరిగే లబ్ధికి అదనం.


జగన్ వచ్చాక ఈ పదివేల కోట్ల బడ్జెట్టుకు మంగళం పాడారు. పథకాలను, చట్టాలను నిర్వీర్యం చేశారు. నవరత్నాలలోనే అన్ని పథకాలు అంటూ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన పథకాలకు పంగనామాలు పెడుతూ రాజ్యాంగం ఆయా వర్గాలకు కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. గత మూడేళ్లుగా బడ్జెట్టులో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లానుకు రూ.11వేల కోట్లు, 14వేల కోట్లు, 17వేల కోట్లు కేటాయించారు. కానీ జగన్ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు దారి మళ్లించారు. ఏది ఏమైనా బుగ్గన ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తం అతుకుల బొంతే అని చెప్పాలి. ఊక దంచితే నూకలు రాలునా? ఆచరణలేని సూక్తులతో ప్రజల కడుపు నిండునా? మీరే చెప్పాలి ఆర్థిక మంత్రిగారు!

తొండపు దశరధ జనార్దన్ 

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.