ఆంధ్రను.. సర్వనాశనం చేశారు

Published: Mon, 28 Mar 2022 02:34:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆంధ్రను.. సర్వనాశనం చేశారు

జగన్‌ను క్షమించే ప్రశ్నే లేదు

మోదీ సపోర్టు చేయరు.. రాష్ట్రంలో దూకుడుగానే ఉన్నాం

తెలంగాణలో మాదిరిగా వ్యవస్థాగతంగా పటిష్ఠంగా లేం

కేంద్రం నిధులతో చంద్రబాబు సిమెంటు రోడ్లు వేయించారు

జగన్‌ తన పథకాలకు వాడేస్తున్నారు.. కేపిటల్‌ లేదన్న కసి ఉంది

అధిష్ఠానం సరైన సమయంలో మాకు రోడ్‌మ్యాప్‌ ఇస్తుంది

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు


ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్మోహన్‌రెడ్డి సర్వనాశనం చేశారని, ఆయన్ను క్షమించే ప్రశ్నే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అభివృద్ధి చేయడం ఆయనకు చేతకాదన్నారు. రాష్ట్రాన్ని సరైన దశ-దిశలో నడపాలన్న ఆలోచన లేని మనుషులు రాజకీయాల్లో ఉన్నందున ఏపీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో కంటే పార్టీపరంగా దూకుడుగానే ఉన్నామని చెప్పారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో వీర్రాజు పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ..


ఆర్కే: నమస్కారం వీర్రాజు గారు. బాగా తగ్గినట్లున్నారు?

సోము వీర్రాజు: నమస్కారమండీ. ఈ మధ్య ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టాను. 


మీ పార్టీ ఆంధ్రాలో పెరుగుతోందా? తెలంగాణలో ఉన్నంత దూకుడు ఏపీలో లేదంటున్నారు?

తెలంగాణ కంటే మేం చాలా దూకుడుగా ఉన్నాం. ఏపీలో ఉన్న మనుషుల సైకాలజీకి మన భావన అందడం లేదు. దానిని అధిగమిస్తాం. తెలంగాణలోనూ, ఏపీలోనూ ఎక్కడైనా బీజేపీకి మోదీయిజమే. వ్యవస్థాగతంగా తెలంగాణ అంత పటిష్ఠంగా ఏపీలో లేదు. ఇవాళ ఏపీలో ఉన్న ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలి. బీజేపీపై జరుగుతున్న దాడికి కౌంటర్‌ ఎటాక్‌ చేయాలి. అదే చేస్తున్నాం. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాను. జగన్‌ వలంటీర్‌ వ్యవస్థ మాదిరిగా మా పార్టీలో పేజ్‌ ప్రముఖ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. 


ఈ మూడేళ్లలో చంద్రబాబు వేయలేని రోడ్లు జగన్‌ వేయాలి కదా! అది అడగాలి కదా?

జగన్‌ మీద వ్యతిరేకత పెంచి చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనా మీ భావన! జగన్‌ను తక్కువ తిట్టాం.. చంద్రబాబును ఎక్కువ తిట్టాం అనేది లేదు. లిక్కర్‌పై జగన్‌ను తొలుత వ్యతిరేకించింది నేనే. జగన్‌ మద్యం బ్రాండ్లపై ఏడాది నుంచే విమర్శలు చేస్తోంది నేను. ఆవ భూముల మీద మాట్లాడిందీ నేనే. 


ఏపీని సర్వనాశనం చేసేశారని తెలంగాణలోని బీజేపీ ముఖ్య నేతలే అంటున్నారు కదా!

వాళ్లు అనడం కాదు.. నేనూ అంటున్నా. అతడిని (జగన్‌ను) ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రశ్నే లేదు. జగన్‌ వచ్చాక ఏపీకి రూ.26 వేల కోట్లు కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా రూ.30 వేల కోట్లు ఇచ్చారు. జగన్‌ హయాంలో మరో 12 వేల కోట్లు వచ్చాయి. రాబోయే రెండేళ్లలో మరో 20 వేల కోట్లు ఇచ్చారనుకోండి. ఏపీలో అభివృద్ధి పనులకు కేంద్రం ఇచ్చిన నిధులు దాదాపు 90వేల కోట్లు. అలాగే చంద్రబాబు ఉన్నప్పుడు ఏడు లక్షల ఇళ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో 20 లక్షల ఇళ్లు ఇచ్చారు. మొన్న నితిన్‌ గడ్కరీ రూ.60 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. అలాగే రూ.3 లక్షల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. అలాగే రైల్వేకు రూ.64 వేల కోట్లు ఇచ్చాం. రాజధాని చుట్టూ రూ.40వేల కోట్లు ఇచ్చాం. 


కేపిటలే లేదని అంటుంటే దాని చుట్టూ అభివృద్ధి ఏమిటి? కేపిటల్‌ లేదన్న కసి మీకుందా?

మీరు దూరంగా ఉన్నారు కాబట్టి.. రాష్ట్ర రాజధాని విషయంలో మాకున్న కసి మీకు కనిపించడం లేదు. ఏపీకి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ఏడు ఈఎ్‌సఐ ఆస్పత్రులు ఇచ్చారు. విశాఖలో ఒక ఈఎ్‌సఐ ఆస్పత్రికి అనుబంధంగా ఒక మెడికల్‌ కాలేజీ కడతామని, రూ.50 కోట్లు అదనంగా ఇవ్వాలని జగన్‌ను ఎన్నిసార్లు అడిగినా, లేఖలు రాసినా స్పందన లేదు. దానివల్ల ఒక మెడికల్‌ కాలేజీ పోయింది. ఇప్పుడు జగన్‌ మెడికల్‌ కాలేజీలు కడతాం అంటున్నారంటే అవన్నీ కేంద్రం ఇచ్చేవే. జగన్‌ నవరత్నాలు ఇస్తే మేం 25 రత్నాలు ఇస్తున్నాం. కానీ మాకు ప్రచారం రావడం లేదు. 


జరిగే అభివృద్ధి గ్రౌండ్‌లో కనిపించాలి కదా!

అవును. చంద్రబాబు ఉన్నప్పుడు పనికి ఆహార పథకం నిధులతో భారీగా గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేయించారు. అయితే ఇప్పుడు జగన్‌ కేంద్రం ఇచ్చిన డబ్బుతో జగనన్న రైతు భరోసా, జగనన్న హెల్త్‌ క్లినిక్‌, జగనన్న గ్రామ సచివాలయాలు ఇలా తన పేరిట ఉన్న పథకాలకు వాడేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి నిధులతో చేపడుతున్న నిర్మాణాలు వీళ్లవి అని చెప్పుకోవడానికి లేదు. దానిని జనంలోకి తీసుకెళ్తే మంచి స్పందన వస్తుంది. గ్రామ స్థాయిలో జగన్‌ను ప్రశ్నించే పరిస్థితి వస్తే బీజేపీ బలపడుతుంది. 


6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెబితే బడ్జెట్‌లో నిధులివ్వకపోవడం తీర్పును వెక్కిరించడమే కదా!

వెక్కిరించడమే కాదు.. అమరావతిని అభివృద్ధి చేయడం జగన్‌కు ఇష్టం లేదన్న స్పష్టమైన, స్థిరమైన అభిప్రాయం బీజేపీకి ఉంది. అతను చేయడం లేదు. అయితే అమరావతిలో కేంద్రం చేయాల్సిన అభివృద్ధి మొత్తం చేస్తాం. తాడేపల్లిలోనే బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కడతాం. 


తమకేం కావాలన్న దానిపై తెలంగాణ ప్రజలకున్నంత స్పష్టత ఏపీ ప్రజలకు ఉండదు..!

చంద్రబాబు ఆ రోజున అద్భుతంగా లెక్కలు వేసుకుని ప్యాకేజీకి అంగీకరించారు. కానీ ఆ తర్వాత జగన్‌ ట్రాప్‌లో పడి వెనక్కి వెళ్లారు. చంద్రబాబుకు ప్రధాని చెబుతూనే ఉన్నారు. అయినా వినకపోవడంతో ఆ ప్యాకేజీ కూడా ఆగిపోయింది. ప్యాకేజీలో వచ్చేవన్నీ సిద్ధంగా ఉన్నాయని మొన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ కూడా చెప్పారు. అభివృద్ధి చేయడం జగన్‌కు చేత కాదు. కానీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని నేను ప్రెస్‌ మీట్‌ పెట్టి చెబితే మీరు అసలు వార్త రాయలేదు. కొన్నిసార్లు నా పేరే తీసేస్తున్నారు. కొంచెం మాకూ స్పేస్‌ ఇవ్వండి.


ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్‌ అనడంలో అర్థం ఏమిటి?

సరైన రోడ్‌ మ్యాప్‌.. సరైన సమయంలో బీజేపీ అధిష్ఠానం ఇస్తుంది. ఆ రోడ్‌ మ్యాప్‌ ఏమిటన్నది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతాను. పొత్తుల విషయంలో మాకు స్పష్టత ఉంది. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాం. దాని గురించి ఇవాళే చెప్పండని మీరు అడగకూడదు.. అడిగినా నేను చెప్పను. జగన్‌ను టార్గెట్‌ చేయడానికి ఈ సంవత్సరం చివరి వరకూ సమయం తీసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలన్నది మా పెద్దలు చెబుతారు. నేను చెబుతాను. రోడ్‌ మ్యాప్‌ ఇంటర్నల్‌గా ఉంది. దాని గురించి పవన్‌కు తెలుసా అని మీరు నన్నడగొద్దు. మా ఇద్దరికీ ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. 


అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్‌ తదిత రాలపై బీజేపీ వ్యతిరేకతను పోగొట్టుకోవాలి కదా!

ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవలసిన బాధ్యత మాదే. ఆ నాలుగు విషయాల్లో ప్రజలను మావైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తాం. రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసుకోవాలి. దానికి డీపీఆర్‌ రెడీ అవుతోంది. స్టీల్‌ ప్లాంటు ఇప్పటి వరకూ అమ్మలేదు. మొన్నటి బడ్జెట్‌లో కూడా దానికి రూ.9 వేల కోట్లు నిధులిచ్చాం. జగన్‌ రెండు కోట్లు కూడా ఇవ్వలేదు. అమరావతి విషయంలో రైతుపై చేయి వేస్తే తోలు తీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాం. ఒక వ్యక్తి నడిపే ప్రాంతీయ పార్టీ ఆధ్వర్యంలో ఆడే ఆటలో బీజేపీ ఎప్పటికీ పావు కాబోదు. 


అసలు రాష్ట్రంలో మీ బలమెంత?

అది మీరు అడగకూడదు. మా బలం 1998లో 18 శాతం. ఎందుకు తగ్గిపోయింది.. దానినెవరు తగ్గించారనేది నా దగ్గర బ్లూ ప్రింట్‌ ఉంది. అది ఎవరెవరికి తెలియాలో.. వారి పేర్లు చెప్పను. కానీ వాళ్లకు అర్థమవుతుంది. 


వచ్చే ఎన్నికల వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా?

మూడు రోజుల్లో తీసేస్తారని మీరే రాశారు. ఇప్పటికి 8 నెలలైంది. ఇక నేనొచ్చిన తర్వాత బీజేపీ పాడైపోయిందా? 2019  ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.89 శాతం. మొన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో 5.6 శాతం ఓట్లు వచ్చాయి. బద్వేలులో 14 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన నేను ఏం నాశనం చేశాను? ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఇవన్నీ పోతే ప్రజా ఉద్యమాలపైనా, పార్టీ విస్తరించడంపైనా దృష్టి పెట్టడానికి ఎంత సమయం దొరికింది అన్నది కూడా చూడాలి. 


ఎవరు సీఎం అయ్యారన్నది కాదు... ఆ రాష్ట్రం ఏడవకుండా ఉంటే నాకు చాలు.

రాష్ట్రాన్ని నవ్వించే.. సంతోషపెట్టే బాధ్యత మాది. ఇందుకు మీ వంతు సహకారం కావాలి.


జగన్‌కు బీజేపీ పైవాళ్ల మద్దతు ఉందనే వాదన ఉంది. అమరావతి విషయంలో ఈ వేషాలు వేయొద్దని మోదీ అంటే జగన్‌ ముందుకు వెళ్తారా?

జగన్‌ను మోదీ ఎప్పటికీ సపోర్టు చేయరు. దేశంలో ఎక్కడైనా.. ఏ రాజధాని విషయంలో అయినా ప్రధాని జోక్యం చేసుకున్నారా? అమరావతిలో జరిగే అభివృద్ధి పనులను ఎప్పుడైనా మేం ఆపామా? మొన్న గడ్కరీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మంజూరు చేసిన రోడ్లకు సంబంధించిన నోట్‌లో అన్నీ కేపిటల్‌ అమరావతి అనే పేర్కొన్నాయి. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కొన్నాం కదా.. అక్కడ రోడ్లు వేసి ఇస్తే ఆ సంస్థల నిర్మాణాలను మొదలుపెడతాం. ఇప్పుడు జగన్‌ వేయడం లేదు. గతంలో చంద్రబాబూ వేయలేదు. 


పవన్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలని ప్రధాని మోదీ చెప్పారా.. అది నిజమేనా?

పవన్‌ మా అధిపతి అని నేను చెప్పా. అంతకు మించి దానిపై వివరణ ఇవ్వను. దానికి ఎలాంటి అర్థం ఉంటుందో మీరు ఊహించుకోండి. 


ముద్రగడను పార్టీలోకి తేవాలని ప్రయత్నం చేశారు కదా.. అది అవుతుందా?

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. 151 మందిమి గెలిచామని చెప్పే వాళ్లు కూడా విజయవాడలో దేవినేని నెహ్రూగారి అబ్బాయిని పక్కన పెట్టుకుంటారు. తెలుగుదేశం వాళ్లు కూడా మా పార్టీలోని వాళ్లతో మాట్లాడుతుంటారు. ఇవన్నీ సహజం. మేం కూడా అందరి దగ్గరకూ వెళ్తాం.


సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. మీరు, నేను కలవడం ఇది రెండోసారి. గతంలో మనిద్దరం కలిసింది లేదు. అలాంటిది మమ్మల్ని బాయ్‌కాట్‌ చేస్తున్నామని మీరే ఏకపక్షంగా ప్రకటన చేశారు. దాంతో నేను కూడా ఆ నలుగురిని బాయ్‌కాట్‌ చేయమని చెప్పాను. ఈ విషయంలో నా కొంచెం తిక్క ఉంది. నాకేం మొహమాటం లేదు. నేనే అన్నాను. 

మీకు తిక్క ఉంది. దానికో లెక్క ఉందిలెండి. అవును మేమే బాయ్‌కాట్‌ చేశాం.

ఆ రోజు లైవ్‌లో జరిగిన దానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంఘటన జరిగిన వెంటనే లైవ్‌ ఆపేశాం. మర్నాడు అమరావతి జేఏసీ శ్రీనివాసరావును, విష్ణువర్ధన్‌రెడ్డిని పిలిచాం. శ్రీనివాసరావు వచ్చారు. జరిగినదానికి చింతిస్తున్నా అని చెప్పమంటే ఆయన చెప్పారు. విష్ణువర్ధన్‌ రాలేదు. అయినా సరే మీరు ఏదో పెట్టుకుని మమ్మల్ని అన్నారు. మీరే ఏకపక్షంగా బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించారు. నేను కూడా ఆ నలుగురిని నిషేధించేసేయండి అన్నాను. ఆ తర్వాత మీరే కథ సుఖాంతం అన్నారు. దాంతో అయిపోయింది. మీకు, నాకు ఆస్తుల తగాదాలు లేవు. సిద్ధాంత రాద్ధాంతాలు లేవు. మీదో రాష్ట్రం.. నాదో రాష్ట్రం. ఇక్కడ బీజేపీ వాళ్లు నాతో బానే ఉంటారు. 

మీ అభిప్రాయంతో నేను వంద శాతం ఏకీభవిస్తాను. మీకు పాదాభినమస్కారాలు. నేను కూడా మా వాళ్లను వెళ్లి మీతో మాట్లాడమన్నాను.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.