బడిలో భయం!

ABN , First Publish Date - 2021-04-16T06:41:37+05:30 IST

కరోనా తరుముతోంది. బడి భయపెడుతోంది.

బడిలో భయం!
విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గుంపులుగా విద్యార్థులు

కలవరపెడుతున్న కరోనా కేసులు

ప్రభుత్వ పాఠశాలల్లో 30 శాతమే హాజరు

పలు పాఠశాలల్లో నిబంధనలకు దూరం

మాస్కు సగమే.. శానిటైజర్‌ లేనేలేదు

భోజన విరామంలో గుంపులుగా విద్యార్థులు

కరోనా బారిన పలువురు ఉపాధ్యాయులు

ఈ విద్యా సంవత్సరంలో 198 మందికి కరోనా

11 మంది మృత్యువాత

విద్యార్థులకు కరోనా పరీక్షల ఊసే లేదు

కలవరపెడుతున్న అజాగ్రత్త

పాఠశాలల్లో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన


కరోనా తరుముతోంది. బడి భయపెడుతోంది. కేసులు రోజురోజుకూ రెట్టింపవుతుండడం, వైరస్‌ బారిన పడినవారిలో ఉపాధ్యాయులు కూడా ఉండడంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులే హాజరవుతున్నా, అనేక పాఠశాలల్లో నిబంధనలపై దృష్టి సారించడం లేదు. చాలా పాఠశాల్లో కరోనా నియంత్రణ చర్యల ఊసే లేదు. ఈ విద్యాసంవత్సరంలో 198 మంది ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడగా, 11 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ 212 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు పరీక్షలే నిర్వహించకపోవడంతో ఎంతమంది లక్షణాలు లేకుండా వైరస్‌తో ఉన్నారో చెప్పలేని పరిస్థితి. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో బుధవారం ఆంధ్రజ్యోతి బృందం జిల్లావ్యాప్తంగా పాఠశాలలను పరిశీలించింది. అనేక పాఠశాలల్లో నిబంధనల అమలుపై ఉపాధ్యాయులు దృష్టిపెట్టకపోవడాన్ని గుర్తించింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం)

కరోనా సెకండ్‌ వేవ్‌ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో జిల్లావ్యాప్తంగా సర్కారు బడుల్లో హాజరు 30 శాతానికి పరిమితమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో ఎవరికి కరోనా సోకిందో తెలియని పరిస్థితి. వారిలో లక్షణాలు భయటపడటానికి సమయం పడుతుండటం, లేదా అసలు లక్షణాలే కనిపించకపోవడంతో వారు కరోనా వాహకాలుగా మారుతున్నారు. చాలా పాఠశాల్లో కరోనా నియంత్రణ చర్యల ఊసే ఉండటం లేదు. గత ఏడాది నవంబరులో 9,10 తరగతులు ప్రారంభం కాగా, అప్పట్లో శానిటైజర్లు, సబ్బులు ఉపయోగించేవారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో ఐఆర్‌ థర్మామీటర్‌తో పరీక్షించాల్సి ఉన్నా, నామమాత్రంగానే చూస్తున్నారు. పాఠశాల గ్రాంటు నుండి శానిటైజర్లు, ఇతరత్రాలు కొనుగోలు చేయాలని  విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు అమలకు నోచుకోవడం లేదు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు సొంత ఖర్చుతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. 


198 మంది ఉపాధ్యాయులకు కరోనా

ఈ విద్యాసంవత్సరంలో 198 మంది టీచర్లు కొవిడ్‌ బారిన పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి వారిలో11మంది టీచర్లు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 212 మంది విద్యార్థులు కొవిడ్‌ బారినపడి కోలుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో పేర్కొన్నారు.  కొవిడ్‌ వ్యాప్తి కారణంగా అధికశాతం విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా 3,078 పాఠశాలల్లో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ఉండగా, 2,98,950 మంది విద్యార్థులకు బుధవారం మధ్యాహ్న భోజనం పెట్టినట్టు విద్యాశాఖ అఽధికారులు తెలిపారు.  


నిలువెత్తు నిర్లక్ష్యం

పాఠశాలల్లో కొవిడ్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. బుధవారం  ఆంధ్రజ్యోతి బృందం వెళ్లిన సమయంలో  మచిలీపట్నంలోని  రుస్తుంబాద మునిసిపల్‌ బాలికల ఉన్నత పాఠశాల (పార్కు  స్కూలు)లో 370 మంది విద్యార్థులుండగా వారిలో 81మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వచ్చారు. తాగునీటి కుళాయిల వద్ద విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు చిన్నపాటి సబ్బు మాత్రమే అందుబాటులో ఉంచారు.   పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి గది ద్వారం బయట ఉండాల్సిన శానిటైజర్‌ స్టాండ్‌ను లోపల పెట్టారు.  బాలికలు తమ వెంట వాటర్‌బాటిల్‌, శానిటైజర్‌ బాటిళ్లు తెచ్చుకున్నారు. ముఖాలకు మాస్క్‌లు పెట్టుకున్నా, కొందరు వాటిని గడ్డం కిందకు లాగేస్తున్నారు.  


సబ్బులూ, శానిటైజర్లు ఎక్కడ?

మచిలీపట్నం దేశాయిపేట మునిసిపల్‌ ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాలల్లో 460 మంది విద్యార్థులకు గాను, బుధవారం 240 మంది హాజరయ్యారు. ఇక్కడ చాలినన్ని గదులు లేకపోవడంతో 2, 4 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వచ్చారు. 1, 3, 5 తరగతుల విద్యార్థులు గురువారం వస్తారని ఉపాధ్యాయులు తెలిపారు. 240 మంది విద్యార్థులు హాజరు కాగా, 125 మందికి మాత్రమే మధ్యాహ్న భోజనం వండారు. మిగిలిన విద్యార్థులు ఇక్కడ భోజనం చేయడానికి ఇష్టపడటంలేదని టీచర్లు అంటున్నారు. ఇక్కడ ప్రాథమిక తరగతుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం లేదు. కుళాయిల వద్ద చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులు లేవు. కొంతమంది విద్యార్థులు మాస్క్‌లు కూడా పెట్టుకోలేదు.  విద్యార్థులను వరండాల్లో, అసంపూర్తిగా నిర్మించిన గదుల్లో కూర్చోబెట్టి విద్యాబోధన చేస్తున్నారు.  అయితే పిల్లలు భౌతిక దూరం పాటించకున్నా పట్టించుకోవడం లేదు. 

కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో ఇద్దరు పాఠశాల ఉపాధ్యాయులకు కరోనా రావడంతో పాఠశాల మూసివేశారు. 


విస్సన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో 650 మంది విద్యార్థులకుగాను 12 మంది హాజరయ్యారు. ఈ పాఠశాల హెచ్‌ఎం గతంలో కరోనా బారిన పడడంతో భయంతో విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. 


రెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్‌లో 30 శాతం హాజరు నమోదైంది. 


మండవల్లి జెడ్పీ హైస్కూల్‌లో మహిళా టీచర్‌కు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదు. 


జగ్గయ్యపేట హైస్కూల్‌లో పిల్లలు ఒకేచోట కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. జగ్గయ్యపేట జీవీజే బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాస్కులతో వస్తున్నా దూరం పాటించడం లేదు. ఒక్కో క్లాసులో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. 955 మందికిగాను 327 మందే వచ్చారు. అందరికీ ఒక్కచోటే భోజనం వడ్డిస్తుండడంతో, గుంపులుగా కూర్చొని భోజనం చేస్తున్నారు. 


జగ్గయ్యపేట మండలం అన్నవరం, షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామాల్లోని మండల పరిషత్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు కరోనా రావడంతో విద్యార్థులు పాఠశాలకు తక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. 


కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 650 మంది విద్యార్థులు ఉన్నారు. తగినన్ని తరగతి గదులు లేని కారణంగా నిబంధనలు పాటించకుండా, ఉన్న గదుల్లోనే అందరినీ సర్దుబాటు చేస్తున్నారు. 


44వ డివిజన్‌ లేబర్‌ కాలనీలోని హైస్కూల్‌, ఎలిమెంటరీ విభాగాల్లో శానిటైజేషన్‌ అంశం మరుగున పడింది. కరోనా వ్యాప్తి నివారణలో  భాగంగా విద్యార్ధులు శానిటైజేషన్‌ చేసుకున్నారా? లేదా అన్న విషయం పట్టించుకోకుండానే వార్ని తరగతి గదుల్లోకి అనుమతిస్తున్నారు. తరగతి  గదుల్లో ఇరుకుఇరుకుగా పిల్లలు కూర్చుంటున్నా పట్టించుకోవడం లేదు. మూడు తరగతుల విద్యార్ధులను రెండు గదుల్లో కలిపేసి పాఠాలు చెబుతున్నారు. 


మాస్కులెక్కడ?

నాలుగు వందల మంది విద్యార్థులున్న తోట్లవల్లూరు జడ్పీ హైస్కూల్లో మాస్క్‌లే ధరించటం లేదు. ఓ తరగతి గదిలో 20 మంది విద్యార్ధులకు ఇద్దరు మాత్రమే మాస్క్‌లు ధరించారు. సామాజిక దూరం అమలు కావటం లేదు. శానిటైజర్‌ వినియోగమే లేదు. విద్యార్థులు కలిసి కూర్చోవటం, అన్ని వస్తువులనూ పట్టుకుంటున్న చేస్తున్నా శానిటైజర్‌ వాడకం లేదు. ఇటీవల ఈ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఇక్కడ కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


గన్నవరంలో నిబంధనలకు దూరం

గన్నవరం మండలంలోని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలకు పాతర వేశారు. మాస్కును తప్పనిసరి చేసినా.. పాఠశాలల్లో పిల్లలు మాస్కు ధరించటం లేదు. మాస్కు ఉన్నా, గడ్డం కిందకు జరుపుకోవడం అలవాటులా మారిపోయింది. భయం చెప్పాల్సిన ఉపాఽధ్యాయులు వదిలివేయటంతో.. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గన్నవరం బాలుర హైస్కూల్‌లో విద్యార్థులు మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. మండల పరిషత్‌ స్కూల్‌లో విద్యార్థులు గుంపులుగా కూర్చుంటున్నారు. సగం మందే మాస్కులు ధరిస్తున్నారు. దావాజీగూడెం హై స్కూల్‌లో విద్యార్థులు మాస్కు ధరించటం లేదు. భౌతిక దూరం అసలే పాటించటం లేదు. తరగతి గదుల్లో విద్యార్థులను కుక్కేస్తున్నారు. భోజన విరామ సమయంలో ఒకేచోట కూర్చుంటున్నారు. వారించాల్సిన ఉపాధ్యాయులు వదిలేశారు.  గొల్లనపల్లి పాఠశాలలో సగం మంది మాత్రమే మాస్కులు ధరించారు.


కోర్టు సుమోటోగా తీసుకుని విద్యార్థుల జీవితాలను కాపాడాలి 

కోర్టుల్లో ఇప్పటికీ ప్రవేశం లేదు. సచివాలయాల్లోకీ ప్రవేశం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశానికి అనేక ఆంక్షలు ఉన్నాయి. మరి స్కూల్స్‌ ఎందుకు తెరుస్తున్నారు? కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలి. విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి కాపాడాలి. బతికి ఉంటే వచ్చే ఏడాది పిల్లలు ఇంకా చక్కగా చదువుకుంటారు. జీవితం కంటే చదువు ముఖ్యమని అనుకోవటం లేదు. విద్యా క్యాలెండర్‌ గాడి తప్పకుండా ఉండేందుకు పరీక్షలు రద్దు చేసి, ఎప్పటిలాగా వేసవి సెలవులు ప్రకటించాలి. లేకుంటే ఈ ప్రభావం వచ్చే ఏడాది కూడా పడే అవకాశం ఉంటుంది. కోర్టులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విద్యార్థుల జీవితాలను కాపాడాలి.  - వల్లభనేని సత్యనారాయణ, నగర పౌరుడు 



Updated Date - 2021-04-16T06:41:37+05:30 IST