GHMC : కట్టినా.. కట్టనట్టు.. ఆస్తి పన్ను చెల్లింపుల్లో గందరగోళం..!

ABN , First Publish Date - 2022-05-23T17:41:24+05:30 IST

ఎర్లీ బర్డ్‌లో భాగంగా చేసిన ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. చెల్లింపు పూర్తయినా ఇప్పటికీ బకాయి ఉన్నట్టు

GHMC : కట్టినా.. కట్టనట్టు.. ఆస్తి పన్ను చెల్లింపుల్లో గందరగోళం..!

  • చెల్లించినా ఆన్‌లైన్‌లో పెండింగ్‌ గానే..
  • ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ వర్తిస్తుందా అని ఆందోళన
  • పట్టించుకోని జీహెచ్‌ఎంసీ

- మోతీనగర్‌లో నివాసముంటున్న ఓ మహిళ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో భాగంగా గత నెలలో ఆన్‌లైన్‌ విధానంలో కార్డు ద్వారా ఆస్తిపన్ను చెల్లించారు. అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ కాగా,  ఆస్తిపన్ను బకాయి చెల్లించాలని శనివారం జీహెచ్‌ఎంసీ నుంచి ఆమె మొబైల్‌కు (Mobile) సందేశం వచ్చింది. ఆన్‌లైన్‌లో చెక్‌ చేస్తే రూ.2,563 పన్ను బకాయి అలాగే ఉంది.


- మౌలాలి హౌసింగ్‌ బోర్డుకు చెందిన ఓ వ్యక్తి తనకున్న నాలుగు ఫ్లాట్ల ఆస్తిపన్ను ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్‌లో చెల్లించాడు. ఒక ఆస్తికి సంబంధించి పన్ను చెల్లింపు సక్సెస్‌ కాగా మరో మూడు బకాయి ఉన్నట్టు చూపుతోంది.


హైదరాబాద్‌ సిటీ : ఎర్లీ బర్డ్‌లో (Early Bird) భాగంగా చేసిన ఆన్‌లైన్‌ (Online) చెల్లింపుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. చెల్లింపు పూర్తయినా ఇప్పటికీ బకాయి ఉన్నట్టు చూపుతుండడంతో పలువురు లబోదిబోమంటున్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌, సర్కిల్‌, ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘అకౌంట్‌లో నగదు కట్‌ అయ్యింది.. పన్ను బకాయి చూపుతోంది’ అని బల్దియా అధికారులను సంప్రదిస్తే బ్యాంకు వాళ్లను అడగాలని, బ్యాంకు వాళ్లు జీహెచ్‌ఎంసీకి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చెల్లింపుదారులు అయోమయానికి గురవుతున్నారు.


ఆన్‌లైన్‌లో పన్ను వసూలు చేస్తోన్న జీహెచ్‌ఎంసీలో ఒక్కసారి చెల్లింపు పూర్తయితే.. అది సక్సెస్‌ అయినా/ఫెయిల్‌ అయినా తిరిగి వస్తుందా లేక పన్ను చెల్లింపు ఖాతాలో జమవుతుందా..? అన్నది ఎవరికీ తెలియదు. కనీసం సమాధానం చెప్పే వారూ సంస్థలో ఉండరు. ఐటీ విభాగం వైఫల్యం వల్లే ఈ దుస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయితీ కోసం చాలా మంది పన్ను చెల్లించగా.. ఆన్‌లైన్‌ లావాదేవీలు పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో ఇప్పటికీ పన్ను బకాయి చూపుతోంది. ఈ నేపథ్యంలో ఐదు శాతం రాయితీ వారికి వర్తిస్తుందా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


ఆన్‌లైన్‌లో అత్యధికం..

ఏప్రిల్‌ 30వ తేదీలోపు పన్ను చెల్లిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. దీంతో పౌరులు ముందస్తు పన్ను చెల్లింపునకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో  గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.742.41 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో అత్యధికంగా 4.78 లక్షల  మంది పౌరులు రూ.333.09 కోట్ల పన్ను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించారు. సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో ఇబ్బందులు కలగడం సాధారణమే అయినా బ్యాక్‌పతో వాటిని వెంటనే సరిచేసే పరిజ్ఞానం దాదాపుగా అందుబాటులో ఉంటుంది.



Updated Date - 2022-05-23T17:41:24+05:30 IST