నొప్పి పెడుతుంది కీర్తి అన్న మంత్రి మేకపాటి.. ఐదు నిమిషాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లినా..!

ABN , First Publish Date - 2022-02-21T23:05:08+05:30 IST

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్ రెడ్డి జిమ్ చేస్తూ..

నొప్పి పెడుతుంది కీర్తి అన్న మంత్రి మేకపాటి.. ఐదు నిమిషాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లినా..!

హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్‌రెడ్డి జిమ్ చేస్తూ గుండె పోటుకు గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఓ ఫంక్షన్‎లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరుకున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 6.00 గంటలకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్నారని చెప్పారు. 



‘‘06:30 గం.ల వరకూ మంత్రి ఫోన్‌లతో కాలక్షేపం చేశారు. 07.00 గం.లకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చున్నారు. 07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి మంత్రి చెప్పారు. 07:15గం.లకు  హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగారు. 7:16 గం.లకు కంగారు పడి మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి గట్టిగా అరిచారు. మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు 07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతి మీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించారు. 07:20 గం.లకు  మంత్రి మేకపాటి పక్కనే ఉన్న  భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు. 07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉండటంతో వ్యక్తిగత సిబ్బందిని భార్య శ్రీకీర్తి పిలిచారు. 07:22 "నొప్పి పెడుతుంది కీర్తి" అంటూనే వెంటనే ఆస్పత్రికి వెళదామని సిబ్బందితో కలిసి మంత్రి బయలుదేరారు. 07:27కు ఇంటి నుంచి ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటిని డ్రైవర్, సిబ్బంది చేర్చారు. 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. 09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని వైద్యులు నిర్ధారించారు. 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.’’ అని మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. 


Updated Date - 2022-02-21T23:05:08+05:30 IST