AP: ఎవరికి మూడుతుందో?!

ABN , First Publish Date - 2021-10-11T14:44:07+05:30 IST

రాష్ట్రంలో..

AP: ఎవరికి మూడుతుందో?!

ఇంజనీరింగ్‌ విభాగాల ఉద్యోగుల మెడపై కత్తి

రెవెన్యూ ఆప్టిమైజేషన్‌, అగుమెంటేషన్‌పై కసరత్తు 

జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకూ సమాచార సేకరణ

డేటా పంపాలంటూ వివిధ శాఖలకు ఆర్థికశాఖ లేఖ 

ఇప్పటికే ఉన్నతాధికారులతో  రెండుసార్లు సమావేశం 

త్వరలో కార్యదర్శుల స్థాయి భేటీలో స్పష్టత 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోన్న రాష్ట్ర ప్రభుత్వం... ఉద్యోగుల మెడపై కత్తి పెట్టేందుకు సిద్ధమైంది. పొదుపు చర్యల్లో భాగంగా ఇంజనీరింగ్‌ విభాగాల్లో అవసరం లేని పోస్టులను కత్తిరించేందుకు కసరత్తు చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా విభాగాలు, వాటి పరిధిలోని కార్పొరేషన్లలో ఎంతమంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు, వారికి ఉన్న పనేంటి? ఏయే కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు? అదనపు సిబ్బంది ఎక్కడ ఉన్నారు? తదితర వివరాలను సేకరిస్తోంది. దీనివెనుక భారీ వ్యూహమే ఉందని, ఏ క్షణంలో ఎవరికి మూడుతుందోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 


రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు ఉద్యోగుల జీతాల చెల్లింపులకు సైతం సర్కారు రుణాలపైనే ఆధారపడుతోంది. కొత్తగా అప్పులు పుడితే తప్ప ఉద్యోగులకు వేతనాలు చెల్లించనిలేని దుస్థితి నెలకొంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఫించన్లు కూడా బాగా ఆలస్యం కావడంపై ఇప్పటికే వారంతా నిరసన గళం విప్పుతున్నారు. మరోవైపు నిధుల కొరతతో కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదు. విదేశీ బ్యాంకుల రుణంతో చేపట్టే కొన్ని తప్ప అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇక దెబ్బతిన్న రోడ్లకు ఆర్‌అండ్‌బీ కనీసం మరమ్మతులు కూడా చేయించలేకపోతోంది. ఏడాదిగా ఇంజనీరింగ్‌ విభాగాలకూ పెద్దగా పని ఉండటం లేదు. ఇదిలా ఉండగానే తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అసలు ఏ శాఖలో ఎంతమేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో లెక్క తేల్చాలంటూ సర్కారు నివేదికలు కోరింది.


సరిగ్గా ఇదే సమయంలో ఇంజనీరింగ్‌ విభాగాలు, వాటి పరిధిలోని కార్పొరేషన్లలో ఆప్టిమైజేషన్‌, రెవెన్యూ అగుమెంటేషన్‌పై డేటా పంపాలంటూ ఆర్థికశాఖ బాంబు పేల్చింది. ఈ అంశంపై ఆర్థికశాఖ పరిధిలోని పీఎంయూ-ఆర్‌ఎఏ అండ్‌ ఈవో విభాగం సీరియ్‌సగా కరసత్తు చేస్తోంది. సరైన పద్ధతిలో, అవసరం ఉన్న మేరకే ఖర్చుపెట్టడం, అవసరం లేనివాటిని తొలగించి, మిగిలిన వాటని ఒకేవేదిక మీదకు చేర్చి ఉమ్మడిగా పనిచేయించడం... అనే కోణంలో జరుగుతోన్న ఈ అధ్యయనంలో ఏ విభాగం, ఏ కార్పొరేషన్‌ కాలగర్భంలో కలిసిపోతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి డేటా ఇవ్వాలో నిర్దేశిస్తూ రెండు ప్రొఫార్మాలు రూపొందించారు. వాటి ప్రకారం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమాచారం పంపించాలని ఆ విభాగం నుంచి ఇంజనీరింగ్‌ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటికే ఇంజనీరింగ్‌ విభాగాలు, వాటి పరిధిలోని కార్పొరేషన్ల ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. కొత్త ఉద్యోగ నియామకాలు అటుంచి, ఇప్పుడున్న వారిని కొనసాగిస్తారో, ఇంటికి పంపిస్తారోననే ఆదోళన వ్యక్తమవుతోంది. 


ఆ లేఖలో ఏముందంటే....

‘‘సరైన పద్ధతిలో, అవసరం ఉన్నచోటనే ఖర్చుపెట్టే విధానం(రెవెన్యూ ఆప్టిమైజేషన్‌)లో రెవెన్యూ అగుమెంటేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్‌ విభాగాలు, కార్పొరేషన్లపై అధ్యయనం చేయాలని ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. 


1. ఇంజనీరింగ్‌ విభాగం, కార్పొరేషన్‌లో ఉద్యోగుల మానవ వనరుల విధానం (హెచ్‌ఆర్‌ స్ట్రక్చర్‌). 


2. వివిధ పని విభాగాలు (ప్రాజెక్టులు, క్వాలిటీ కంట్రోల్‌, మెయింటెనెన్స్‌ తదితరాలు) ఎలా విస్తరించి ఉన్నాయి? వాటి యూనిట్‌ ఆఫీసులు (మండల, డివిజన్‌, జిల్లా స్థాయి హెడ్‌క్వార్టర్స్‌) ఎలా ఉన్నాయి? 


3. ఆయా విభాగాలకు మంజూరయున ప్రాజెక్టులు, వాటి తాజా పరిస్థితిపై జిల్లాస్థాయి సమాచారం. 


ఈ అంశాలపై అన్ని ఇంజనీరింగ్‌ విభాగాలు, కార్పొరేషన్లు నిర్దేశిత ప్రొఫార్మాల ప్రకారం సమాచారం అందించాలి. ఆ సమాచారం సాఫ్ట్‌కాపీ (డిజిటల్‌ ఫార్మాట్‌)ని ఆర్థికశాఖకు మెయిల్‌కు పంపించాలి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. పురపాలకశాఖ, గృహనిర్మాణం, అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్యూఎస్‌, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, జల వనరుల శాఖలతో పాటు వాటి పరిధిలోని ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ల నుంచి ఆయా అంశాలపై సమాచారం కోరారు. వీటితో పాటు గనులశాఖ పరిధిలోని ఏపీఎంఎ్‌సఐడీసీ, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, టూరిజం కార్పొరేషన్‌, ఏపీ హౌసింగ్‌ బోర్డు, టిడ్కో, విద్యాశాఖ పరిధిలోని ఇంజనీరింగ్‌ విభాగానికి కూడా ఈ ఆదేశాలు పంపారు. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సచివాలయంలో గతనెలలోనే ఒక సమావేశం జరగ్గా ఇటీవల ఆర్థికశాఖ నిర్వహించిన మరో సమావేశానికి ఆయా విభాగాల ఇంజనీరింగ్‌ చీఫ్‌లు, కార్పొరేషన్‌ ఎండీలు కూడా హాజరయ్యారు. 


ఆర్థికశాఖ కోరిన అంశాలు  

ఇంజనీరింగ్‌ విభాగాలకు ఉన్న పనిభారం, సిబ్బందిని అంచనా వేసేందుకు ఆర్థికశాఖ మూడు అంశాల్లో సమాచారం కోరింది. 


1. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టిన పనుల విలువ. 


2. ఎస్టాబ్లి్‌షమెంట్‌ (ఉద్యోగుల వేతనాలు, ఆఫీసు నిర్వహణ) ఖర్చు 


3. విభాగంలో ఉన్న కేడర్‌లు (ఈఎన్‌సీ, సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈఈ...), మంజూరయున పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఎందరు? ఇతర సిబ్బంది పోస్టులు ఎన్ని? ఎంతమంది పనిచేస్తున్నారు? కాగా, మరో ప్రొఫార్మాలో ఇంజనీరిం గ్‌ విభాగం పరిధిలోని కార్పొరేషన్ల డేటా కోరారు. 


మీ మనసులో ఏముంది? 

ఇటీవల ఆర్థికశాఖ నిర్వహించిన సమావేశంలో ఇదే అంశంపై కీలకమైన చర్చ జరిగినట్లు తెలిసింది. రేషనలైజేషన్‌ చేస్తారని, అవసరం లేని సిబ్బందిని ఇంటికి పంపిస్తారని, ఉపయోగం లేదనే పేరిట కొన్ని విభాగాలను మూసేస్తారనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. దీంతో ఆయా శాఖల అధికారులపైనా ఒత్తిడి పెరిగింది. అసలు విషయం చెప్పడం లేదని ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆగ్రహంగానే ఉన్నారు. ఇదే అంశంపై ఇటీవల సచివాలయంలో ఆర్థికశాఖ నిర్వహించిన సమావేశంలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గట్టిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. ‘‘ఇప్పుడున్న పరిస్థితి ఏమిటో మాకు తెలుసు. ఈ డేటాతో ఏం చేస్తారు? ప్రభుత్వం మీకు ఎలాంటి బాధ్యత అప్పగించింది? మీ మనసులోని మాట స్పష్టంగా చెబితే ఇంకా ఎలాంటి సమాచారం కావాలో అందిస్తాం. ఈ విషయంలో మరింత స్పష్టత ఇవ్వండి’’ అని ఆయన డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. త్వరలో ఈ అంశంపై మరో ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని, అప్పుడు కార్యదర్శుల స్థాయిలో స్పష్టత ఇస్తారని ఆర్థికశాఖ అధికారి చెప్పినట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన మరో భేటీకి ఇంజనీరింగ్‌ అధికారులను కూడా పిలిచారు. ఇందులో మరో అడుగు ముందుకేసి శాఖల వారీగా పోస్టుల వివరాలు కోరినట్లు తెలిసింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా అవసరం లేనివి, కాలం చెల్లిన పోస్టులు ఏమిటన్న సమాచారంతో పాటు కొత్తగా భర్తీ చేయాల్సిన పనిలేని పోస్టుల వివరాలు కూడా కోరినట్లు తెలిసింది. 


ఈ డేటాతో ఏం చేస్తారు? 

ఆర్థికశాఖ నిర్వహిస్తోన్న సమావేశాలతో ఉద్యోగులతో పాటు ఉన్నతస్థాయి అధికారుల్లోనూ అలజడి మొదలైంది. సమాచారం ఎందుకు తీసుకుంటున్నారో అంతుచిక్కడం లేదని, కానీ తీవ్రమైన అనుమానాలే ఉన్నాయని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్నవారితోనే పని చేయించుకుంటారా? అవసరం లేని విభాగాలు మూసివేసి స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట బలవంతంగా ఇంటికి పంపిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులు, పనులు, నిధులు లేవనే పేరిట ఇంజనీరింగ్‌ విభాగాలను విలీనం చేస్తారా? అవసరం లేని కార్పొరేషన్లు, అంతర్గత యూనిట్‌లను మూసివేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన డేటా ఆధారంగా కాస్ట్‌ కటింగ్‌ విధానం అమలు చేస్తారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఆంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. తమకు కూడా పూర్తి సమాచారం లేదన్నారు. 

Updated Date - 2021-10-11T14:44:07+05:30 IST