HYD : మత్తు చిదిమేస్తోంది.. బెంబేలెత్తుతున్న ప్రజలు

ABN , First Publish Date - 2022-06-02T20:59:59+05:30 IST

మత్తు చిదిమేస్తోంది.. బెంబేలెత్తుతున్న ప్రజలు

HYD : మత్తు చిదిమేస్తోంది.. బెంబేలెత్తుతున్న ప్రజలు

  • డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్లే అధిక ప్రమాదాలు
  • బలవుతున్న అమాయకులు 
  • సైబరాబాద్‌ పోలీసుల ఉక్కుపాదం 
  • 5 నెలల్లో 18,662 కేసులు 

హైదరాబాద్‌ సిటీ : దుండిగల్‌ చౌరస్తాలో ఇటీవల బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ లారీని అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. నిత్యం నగరానికి వచ్చి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి లారీ డ్రైవర్‌ మద్యం మత్తుకు బలైపోయాడు.


ఇటీవల గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. తాగిన మత్తులో కారు అతివేగంతో నడిపిన వ్యక్తి హోటల్‌ వద్ద గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహిళను ఢీ కొట్టి తర్వాత డివైడర్‌ను కూడా బలంగా ఢీకొట్టాడు. మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న జూనియర్‌ ఆర్టిస్టు గాయత్రి కారులోంచి ఎగిరి రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. కారు నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ వల్ల మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇలా మద్యం మత్తులో వాహనాలు నడుపున్న వారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యానికి తోడు అధిక వేగం వల్ల చోటు చేసుకుంటున్న వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. 


బెంబేలెత్తుతున్న ప్రజలు

ఇష్టానుసారంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అమాయక ప్రజలతో పాటు తోటి వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుమీదకు రావాలంటేనే పాదచారులు, వాహనదారులు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. 


డ్రంకెన్‌ డ్రైవ్‌పై ఉక్కుపాదం

ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం మత్తు, అతి వేగమే అని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రమాదాలపై చేసిన అధ్యయనంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. దాంతో డ్రంకెన్‌ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపాలని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ట్రాఫిక్‌ అధికారులను ఆదేశించారు. పోలీసులు బృందాలుగా రంగంలోకి దిగి రాత్రి, పగలు తేడా లేకుండా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. దాంతో ఈ ఏడాది కేవలం 5 నెలల్లోనే 18,662 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2022-06-02T20:59:59+05:30 IST