చరిత్రకు డిజిటలైజేషన్‌

ABN , First Publish Date - 2022-05-20T07:12:51+05:30 IST

అదొక అరుదైన చారిత్రక సంపద.. 400 ఏళ్లనాటి తాళపత్ర గ్రంథాల సమాహారం.. 100ఏళ్ల క్రితం తెలుగు భాషాభిమానులు మద్రాసులో తెలుగు గ్రంథాలు, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు ఆంధ్ర సాహిత్య పరిషత్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లకు అక్కడి సాహిత్య సంపదనంతా కాకినాడకు తరలించారు. కొన్నేళ్ల తర్వాత ఇది పురావస్తుశాఖ చేతిలోకి చేరి మ్యూజియంగా మారిపోయి అరుదైన చారిత్రక సంపదకు నిలయంగా మారింది. ఇప్పుడు ఈ పురాతన తాళపత్ర గ్రంథాలను భద్రపరిచి భావితరాలకు అందించాలనే సంకల్పంతో వాటిని డిజిటలైజేషన్‌ చేయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది.

చరిత్రకు డిజిటలైజేషన్‌

  • కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్‌లో భద్రంగా తాళపత్ర గ్రంథాలు
  • 400ఏళ్లనాటి రామాయణ, మహాభారత, పురాణ, ఇతిహాసాలు నిక్షిప్తం
  • డిజిటలైజేషన్‌కు ముందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం
  • తిరుపతిలోని వేదిక యూనివర్సిటీకి పూర్తయిన తరలింపు ప్రక్రియ

అదొక అరుదైన చారిత్రక సంపద.. 400 ఏళ్లనాటి తాళపత్ర గ్రంథాల సమాహారం.. 100ఏళ్ల క్రితం తెలుగు భాషాభిమానులు మద్రాసులో తెలుగు గ్రంథాలు, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు ఆంధ్ర సాహిత్య పరిషత్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లకు అక్కడి సాహిత్య సంపదనంతా కాకినాడకు తరలించారు. కొన్నేళ్ల తర్వాత ఇది పురావస్తుశాఖ చేతిలోకి చేరి మ్యూజియంగా మారిపోయి అరుదైన చారిత్రక సంపదకు నిలయంగా మారింది. ఇప్పుడు ఈ పురాతన తాళపత్ర గ్రంథాలను భద్రపరిచి భావితరాలకు అందించాలనే సంకల్పంతో వాటిని డిజిటలైజేషన్‌ చేయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లనుంచి ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిన రామాయణం, మహాభారతం, పురాణాలతోపాటు వేదాలు, కావ్యాలు, పురాణ శతకాల సాహిత్య సంపదను ఇప్పుడు డిజిటలైజేషన్‌ చేయనుంది. దీని నిమిత్తం వీటిని తిరుపతిలోని వేదిక యూనివర్సిటీకి తరలించారు. 

కార్పొరేషన్‌(కాకినాడ): 1911లో మద్రాసులో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపించారు. అప్పట్లో ఈ పరిషత్‌ ఉమ్మడి మద్రాసులో కలిసి ఉండేది. తెలుగు భాషా వికాసానికి, సంస్కృతీ, సంప్రదాయాలకు న్యాయం చేకూర్చాలని జ యంతి రామయ్య పంతులు, వేదం వెంకటరామశాస్త్రి, కామరాజు లక్ష్మణరావు పంతులు వంటి ప్రముఖ పండితులను ఆహ్వానించి పిఠాపురం బొబ్బిలి వెంకటగిరి సంస్థానాధీశ్వరుల సాయంతో మద్రాసులో 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపించారు. దీనికి పండితులు ఒక కమిటీని కూడా నియమించారు. వారంతా తెలుగు భాషకు సంబంధించి తెలుగు నిఘంటవు తయారు చేయడం, తెలుగు గ్రంథాలను, తాళపత్ర గ్రంథాల నుంచి ప్రచురించడం చేసేవారు. పిఠాపురం, బొబ్బిలి రాజుల సహకారంతో వీటిని 1925లో కాకినాడకు త రలించారు. అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల ప్రాంతాలనుంచి ఐదువేల తెలుగు తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచారు. ఈ తాళపత్రాల్లో వేదాలు, రామాయణ, మహాభారత, పురాణ, ఇతిహాస గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు, ఇతర గద్య, పద్య కావ్యాలు వివిధ రకాల శతక గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలను సేకరించారు.

1973లో పురావస్తుశాఖకు..

ఆంధ్ర సాహిత్య పరిషత్‌ భవనాన్ని 1973లో గ్రంథాలతోపాటు రాష్ట్ర పురావస్తుశాఖకు అప్పగించారు. అప్పటినుంచి ఆంధ్ర సాహిత్య పరిషత్‌ గవర్నమెంట్‌ మ్యూజియంగా నామకరణం చేశారు. పురావస్తు పరిశోధనలతో పాటు మ్యూజియంలోని లైబ్రరీలో భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలు, వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని రీసెర్చ్‌ స్కాలర్లకు, పండితులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఒక్క పత్రంలో 14 పంక్తులు.. 

నేడు సోషల్‌ మీడియా హవా పెరగడంతో పేపర్‌ మీద పెన్ను కూడా పెట్టలేక షార్ట్‌ కట్‌లో టైపింగ్‌లు చేస్తున్నారు. కానీ ఆనాటి తాళపత్ర గ్రంథాలను పరిశీలించగా గజేంద్రమోక్షం తాళపత్ర గ్రంఽథంలో 250 పత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పత్రం రెండు అంఽగుళాలు వెడల్పు, 25 అంగుళాల పొడవు కలిగి ఉన్నాయి. ఒక్కో పత్రంలో 14 పంక్తులు వరుసగా రాయబడి ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన అతిపురాతన తాళపత్ర గ్రంథం. 

తిరిగొచ్చేనా..

పురావస్తుశాఖ కమిషనర్‌  ఆదేశాల మేరకు అతిపురాతన కాలంనాటి 4,264 తాళపత్ర గ్రంథాలను, 250 చేతి ప్రతులను, 96 బాక్సుల్లో భద్రపరిచి కాకినాడ జిల్లా కేంద్రంలోని రామారావుపేటలోని పురావస్తుశాఖ మ్యూజియంనుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తిమ్మరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేదిక యూనివర్శిటీకి డిజిటలైజేషన్‌కి తరలించారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముగించుకుని రెండు నెలల కాల వ్యవధిలో తాళపత్ర గ్రంథాలను భద్రంగా కాకినాడ మ్యూజియంకు చేర్చాలి. కానీ అలా జరుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం ఆంధ్ర, తెలంగాణ విభజన సమయంలో పురావస్తుశాఖ తవ్వకాల్లో లభించిన బంగారు నాణేలు, రాగి నాణేలు, పంచలోహ విగ్రహాలు, రాగి పత్రాలు రికార్డుల్లో చూపించడం తప్ప ఇప్పటికీ ఈ మ్యూజియానికి చేరలేదు. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్‌కు వెళ్లినవి తిరిగి ఇక్కడికి వస్తాయా.. అనే సందేహం నెలకొంది.

Updated Date - 2022-05-20T07:12:51+05:30 IST