కొత్త ట్రిబ్యునల్‌కు సవాలక్ష సవాళ్లు

ABN , First Publish Date - 2021-10-07T23:38:48+05:30 IST

కొత్త ట్రిబ్యునల్‌కు సవాలక్ష సవాళ్లు

కొత్త ట్రిబ్యునల్‌కు సవాలక్ష సవాళ్లు

  • అంత సులువు కాదంటున్న కేంద్రం
  • కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌కు న్యాయశాఖ చెక్?
  • పెదవి విరుస్తున్న న్యాయ నిపుణులు
  • కృష్ణా ట్రిబ్యునల్‌కు మహారాష్ట్ర, కర్నాటక ససేమిరా, ఎగువ రాష్ట్రాలకు వంత పాడుతున్న ఏపీ
  • బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయడంపై కేంద్రం తర్జన, భర్జన


న్యూఢిల్లీ: కృష్ణా జలాల పున:పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్‌కు కేంద్ర న్యాయశాఖ చెక్ పెట్టింది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకతో పాటు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అంగీకరించకపోవడంతో కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును త్వరగా నోటిఫై చేయాలని ఎగువ రాష్ట్రాలు కేంద్రంపై వత్తిడి తీసుకొస్తున్నాయి. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టిఎంసీలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంటుందని, ఎగువ రాష్ట్రాలను ఇందులోకి లాగాల్సిన అవసరం లేదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులు తేల్చి చెప్పడంతో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం మళ్లగుళ్లాలు పడుతోంది.


సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను ఉప సంహరించుకున్న నేపధ్యంలో కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని మరో సారి కేంద్రానికి విజ్ణప్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. నీటి కేటాయింపుల్లో తమకు జరిగిన నష్టాన్ని సవరించేందుకు అంతర్రాష్ట జలవివాదాల చట్టం లోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ డిమాండ్. అయితే ఈ డిమాండ్ ను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలు వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి. 



తెలంగాణ వాదన ఇది..

కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ కు అనేక కారణాలున్నాయని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నది తెలంగాణ వాదన. అంతేకాకుండా కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35శాతం మేరకే ఉన్నాయని తెలంగాణ చెబుతోంది. ఏపీలో కృష్ణా పరీవాహక ప్రాంతం కేవలం 31.5శాతం మాత్రమే ఉన్నా మొత్తం జలాల్లో 62శాతం నీటి కేటాయింపులున్నాయి.  తెలంగాణలో ఉన్న ఆయకట్టు 62.5శాతం ఉన్నందున ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవని తెలంగాణ వాపోతున్నది. ఉమ్మడి ఏపీలో ట్రిబ్యునల్ కేటాయించిన 811 టిఎంసిలలో ఏపీకి 512.04 టిఎంసిలు, తెలంగాణకు 298.96 టిఎంసిల నీటిని మాత్రమే కేటాయించారు. పరివాహకం, ఆయకట్టును పరిగిణలోకి తీసుకొని రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలన్నది తెలంగాణ ప్రధానమైన డిమాండ్. 


ఆ రెండు సెక్షన్లే తెలంగాణ వాదనకు ఆధారం..

ఏపి విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3.... ఈ రెండు సెక్షన్లే ఇప్పడు తెలంగాణ వాదనలకు మూలాధారం. విభజన సమయంలో తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా  కృష్ణా జలాల పున: పంపిణీ అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిశీలిస్తుందని సెక్షన్ 89లో స్పష్టంగా పేర్కొంది. అందుకే ఈ సెక్షన్ ను అడ్డం పెట్టుకొని కృష్ణా జలాల పంపిణీ మళ్లీ నాలుగు రాష్ట్రాలకు జరపాలంటూ మొదట బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను తెలంగాణ ఆశ్రయించింది. అయితే విభజన చట్టం కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితమని, ఇందులో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకు సంబంధం లేదని ట్రిబ్యునల్ తెలంగాణ పిటీషన్ ను త్రోసి పుచ్చింది. అంతేకాకుండా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టును ప్రాదిపదికగా తీసుకొని నీటి కేటాయింపులు ఇప్పటికే జరిపినందున మళ్లీ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా సాధ్యమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.  దీంతో ఇదే అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ఎస్ ఎల్పీని దాఖలు చేసింది. అక్కడా తెలంగాణ కు చుక్కెదురైంది.


ట్రిబ్యునల్ వాదననే సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో తెలంగాణ అంతర్రాష్ట జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3ని తెరపైకి తీసుకొచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ సమయంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులపై కూడా సమీక్ష నిర్వహించి, మళ్లీ నాలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపి  తమ రాష్ట్రానికి న్యాయం జరిపేలా కేంద్రానికి ఆదేశాలను జారీచేయాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ రిట్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ రిట్ పిటీషన్ నే తెలంగాణ ఇప్పడు ఉపసంహరించుకొంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ హామీ ఇచ్చినందునే తాము ఈ రిట్ పిటీషన్ ను ఉప సంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు తెలంగాణ చెప్పింది. అయితే ఒకవేళ కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించేలా తమకు అవకాశం కల్పించాలన్న షరతును తెలంగాణ విధించింది. ఈ షరతును ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలు వ్యతిరేకించాయి. రిట్ పిటీషన్ ను షరతులతో ఉపసంహరించుకోవడానికి వీలు లేదని, ఈ షరతు న్యాయసూత్రాలకే విరుద్దమన్నది ఈ రాష్ట్రాల వాదన. అందుకే ఈ రాష్ట్రాల అభ్యంతరాలను దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. 


ఆంధ్రప్రదేశ్ వాదన ఇలా ఉంది..

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసిల నీటిలో 50శాతం నీటిని తమకు కేటాయించాలన్నది తెలంగాణ ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ను  ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నదీ పరీవాహక ప్రాంతం తమ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నందున తమకు నీటి వాటాలో సింహ భాగం దక్కాలన్న తెలంగాణా వాదనను ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించడం లేదు. నీటి కేటాయింపులకు నదీ పరీవాహక ప్రాంతం ప్రాధిపదిక కాదని అలా అయితే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్నాటకలలో ఎక్కువగా ఉందని, ఆ లెక్కన ఆ రెండు రాష్ట్రాలు తమకే అధికభాగం నీటి కేటాయింపులు జరపాలని పట్టుపడితే మొదటికే మోసం వస్తుందన్నది ఏపీ ప్రభుత్వ వాదన. బచావత్ ట్రిబ్యునల్ నాటికి ఆయా  రాష్ట్రాలు  అప్పటి వరకూ వినియోగించుకుంటున్న నీటి జోలికి పోకుండా మిగిలిన జలాలనే మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అప్పటికే  జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా అత్యధికంగా కృష్ణా జలాలను  వినియోగించుకోవడం వల్ల ఉమ్మడి ఏపీకి అత్యధికంగా లబ్ధి చేకూరిందని ఏపీ ప్రభుత్వం వాదిస్తొంది. 


అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్న మహారాష్ట్రకు సుమారు 500 టిఎంసిలు, కర్నాటకకు సుమారు 700 టిఎంసిలు మాత్రమే దక్కాయి. తెలంగాణ డిమాండ్ ను అంగీకరిస్తే మహారాష్ట్ర, కర్నాటకలు తమ రాష్ట్రాలలో పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్నందున తమకు ఇంకా అధికంగా నీటి కేటాయింపులు జరపాలని పట్టుపట్టే ప్రమాదం లేకపోలేదని ఏపీ చెబుతోంది. అంతేకాకుండా కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ లు మాత్రమే ఉన్నాయి. ఇందులో జూరాల ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో ఎలాంటి వివాదం లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లు ఇరు రాష్ట్రాలకు మధ్యలో ఉన్నందున ఇందులో నీటి కేటాయింపులు ఎలా చేస్తారని ఏపి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇది అసాధ్యమని తెలిసినా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే కేసి ఆర్ ప్రయత్నమన్నది ఏపి ప్రభుత్వం ఆరోపణ. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ సుప్రీంను ఆశ్రయించినప్పడు మొదట ఏపీ ప్రభుత్వం సమర్ధించింది. కారణం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్నాటకలో ఆల్మట్టి ఎత్తును పెంచుకోవడానికి అనుమతించడమే. ఇప్పడు తెలంగాణ వాదనను ఏపీ వ్యతిరేకించడానికి కారణం ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాల్లో 50శాతం కేటాయించాలని తెలంగాణ పట్టుపట్టడమే. 



మహారాష్ట్ర, కర్నాటల వాదన ఇలా ఉంది..

అయితే తెలంగాణ వాదనను ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలు వ్యతిరేకించడానికి పెద్దగా కారణలేమీ లేవు. అయితే తెలంగాణ వాదనను సమర్ధిస్తే నీటి కేటాయింపులు మరింత ఆలస్యం అవుతాయన్నదే ఈ రెండు రాష్ట్రాల ఆందోళన. అంతేకాకుండా ట్రిబ్యునల్ తెలంగాణ ఆయకట్టును పరిగణలోకి తీసుకుంటే తమ వాటా నీళ్లకు ఎక్కడ గండి పడుతోందన్న భయం కూడా ఆ రెండు రాష్ట్రాలకూ ఉంది.  2005లో ఏర్పడిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ సుదీర్ఘ విచారణ తరువాత 2011లో నీటి కేటాయింపులు చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చి పదేళ్లు కావస్తున్నా కేంద్రం ఇంకా  నోటిఫై చేయలేదు. నోటిఫై చేయకపోతే ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాదు. అంతవరకూ కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి వీలు లేదు. ఇన్ని సమస్యల మధ్య మళ్లీ మొదటి నుంచి నాలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరపడం అనవసమన్నదే ఎగువ రాష్ట్రాల వాదన.


ఎటూ తేల్చని కేంద్రం

గత సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. తెలంగాణ రిట్ పిటీషన్ ను ఉపసంహరించుకుంటే న్యాయసలహా తీసుకొని కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. షెకావత్ హామీ మేరకే తెలంగాణ తన రిట్ పిటీషన్ ను ఉపసంహరించుకుంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. షెకావత్ హామీ ఇచ్చినట్లుగా న్యాయశాఖ సలహా కోరారు. అయితే ఎగువ రాష్ట్రాల సమ్మతి లేకుండా కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయడం కష్టమని న్యాయశాఖ తేల్చిచెప్పినట్లు సమాచారం. 


పైగా ఇప్పటికే ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులు కూడా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పున: పంపిణీ కుదరదని తేల్చి చెప్పిన విషయాన్నీ జలశక్తి శాఖకు చెప్పింది. తెలంగాణ మరింత పట్టుపడితే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఏపీ, తెలంగాణల కు మాత్రమే కృష్ణా జలాల పున: పంపిణీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఆదేశించవచ్చని కూడా  న్యాయశాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కర్నాటకలో బిజెపి అధికారంలో ఉన్నందున ఆ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం నడుచుకోకపోవచ్చు. మహారాష్ట్రలోనూ బిజెపి ప్రధాన ప్రతిపక్షం. మహారాష్ట్ర బిజెపి కూడా కృష్ణా జలాల పున:పంపిణీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 


- ఎం.కృష్ణ, న్యూఢిల్లీ

Updated Date - 2021-10-07T23:38:48+05:30 IST