పీటీడీలో చిచ్చు రేపుతున్న.. పదోన్నతుల జాతర!

ABN , First Publish Date - 2021-10-11T14:24:27+05:30 IST

పీటీడీగా మారిన ఆర్టీసీలో పదోన్నతుల..

పీటీడీలో చిచ్చు రేపుతున్న.. పదోన్నతుల జాతర!

పీటీడీలో పదోన్నతుల చిచ్చు

900 మంది సిబ్బందికి నష్టం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): పీటీడీగా మారిన ఆర్టీసీలో పదోన్నతుల జాతర అంటూ చేసిన ప్రకటన చిచ్చు రేపుతోంది. ఏళ్లతరబడి పెండింగ్‌లో పడిన ప్రమోషన్‌ ఇప్పటికైనా వస్తుందన్న ఆశతో ఎదురు చూసిన వందలాది మంది సిబ్బంది నిరాశకు గురయ్యారు. పదోన్నతులకు వర్తింప చేసే నిబంధనల్లో అధికారులకు, తమకు మధ్య వివక్ష ఉండడాన్ని సిబ్బంది గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. చేరిన పోస్టులోనే రిటైర్‌ అవడమే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీఎ్‌సఆర్టీసీలో 51 వేల మంది పని చేస్తున్నారు. అందులో అధికారులు 400 మంది లోపు ఉండగా సిబ్బంది 50 వేలకు పైగా ఉన్నారు.


రాష్ట్ర విభజనకు ముందు నుంచీ పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను ఇవ్వాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఇటీవలే కసరత్తు మొదలు పెట్టారు. 2019 నిబంధనల ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన సిబ్బంది 2011 నాటి నిబంధనలనే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ మేరకు ఎండీ, మంత్రికి వినతులిచ్చాయి. అవేవీ పట్టించుకోకుండా యాజమాన్యం తమ నిర్ణయం మేరకే ప్రమోషన్లు ఇచ్చింది. మొత్తం 2,500 మంది సిబ్బందికి ప్రమోషన్లు రావాల్సి ఉండగా 1,600 మందికి మాత్రమే పదోన్నతులు ఇచ్చారు. అన్యాయానికి గురైన 900 మందిలో ఇది తీరని ఆగ్రహాన్ని, ఆవేదనని కలిగించింది. ఇప్పటికి ఏడేళ్లకు పైగా ఆలస్యం చేసిన యాజమాన్యం ఇప్పుడు ఏకంగా అన్యాయమే చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


అంతా పద్ధతి ప్రకారమే: సిబ్బందికి పదోన్నతులు కల్పనకు షెడ్యూల్స్‌(బస్సులు) ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఈడీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. ఒక డిపోలో ఉన్న బస్సులును లెక్కలోకి తీసుకొని వాటికికి ఎంత మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఉండాలనేదానిపై లెక్కించి నిర్ణయిస్తామన్నారు. 


రెగ్యులరైజేషన్‌లోనూ వివక్షే...

ఆర్టీసీలో పదోన్నతులు కల్పనలో డైరెక్ట్‌ రిక్రూటీ, ప్రమోటీ.. అనే రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. 2012 తర్వాత ఆర్టీసీలో ఎలాంటి నియామకాలు లేనందున యాజమాన్యం అవసరానికి అనుగుణంగా ‘30 నిబంధన’ కింద అప్పుడప్పుడు పదోన్నతులిచ్చింది. వన్‌ టైమ్‌ మేజర్‌ పేరుతో తీసుకున్న ఈ విధానంలో అర్హులైన క్లరికల్‌ సిబ్బంది, సూపర్‌ వైజర్లు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్లను క్రమబద్దీకరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు 600 మంది జాబితా కూడా ఉన్నతాధికారులకు అందజేశాయి. అయినా ఆరుగురికి కూడా అవకాశం లభించలేదు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఆగస్టు మూడో వారంలో పీటీడీ అసోసియేషన్లతో ఆర్టీసీ హౌస్‌లో సమావేశమై అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎండీ సమక్షంలో మాటిచ్చినా అమలు జరగలేదని వాపోతున్నారు.

Updated Date - 2021-10-11T14:24:27+05:30 IST