మహిళల్లో రక్త హీనత

ABN , First Publish Date - 2021-10-26T06:10:10+05:30 IST

జిల్లాలోని మహిళల్లో రక్త హీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

మహిళల్లో రక్త హీనత

ప్రతి ఇద్దరిలో ఒకరిని వేధిస్తున్న సమస్య

జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల మహిళల్లో ఎక్కువ

గర్భిణుల్లో మరింత అధికంగా ఉంటోందన్న వైద్యులు

లక్షణాలు...తీవ్రమైన అలసట, కళ్లు పాలిపోవడం, ఆయాసం, గుండె దడ 

పోషకాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలోని మహిళల్లో రక్త హీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సుమారు 59 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు  జాతీయ కుటుంబ ఆరోగ్య సమగ్ర సర్వేలోనూ వెల్లడైంది.  ముఖ్యంగా గర్భిణుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ కనిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులైన ఘోషా, కేజీహెచ్‌, ఈఎన్‌టీ వంటి ఆస్పత్రులకు వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే మహిళలకు పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ విషయం వెల్లడవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు.


గర్భిణుల్లో అధికం

సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణుల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంటోంది. ప్రతి ముగ్గురు గర్భిణుల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గర్భిణిగా వున్న సమయంలో ఐరన్‌ ఎక్కువ అవసరమవుతుందని, ముందు నుంచీ రక్తహీనతతో బాధపడుతున్న వాళ్లకు...ఆ సమయంలో సమస్య వస్తోందంటున్నారు. జిల్లాలో ఏటా సుమారు 80 వేల మంది గర్భం దాలుస్తుండగా, వీరిలో 50 వేల మందికిపైగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొంటున్నారు. రక్తహీనతతో బాధపడే గర్భిణులకు సిజేరియన్‌ చేయాల్సిన అవసరమేర్పడుతుందని చెబుతున్నారు. 


పురుషులనూ వేధిస్తున్న రక్తహీనత

జాతీయ కుటుంబ ఆరోగ్య సమగ్ర సర్వే ప్రకారం మహిళలే కాకుండా పురుషులు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో పదకొండు శాతం మంది పురుషులు రక్త హీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది జిల్లాలో కాస్త ఎక్కువగా వుండే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా వుంటుందని విశ్లేషిస్తున్నారు. అదే విధంగా ఆరు నెలల నుంచి 59 నెలల మధ్య వయసు కలిగిన చిన్నారుల్లో 63 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 


ఇదీ ప్రధాన కారణం

రక్త హీనత బారినపడడానికి ప్రధాన కారణం పోషకాహార లోపంగా వైద్యులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న ఎక్కువ మందిలో ఐరన్‌ లోపం కనిపిస్తోంది. అదేవిధంగా ఏ, బీ 12, బీ 2, సీ, డీ, ఈ విటమిన్లు, రాగి, జింక్‌ లోపం వల్ల రక్తహీనత బారినపడుతున్నారు. రక్తహీనతతో బాధపడే వారిలో తీవ్రమైన అలసట, కళ్లు పాలిపోవడం, ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్‌ పరీక్ష ద్వారా రక్తహీనతను నిర్ధారించవచ్చు. హిమోగ్లోబిన్‌ 11 గ్రాములు వుంటే రక్తహీనత సమస్య లేనట్టుగా భావించాలి. అంతకంటే తక్కువ ఉంటే...పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఏడు గ్రాముల కంటే తక్కువగా వుంటే మాత్రం ఇబ్బందికరంగా భావించాలి. గర్భిణుల్లో హిమోగ్లోబిన్‌ తక్కువగా వుంటే పుట్టే పిల్లలపై ప్రభావముంటుందని వైద్యులు చెబుతున్నారు. బరువు తక్కువగా పుట్టడం, ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. 


పోషకాహారంతో చెక్‌

పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యకు చెక్‌ చెప్పవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలు, మాంసం, డ్రైఫ్రూట్స్‌, పండ్లు తీసుకోవాలి. బెల్లం, చిక్కీలు వంటివి రోజూ తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య బారినపడకుండా వుండవచ్చునని వైద్యులు చెబుతున్నారు. చాలామందికి పోషకాహారం తీసుకునేందుకు అవకాశమున్నప్పటికీ..నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య బారినపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ మందులను అందిస్తారు. 


ఎక్కువ మందిలో రక్త హీనత సమస్య

డాక్టర్‌ పద్మావతి, ప్రముఖ గైనకాలజిస్ట్‌

వివిధ సమస్యలతో వచ్చే మహిళలకు పరీక్షలు నిర్వహించినప్పుడు ఎక్కువ మందిలో రక్తహీనత సమస్య కనిపిస్తోంది. గర్భిణుల్లో అయితే ఇది ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా గర్భం దాల్చిన తరువాత ఐరన్‌ ఎక్కువ అవసరమవుతుంది. సాధారణ మహిళల్లో రక్తహీనత సమస్య నివారణకు పోషకాహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. అదే గర్భిణులైతే పోషకాహారంతోపాటు కొన్నిరకాల మందులు వినియోగించాల్సి ఉంటుంది. నీరసంగా ఉండడం, కళ్లు తిరగడం, ఆయాసపడడం వంటి ఇబ్బందులను రక్తహీనతతో బాధపడే మహిళలు ఎదుర్కొంటుంటారు. 

Updated Date - 2021-10-26T06:10:10+05:30 IST