ఊహించని ధిక్కారాన్ని చూసి బిత్తరపోతున్న సీఎం జగన్

ABN , First Publish Date - 2022-04-11T18:02:43+05:30 IST

వైసీపీలో నిన్నటి వరకు అన్నీ జగనే.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అతనే నియంత..

ఊహించని ధిక్కారాన్ని చూసి బిత్తరపోతున్న సీఎం జగన్

అమరావతి: వైసీపీలో నిన్నటి వరకు అన్నీ జగనే.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అతనే నియంత.. తన మాటే వేదం.. తన పలుకే శాసనం.. అన్నట్టుగా ఇన్నాళ్లు ఆయన పాలన సాగింది. అడ్డూ అదుపూ లేని దూకుడుతో ఇన్నాళ్లూ చక్రం తిప్పిన జగన్ ఇప్పుడు పార్టీలో ఊహించని ధిక్కారాన్ని చూసి బిత్తరపోయే పరిస్థితి ఏర్పడింది. జగన్ కొత్త కేబినెట్ కూర్పు తుస్సు మనడంతో జగన్ జగమొండి అన్న పాట ఇక పాత మాటేనా? అనే కామెంట్లు వస్తున్నాయి.


పార్టీలో ఒకటి నుంచి వంద వరకు అన్ని స్థానాల్లోనూ తానే ఉండే జగన్.. ఇప్పుడు తన పార్టీలోనే చెలరేగిన అసంతృప్తి దుమారాన్ని చూసి కంగారు పడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలేలా  పార్టీ శ్రేణులు రాజీనామాలు చేస్తుండడం ప్రభువులకు మింగుడుపడడంలేదు. జగన్ మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయకూడదన్నట్లుగా మూడేళ్లు పాలన సాగింది.


కలలో కూడా జగన్ చెప్పిందే వేదం అన్నట్లుగా అన్నీ పాటించాల్సిన పరిస్థితులు.. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలవడంతో పార్టీలో ఎంతో సీనియర్లు అనుకున్నవారు కూడా జగన్ ఎదుట ధైర్యంగా నోరెత్తి అభిప్రాయం చెప్పే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు అదంతా గతం.. ఒక్క రోజులో అంతా తలకిందులైపోయింది. ‘నేను మోనార్కును’ అన్నట్లుగా సాగిన సీన్ కాస్త రివర్స్ అయింది. పార్టీలో అనూహ్యంగా అసంతృప్తి బుసలుకొడుతోంది. ఆశావహుల సంఖ్య పెరగడం, సమీకరణాలు సంక్లిష్టంగా మారడంతో మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ ఇప్పుడు మొత్తం పార్టీకే ఎసరుపెట్టేట్టు తయారైంది. ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు ఎదురవుతాయని జగన్ కూడా ఊహించి ఉండరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటే.. అసంతృప్తి ఏ లెవెల్లో పీక్స్‌కు చేరిందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2022-04-11T18:02:43+05:30 IST