నీ మొగుడు ఎట్లా ఏగుతున్నాడో!

ABN , First Publish Date - 2022-05-24T08:42:50+05:30 IST

‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను సమస్యలపై ప్రజలు నిలదీస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు.

నీ మొగుడు ఎట్లా ఏగుతున్నాడో!

సమస్యలు చెప్పిన మహిళపై  ఆదోని ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. 

గడపగడపకూ సమస్యలపై నిలదీత

సమస్యలు చెప్పకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు

ప్రశ్నిస్తే తరువాత మీ ఇష్టమని నేతల హెచ్చరికలు 

 కోడుమూరులో వలంటీరు చూపిన ఇంటికే ఎమ్మెల్యే.. అయినా తప్పని నిలదీతలు  


ఆదోని రూరల్‌, కోడుమూరు, మే 23: ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను సమస్యలపై ప్రజలు నిలదీస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. ఓ మహిళ సమస్యలను ఏకరవు పెట్టడంతో ‘నీ మొగుడు నీతో ఎట్లా ఏగుతున్నాడో ఏమో’ అని వ్యాఖ్యానించి అక్కడి నుంచి జారుకున్నారు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి. ఆదోని మండలం బైచిగేరిలో ఆయన సోమవారం ‘గడపగడపకూ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించగా, అడుగడుగునా మహిళలు అడ్డుకొని సమస్యలు ఏకరవుపెట్టారు. ‘రెడ్డీ.. ప్రభుత్వ కాలమే అయిపోతోంది. పట్టా మాత్రం ఇవ్వలేదు. చాట వెడల్పు కూడా లేని ఈ ఇంట్లో మూడు కుటుంబాలు ఎలా ఉంటాం. చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఇంటి పట్టాలిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పట్టాలు చెల్లవని చెప్పారు. కొత్త పట్టాలు ఇస్తామని చెప్పి మూడేళ్లవుతోంది. ఇంతవరకు ఇంటి పట్టా ఇవ్వలేదు’ అంటూ పద్మావతి అనే మహిళ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ‘అప్పుడే మా ప్రభుత్వం అయిపోయిందా..? ఇంటి పట్టాలకు ఇచ్చిన స్థలం కోర్టులో ఉంది మేమేం చేస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆ.. ఇంకేముంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలైపోయింది. ఏడాది ఉంటే అయిపాయే. అప్పుడు మళ్లీ ఎన్నికలొస్తాయి. మరీ మేము ఇంటి పట్టాలు ఎవరిని అడగాలి? మాకు అన్యాయం జరిగినట్టే కదా! చంద్రబాబు ఇచ్చిన పట్టాలకు స్థలం చూపించి ఉంటే అయిపోయేది కదా? ఇప్పుడు మాకిచ్చే స్థలం కోర్టులో ఉందంటే, ప్రభుత్వం మరో స్థలం కొని మా లాంటి నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి కదా!’ అని ఆ మహిళ రెట్టించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ‘ఊరంతా రోడ్లు వేశారు. మా ఇంటి వద్ద వేయలేదు. కరెంట్‌ స్తంభాలు లేవు. చీకట్లో ఉంటున్నాం’ అంటూ జయలక్ష్మి అనే మహిళ ఆవేశంగా ఎమ్మెల్యేను ప్రశ్నించగా, ‘నీ మొగుడు ఎట్లా ఏగుతున్నాడో ఏమో’ అని ఆమెను ఉద్దేశించి సాయిప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  తర్వాత మరో వీధికెళ్లిన ఎమ్మెల్యేను మహిళలు, స్థానికులు చుట్టుముట్టారు. బిందెడు నీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లాలని, నీరు, కరెంట్‌, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని నిలదీశారు. ‘మనషుల ముఖాలు చూసి ఇంటి పట్టాలిస్తారా? అది కూడా ఇల్లు ఉన్న వారికేనా? ఒక్కసారి మా ఇల్లును చూసి మీరే చెప్పండి. వైసీపీ నాయకు ల చుట్టూ కాళ్లకు బొబ్బలు వచ్చేలా తిరిగాను’ అంటూ బోయ హనుమంతమ్మ అనే మహిళ కన్నీటి పర్యంతమయ్యారు.

 

బడిలో చేర్చుకోలేదు.. పనికి పంపిస్తున్నాం.. 

‘బతుకుదెరువు కోసం ముంబయిలో ఉండేవాళ్లం. కరోనా కారణంగా 2019లో బైచిగేరి చేరుకున్నాం. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇక్కడ మా పిల్లలను బడిలో చేర్పించుకోమంటే ఏవో కారణాలు చెప్పి చేర్పించుకోలేదు. ఉన్న ఇంటికి కూడా పట్టా ఇవ్వలేదు. మేం పక్కా వైసీపీ వాళ్లం. 30 ఓట్లు ఉన్నాయి. కానీ, మాకే అన్యాయం జరుగుతోంది’ అని నరసింహులు, జ్యోతి దంపతులు నిలదీశారు. కాగా, స్థానికులను సమస్యలు చెప్పకుండా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బంధువు(వరుసకు అల్లుడై) కృష్ణారెడ్డి అడుగడుగునా అడ్డుపడ్డారు. గడపగడపకు నిలదీతలు ఎదురవుతుండటంతో ఎమ్మెల్యేను ఎదిరించినా, ప్రశ్నించినా తరువాత మీ ఇష్టం అంటూ స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు ముందస్తు కార్యక్రమంలో ప్రజలను హెచ్చరిస్తున్నారు. 

 

కొండపై ఇల్లు ఎలా కట్టుకోవాలి

ఇక కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ను ప్రజలు సమస్యలపై నిలదీయకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లుచేశారు. ఆ ప్రకారం వలంటీరు చూపిన ఇళ్ల వద్దకే ఎమ్మెల్యే వెళ్లారు. అయినా తాగునీరు. ఇంటి పట్టాలు, కాల్వలు, రోడ్లు, వీధిలైట్లు తదితర సమస్యలపై ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. కొండపై పట్టాలు ఇస్తే ఇళ్లు ఎలా కట్టుకోవాలని షేకున్‌బీ అనే మహిళ నిలదీయగా, ఎర్రకొండను చదును చేసి ఇళ్లు కట్టిస్తానని ఎమ్మెల్యే అనడంతో అధికారులు, ప్రజలు నవ్వుకున్నారు. కొళాయిల్లో నాలుగు రోజులకోసారి తాగునీరు వస్తోందని మహిళలు చెప్పగా, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైను కోసం ప్రభుత్వం రూ.12కోట్లు విడుదల చేసిందని ఎమెల్యే చెప్పడంతో, ప్రభుత్వం ఎప్పుడు నిధులు మంజూరు చేసిందని అధికారులే అవాక్కయ్యారు. వంటగ్యాస్‌ ధరలపై వృద్ధురాలు పార్వతమ్మ ప్రశ్నించగా, అది ప్రధాని మోదీ పెంచారని, జగనన్నకు సంబంధం లేదని ఎమ్మెల్యే సమాధానం చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.

Updated Date - 2022-05-24T08:42:50+05:30 IST