ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ .. మంత్రి నాని అనుచరుడికి షాక్

ABN , First Publish Date - 2021-05-08T19:08:43+05:30 IST

‘చెత్త కంపు’ అనే శీర్షికతో ఈనెల 6న ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై...

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ .. మంత్రి నాని అనుచరుడికి షాక్

విజయవాడ : ‘చెత్త కంపు’ అనే శీర్షికతో ఈనెల 6న ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. సూపర్ స్పెషాలిటి బ్లాక్‌లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ బాధ్యతల నుంచి మంత్రి అనుచరుడిని అధికారులు తప్పించారు. అత్యంత దుర్భరంగా మారిన పారిశుద్ధ్య పరిస్థితులను యుద్ధప్రాతిపదికన చక్కదిద్దే బాధ్యతలను గతంలో ఇదే ఆస్పత్రిలో పనులు నిర్వహించిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రూ. 150 కోట్లతో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటి బ్లాక్‌లో ప్రస్తుతం కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరంతస్తుల భవనంలో కేవలం ఆరుగురు సిబ్బంది మాత్రమే పనులు నిర్వహిస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది.


నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి శానిటేషన్ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. ఇవేవీ పాటించకుండా ఆస్పత్రి అధికారులు.. మంత్రి అనుచరుడికి నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టు అప్పగించారు. ఆయన ప్రతినెలా రూ. లక్షల్లో బిల్లులు తీసుకుంటూ తక్కువ మంది సిబ్బందితో తూతూ మంత్రంగా పనులు చేయిస్తుండటంతో సూపర్ స్పెషాలిటి బ్లాక్‌ దుర్భరంగా తయారైంది. బాధితులతో పాటు డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సైతం వార్డుల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న నేపథ్యంలో ఆయా పారిశుద్ధ్య పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురిండంతో అధికారులు స్పందించారు. మంత్రి అనుచరుడికి ఇచ్చిన శానిటేషన్ కాంట్రాక్టును రద్దు చేసి గతంలో ఇదే ఆప్పత్రిలో పనిచేసిన మరో కాంట్రాక్టర్‌కు తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు కట్టబెట్టారు. సూపర్ స్పెషాలిటి బ్లాక్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు నిబంధనల ప్రకారం టెండరు ప్రక్రియను చేపట్టారు. టెండరు దక్కించుకున్న కొత్త కాంట్రాక్టు సంస్థకు త్వరలోనే వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు.

Updated Date - 2021-05-08T19:08:43+05:30 IST